close
అణు యుద్ధానికి ఆస్కారం!

మరోసారి హెచ్చరికలు చేసిన ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి అణు యుద్ధ హెచ్చరికలు చేశారు. భారత్‌తో సంప్రదాయ యుద్ధం జరిగే వీలుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఆ పోరు ప్రభావం ఉపఖండం పరిధిని దాటిపోతుందని హెచ్చరించారు. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన నేపథ్యంలో భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు సంప్రదాయ పోరుకు దిగినప్పుడు అది అణు యుద్ధంగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. భారత్‌తో జరిగే సంప్రదాయ యుద్ధంలో పాక్‌ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పారు. ‘‘ఒకవేళ సంప్రదాయ యుద్ధంలో పాక్‌ ఓటమి అంచుల్లో ఉండి, లొంగిపోవడమా లేక స్వేచ్ఛ కోసం తుది వరకూ పోరాడటమా అన్న మీమాంస తలెత్తితే మేం మరణం వరకూ పోరాడటం వైపే మొగ్గుతాం. ఒక అణ్వస్త్ర దేశం తుది వరకూ పోరాడాల్సి వస్తే దానివల్ల చాలా పరిణామాలు ఉత్పన్నమవుతాయి’’  అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అందువల్లే తాము కశ్మీర్‌ అంశంపై ఐరాసను, అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్రయించామన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించకుంటే సదరు పరిణామాలు భారత ఉపఖండం వెలుపలికి వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. అయితే తాను శాంతికాముకుడినని చెప్పారు. ‘‘పాక్‌ ఎన్నడూ యుద్ధాన్ని ప్రారంభించబోదు. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావన్నది నా భావన’’ అని పేర్కొన్నారు. ఆర్థిక ఆంక్షలతో పాక్‌ దివాళా తీసేలా చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని, అందువల్లే చర్చల మార్గం నుంచి తాము వెనక్కి మళ్లామని చెప్పారు.

ఈ ఏడాది 2వేలసార్లు పాక్‌ కాల్పులు
దిల్లీ: ఈ ఏడాది ఇప్పటివరకూ 2,050 సార్లు పాకిస్థాన్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ కాల్పుల్లో 21 మంది భారతీయులు చనిపోయారని ఆదివారం తెలిపింది. ఉగ్రవాదుల చొరబాట్లకు సాయం చేయడానికే ఇలాంటి చర్యలకు దిగుతోందని వివరించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.