
సర్కారీ భూముల లెక్కలు తీస్తున్న రెవెన్యూ శాఖ
హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, సింగరేణి.. ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన భూములు ఎన్ని? వాటిలో ఎంతమేరకు వినియోగంలో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న విస్తీర్ణం ఎంత? ఆయా భూముల్లో ఆక్రమణలు, కబ్జాలపై తీసుకున్న చర్యలేమిటి? మొత్తం రెవెన్యూశాఖ పరిధిలో ఎన్ని భూములున్నాయి? వాటి పరిస్థితిపై నివేదిక ఇవ్వండి.
ఈనాడు, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆదాయం తగ్గిందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఓ ఆదాయ వనరుగా చూస్తోంది. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో లెక్కలు వెలికి తీసే పనిలో పడింది. ప్రభుత్వం నుంచి భూములు పొందిన వివిధ సంస్థలు ఎంత మేరకు వాటిని వినియోగిస్తున్నాయి.. మరెంతమేరకు ఆక్రమణల పాలయ్యాయి.. అనే అంశాలపై రెవెన్యూ శాఖ ఆరా తీస్తోంది. భూముల విక్రయం ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరిస్తామని ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖ సర్కారీ భూముల లెక్కలను వెలికి తీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రభుత్వ భూమిని తీసుకున్నా పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెవెన్యూశాఖ సమాయత్తమవుతోంది.
సమగ్ర వివరాల సేకరణ
ప్రభుత్వం నుంచి ప్రభుత్వ శాఖలు, సంస్థలకు కేటాయించిన భూముల వివరాలను సమగ్రంగా తెలియజేయాలని రెవెన్యూశాఖ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించింది. ఒక్కో మండలంలో ఎంత విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రభుత్వ శాఖలకు, పేదల గృహ నిర్మాణాలు, స్థానిక సంస్థలకు ఎంత కేటాయించారు, ఎంత అన్యాక్రాంతం అయింది, కట్టడికి తీసుకున్న చర్యలు, నమోదైన కేసులు ఏమిటి? ఇవన్నీ పోను రెవెన్యూ ఆధీనంలో ఉన్న భూ విస్తీర్ణమెంత అనేవి స్పష్టంగా తెలియజేయాలని కోరింది.
రక్షణ చర్యలపై దృష్టి
పలు ప్రభుత్వ సంస్థలు పరిశ్రమలు నెలకొల్పుతామని ఒప్పందంలో పేర్కొన్నప్పటికీ ఏళ్లతరబడి పడావుగా వదిలేస్తున్నాయి. దీంతో కొన్నిచోట్ల ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో భూములు చేతులు మారి క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులూ ఉన్నాయి. వాస్తవానికి నిర్ణీత సమయంలో భూములను లక్ష్యానికి అనుగుణంగా వినియోగించకపోతే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలనే నిబంధనలు ఉన్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములు ఆక్రమణల పాలవుతున్నా ఆయా శాఖలు పట్టించుకోవడంలేదు. రెవెన్యూ అధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉండటం దీనికో కారణంగా కనిపిస్తోంది.
* రెండేళ్ల క్రితం గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్ జిల్లా మినహా) ప్రభుత్వ సంస్థల పరిధిలో 13.82 లక్షల ఎకరాలు, ప్రభుత్వం వద్ద 41.74 లక్షల ఎకరాల ఖాళీ స్థలం ఉన్నట్లు దస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూముల్లోనూ కబ్జాలను తేల్చి వాటి రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకునేందుకు రెవెన్యూశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు