Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 179697
      [news_title_telugu_html] => 

సాహో స్వర్ణ సింధు

[news_title_telugu] => సాహో స్వర్ణ సింధు [news_title_english] => [news_short_description] => నాడు రియో ఒలింపిక్స్‌లో సింధు గెలిచింది రజతమే. కానీ దేశమంతా స్వర్ణాన్ని మించిన సంబరాలు. క్రికెట్‌ మైకంతో ఊగిపోయే దేశంలో ఒక బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణికి ఇంతటి ఆదరణా అని ఆశ్చర్యపోయేంతగా సింధుపై అభినందనలు, నజరానాల వర్షం! కానీ అవన్నీ చూసి ఆమె విర్రవీగలేదు! ఏ విజయమూ ఆమెను విశ్రమించేలా చేయలేదు! [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/QXlvCw7QkRw [news_videoinfo] => |https://www.youtube.com/embed/QXlvCw7QkRw [news_sections] => ,27,26, ) )
సాహో స్వర్ణ సింధు - EENADU
close
సాహో స్వర్ణ సింధు

ఇది చరిత్ర ఎరుగని విజయం..
తరతరాలు గుర్తుండే ఘన విజయం.

కొన్నేళ్ల కిందటి వరకు ఏదో ఒక పతకం గెలిస్తేనే అద్భుతం అనుకునే ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా స్వర్ణమే కొల్లగొట్టి దేశం గర్వించేలా చేసింది తెలుగు తేజం... మన సింధు..

అయితే ఇది కేవలం ఓ ఆటలో విజయమే కాదు..
ఆటను దాటి అందరూ నేర్చుకోదగ్గ ఓ పాఠం!

విజయంతో విశ్రమించేవాళ్లు కొందరు..
విజయంతో విర్రవీగేవాళ్లు కొందరు..
విజయం చేజారితే కుంగిపోయేవాళ్లు కొందరు..
విమర్శలకు నీరుగారిపోయేవాళ్లు మరి కొందరు..
అందరికీ గొప్ప పాఠమే నేర్పింది
మన బంగారు సింధు!

నాడు రియో ఒలింపిక్స్‌లో సింధు గెలిచింది రజతమే. కానీ దేశమంతా స్వర్ణాన్ని మించిన సంబరాలు. క్రికెట్‌ మైకంతో ఊగిపోయే దేశంలో ఒక బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణికి ఇంతటి ఆదరణా అని ఆశ్చర్యపోయేంతగా సింధుపై అభినందనలు, నజరానాల వర్షం! కానీ అవన్నీ చూసి ఆమె విర్రవీగలేదు! ఏ విజయమూ ఆమెను విశ్రమించేలా చేయలేదు!

ఒలింపిక్స్‌లోనే కాదు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ రెండుసార్లు స్వర్ణం అందినట్లే అంది చేజారింది. సింధు తుది మెట్టుపై బోల్తా కొట్టింది. కానీ ఈ ఓటములతో ఆమె కుంగిపోలేదు!

విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో, ఓటములు నేర్పిన పాఠాలతో.. సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ వేదికపై అత్యున్నత విజయాన్నందుకుంది. పట్టుబట్టి పసిడి కలను నెరవేర్చుకుంది.

రెండేళ్ల కిందట తన ఆశల్ని తుంచేసిన ఒకుహరనే చిత్తుగా ఓడించి స్వర్ణం చేజిక్కించుకోవడంతో ఈ విజయం సింధుకు మరింత మధురం! మైదానంలో అడుగు పెడితే ఒక పట్టాన లొంగని ఒకుహరను నిస్సహాయురాలిగా మార్చిన వైనం ఆమె అసాధారణ నైపుణ్యానికి, తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనం!

ఆదివారం ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు  21-7, 21-7తో జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహరను ఓడించింది. 
2017లో ఇదే టోర్నీ ఫైనల్లో సింధు.. ఒకుహర చేతిలోనే ఓడింది.

మన బంగారానికి బంగారం

చరిత్ర సృష్టించిన సింధు

ఫైనల్లో ఒకుహర చిత్తుచిత్తు
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత షట్లర్‌గా రికార్డు
బాసెల్‌ (స్విట్జర్లాండ్‌)

భారత స్టార్‌ షట్లర్‌.. తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు సాధించింది. బ్యాడ్మింటన్‌లో అత్యున్నత వేదికపై చరిత్ర సృష్టించింది. విశ్వవేదికపై ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మరే భారత క్రీడాకారుడికి సాధ్యంకాని.. ఎవరూ అందుకోలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించింది.

2013 కాంస్యం.. 2014.. కాంస్యం.. 2017.. రజతం.. 2018 రజతం.. 2019.. స్వర్ణం! ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు ప్రస్థానమిది. చరిత్ర సృష్టించడం అలవాటుగా మార్చుకున్న సింధు మరో అద్భుతం చేసింది. ఎప్పట్నుంచో ఊరిస్తున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకాన్ని ఎట్టకేలకు చేజిక్కించుకుంది. వరుసగా మూడో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన సింధు బంగారు పతకంతో మురిపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సింధు 21-7, 21-7తో మూడో సీడ్‌ నొజొమి ఒకుహర (జపాన్‌)ను చిత్తుచేసింది. కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి.. 2017 ప్రపంచ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలతో ఒలింపిక్‌ మాజీ ఛాంపియన్‌ జాంగ్‌ నింగ్‌ (చైనా)  రికార్డును సమం చేసింది.

సాహో సింధు
2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సింధు, ఒకుహర తలపడ్డారు. 110 నిమిషాల పాటు సాగిన ఆ పోరు బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే అత్యుత్తమ మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. కోర్టులోనే కుప్పకూలే వరకు పోరాడిన సింధు చివరికి ఓడిపోవడం కోట్లాది మంది భారతీయుల గుండెల్ని పిండేసింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మరోసారి సింధు, ఒకుహర కలబడ్డారు. కానీ అప్పటిలా మ్యాచ్‌ సుధీర్ఘంగా సాగలేదు. ప్రత్యర్థి అసలు సోదిలోనే లేదు. సింధు దెబ్బకు మాజీ ఛాంపియన్‌ అనామక క్రీడాకారిణిగా మారిపోయింది. కళ్లుచెదిరే స్మాష్‌లకు.. మెరుపు వేగంతో సింధు సంధించిన రిటర్న్‌లకు ప్రత్యర్థి దగ్గర బదులే లేకపోయింది. 2017 ఫైనల్‌ 110 నిమిషాలు సాగగా.. అందులో మూడో వంతు సమయంలోనే ఆదివారం నాటి తుదిపోరు ముగియడం విశేషం. ఒకుహర ఆట.. శైలిపై పూర్తి అంచనా, పక్కా వ్యూహంతో బరిలో దిగిన సింధు ఊహించని రీతిలో ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. ర్యాలీలు సుధీర్ఘంగా ఆడే ఒకుహరకు అందనంత వేగం.. అదిరిపోయే స్ట్రోక్‌లతో షాకిచ్చింది. షటిల్‌పై పూర్తి నియంత్రణ.. కచ్చితత్వంతో కూడిన షాట్‌ సెలెక్షన్‌.. వేగం.. దూకుడు.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సింధు బెబ్బులిలా విరుచుకుపడింది. తొలి గేమ్‌లో మొదటి పాయింటు నెగ్గడమొక్కటే మ్యాచ్‌లో ఒకుహరకు సానుకూలాంశం! అక్కడ్నుంచి ఆటంతా సింధుదే. ఆమె స్ట్రోక్‌లను బదులివ్వలేక ప్రత్యర్థి చేతులెత్తేసింది. ప్రత్యర్థి ఊహించలేనంతగా ఒకే షాట్‌ను రెండు, మూడు విధాలుగా ఆడుతూ అసలైన ప్రపంచ ఛాంపియన్‌ అనిపించుకుంది. 16 నిమిషాల్లో ముగిసిన తొలి గేమ్‌లో వరుసగా 7 పాయింట్లతో   8-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది సింధు. సింధు దూకుడును ఎదుర్కోవడం కష్టమని భావించిన ఒకుహర ఆమెను ర్యాలీ గేమ్‌ వైపునకు మళ్లించినా ఫలితం లేకపోయింది. సింధు పదునైన రిటర్న్‌లకు ప్రత్యర్థి బెంబేలెత్తిపోయింది. ఒకుహర కోర్టు నలువైపులా తిప్పుతూ.. వరుస పాయింట్లతో హోరెత్తించిన సింధు 18-5తో స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. 19-7తో మరింత ముందంజ వేసిన సింధు 21-7తో తొలి గేమ్‌ను పూర్తి చేసింది. రెండో గేమ్‌ కూడా తొలి గేమ్‌ మాదిరే సాగింది. రెట్టింపు దూకుడు.. ఎటాకింగ్‌ గేమ్‌తో ఒకుహరను సింధు మరింత ఒత్తిడిలోకి నెట్టింది. 11-4తో ఆధిక్యం సంపాదించిన సింధు.. చూస్తుండగానే 19-7తో మ్యాచ్‌కు చేరువైంది. కళ్లుచెదిరే స్మాష్‌తో  పాయింటు నెగ్గిన సింధు.. అద్భుతమైన రిటర్న్‌తో ఒకుహర ఆట కట్టించింది.

చిత్రంలో చూశారా మన సింధును.. ఆ మోములో ఎంతో ప్రశాంతత.. అంతులేని సంతృప్తి! దశాబ్దాల దేశం నిరీక్షణకు తెరదించుతూ.. ఎన్నో ఏళ్ల తన నిర్విరామ శ్రమకు ఫలితం పొందుతూ.. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్న వేళ సింధు హావభావమిది! ఊరించి ఊరించి.. చిక్కినట్లే చిక్కి రెండుసార్లు చేజారిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణాన్ని పట్టుబట్టి సాధించింది మన తెలుగుతేజం. రెండేళ్ల కిందట ఎవ్వరైతే తన పసిడి కలను భగ్నం చేశారో.. అదే ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది సింధు.

టోర్నీలో సింధు వరుసగా తై జు యింగ్‌, చెన్‌ యుఫెయ్‌, ఒకుహరలను ఓడించడం గొప్ప విషయం. ఫైనల్లో ఎక్కడా తడబడకుండా మ్యాచ్‌ను ముగించింది. సెమీస్‌లో వరుస సెట్లలో మ్యాచ్‌ను ముగించడం సింధుకు కలిసొచ్చింది. సుదీర్ఘ సెమీస్‌ వల్ల ఒకుహర అలసిపోయింది. ప్రతి పెద్ద టోర్నీలో సింధు పతకాలు సాధించి అత్యుత్తమ క్రీడాకారిణగా నిలిచింది’’

- ‘ఈనాడు’తో పుల్లెల గోపీచంద్

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.