close
పార్టీకి ఓనర్లు ఉండరు

తామే యజమానులమంటూ ఎవరూ మాట్లాడొద్దు
క్రమశిక్షణ ఉల్లంఘన డెంగీ కంటే ప్రమాదకరమైనది
వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు
కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులొస్తాయ్‌
తెరాస కార్యదర్శుల సమావేశంలో కేటీఆర్‌ వ్యాఖ్యలు

ఆస్తులకు ఓనర్లు ఉంటారు తప్ప అస్తిత్వాలకు ఉండరు. నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక తెరాస. ఎవరికి వారు నేనే ఓనర్‌ అంటూ మాట్లాడం సరికాదు. - కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏ మాత్రం సహించేది లేదని, ఎంతటి వారైనా ఉపేక్షించబోమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడడం డెంగీ వ్యాధికన్నా ప్రమాదకరమైందని ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం అన్ని కోణాల్లో పరిశీలించి మంత్రివర్గ విస్తరణ చేపట్టగా కొందరు తమకు తోచిన విధంగా మీడియాలో ప్రకటనలు చేస్తుండడం సహేతుకం కాదని అన్నారు. త్వరలోనే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసి వీటన్నింటిపై చర్చిస్తారని, నిర్దిష్ట చర్యలు తీసుకుంటారని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలు వారిని ప్రశ్నించాలని, తాను మాట్లాడినా ప్రశ్నించవచ్చని అన్నారు. తెరాస నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక అని, పార్టీకి యజమానులం తామేనంటూ ఎవరూ చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చేయరాదని అన్నారు. కేటీఆర్‌ బుధవారం తెలంగాణభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణ ద్వారా ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చారు. ఇంకా వేల సంఖ్యలో పదవులున్నాయి. ఇప్పటికే 60 లక్షల కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా తెరాస నిలిచింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలి. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతో కీలకమైంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వలేదు. కమిటీలను వెంటనే పూర్తి చేయాలి. దసరాకు మొత్తం 31 జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలి. ప్రస్తుతం 22 చోట్ల నిర్మాణాలు  జరుగుతున్నాయి. మిగిలినవాటిలో ఒక్కో గది నిర్మించి అయినా వాటిని ప్రారంభించాలి.

అధిష్ఠానమే టికెట్లు ఇస్తుంది
పురపాలక ఎన్నికల టికెట్లను తామే ఇస్తామని ఇన్‌ఛార్జులుగా ఉన్న కొందరు ప్రధాన కార్యదర్శులు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రులు ఫిర్యాదు చేశారు. ఇలాంటివాటిని సహించేది లేదు. టికెట్లను అధిష్ఠానమే ఇస్తుంది. ఈ విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలి. సంపూర్ణ విజయానికి కృషి చేయాలి. ప్రసార మాధ్యమాల్లో కొన్ని అధికార పార్టీకి శత్రువులుగా ఉన్నాయి. పార్టీకి నష్టపరిచేందుకు అవి ప్రయతిస్తుంటాయి. వాటి ఉచ్చులో పడొద్డు. కష్టపడి పనిచేస్తూ, పార్టీ అభ్యున్నతికి కృషి చేసే నేతలు, కార్యకర్తలకు తప్పనిసరిగా పదవులు లభిస్తాయి. సీనియర్‌ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్లు ఉంటాయి. ఈ శాసనసభ సమావేశాల్లో కమిటీ ఛైర్మన్ల నియామకం జరుగుతుంది. సమావేశాల అనంతరం నియమిత పదవులను భర్తీ చేస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పురపాలక సంఘాలవారీగా నివేదికలను అందజేశారు. ఇకపై ప్రతి నెలా రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సమావేశంలోని వివరాలను బహిర్గతం చేయరాదని నేతలకు సూచించారు.

కేటీఆర్‌కు ఘనస్వాగతం
రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శంబీపూర్‌ రాజు అధ్వర్యంలో జెండాలు చేతబట్టి కార్యకర్తలు నినాదాలు చేశారు.

పదవులు ఆశించిన నేతలతో కేటీఆర్‌ భేటీ

మంత్రి పదవులను ఆశించి అవి పొందలేకపోయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. పదవులు రాలేదనే నిరాశ వద్దని సీఎం కేసీఆర్‌ అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య, మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌ తదితరులు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. అప్పటికే కార్యదర్శుల సమావేశానికి జాప్యం కావడంతో మరోసారి వారితో మాట్లాడుతానని చెప్పి కేటీఆర్‌ పంపించేశారు. కేటీఆర్‌ ఫోన్‌ చేయడం వల్లనే తాము వచ్చి కలిశామని ఈ సందర్భంగా నేతలు భవన్‌ బయట విలేకరులకు తెలిపారు.

గుత్తాకు సీఎం అభినందనలు

రాష్ట్ర శాసనమండలి నూతన ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. తనకు ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.