close
ఖాళీలతో వైద్య సిబ్బందిపై అదనపు భారం

ఏ ఊర్లో చూసినా జ్వరాలే
పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలివ్వడం లేదు: భట్టి
కేసులు నమోదు చేస్తున్నా వేధింపులు ఆగడం లేదు : గొంగిడి సునీత, రేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా విష జ్వరాలు, డెంగీ కేసులు ఉంటున్నాయని శాసనసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వైద్య సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. రోగుల తాకిడితో సిబ్బంది అదనపు భారాన్ని మోస్తూ సేవలందిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో మౌలిక వసతులు లేక ఒక్కో పడకపై ఇద్దరు, ముగ్గురు రోగుల నుంచి చికిత్స అందిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ముచేసుకుని బిల్లులు దండుకుంటున్నాయని తెలిపారు. ఆరేళ్లుగా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. ఆసుపత్రుల పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సభ అనంతరం ఇదే అంశంపై మీడియా పాయింట్‌లో భట్టి మాట్లాడుతూ ఎక్కువ మంది రోగులు వస్తున్నారంటే, ప్రభుత్వ ఆసుపత్రులు బాగున్నాయని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడాన్ని తప్పుపట్టారు.
కుక్క చనిపోతే కేసు పెట్టారు..

ప్రజల మరణాలకు ఏం చేస్తారు: సీతక్క
ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే పశువైద్యులపై కేసు నమోదు చేశారని.. రాష్ట్రంలో జ్వరాలతో ప్రజలు మరణిస్తున్నా కనీసం సమస్యలపై తమను మాట్లాడనివ్వకపోవడం ఏంటని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఆసుపత్రిపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యుడు జగ్గారెడ్డి స్పీకర్‌ను పదేపదే కోరారు. కాంగ్రెస్‌ సభ్యులు సభలో ముందుకు వచ్చి స్పీకర్‌తో సంవాదానికి దిగారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతీదీ రాజకీయం చేయొద్దన్నారు.

మహిళలపై వేధింపులు... పాసుపుస్తకాలు
రాష్ట్రంలో షీటీంలు పనిచేస్తున్నా అత్యాచారాలు, వేధింపుల సంఖ్యలు తగ్గడం లేదని తెరాస సభ్యులు అజ్మీరా రేఖ, గొంగిడి సునీత ఆవేదన వ్యక్తంచేశారు. రైతు బీమాపై చర్చలో ఆల వెంకటేశ్వరరెడ్డి, బాల్క సుమన్‌, శంకర్‌ నాయక్‌, పొదెం వీరయ్య, రవీందర్‌ నాయక్‌లు మాట్లాడుతూ.. పాసుపుస్తకాలు రాని వారికి, బీమా వర్తించని వారి విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గాల్లో కొందరికి నేటికీ అందని పరిస్థితులు ఉన్నాయన్నారు.


నమ్మకంతోనే సర్కారు ఆసుపత్రులకు జనం: ఈటల

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకేసారి పెద్ద ఎత్తున వస్తున్న రోగులకు వైద్య సిబ్బంది అహర్నిశలు సేవలందిస్తుండటాన్ని అభినందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఉదయం, సాయంత్రం ఓపీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడిని చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వాస్తవానికి ప్రభుత్వ వైద్యంపై నమ్మకంతోనే ప్రజలు వస్తున్నారనే అంశాన్ని గమనించాలని మంత్రి కోరారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆదివారం సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. చికిత్సకు పడకలు సరిపోవడం లేదని కూడా విమర్శలు చేస్తున్నారని.. వైద్యసేవలకు వచ్చే వారిని ప్రైవేటు ఆసుపత్రులకు పంపించమంటారా అని ప్రశ్నించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఒక పడకపై ఇద్దరేసి చొప్పున ఉంచి చికిత్స చేయాల్సి వస్తోందని.. మిగిలిన చోట్ల అలాంటి పరిస్థితి లేదన్నారు. వ్యాధులు ముసురుతున్న సమయంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా విపక్షాలు ప్రకటనలు ఇవ్వొద్దని, ధైర్యం చెప్పాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో వైద్య సిబ్బంది ఎంపికలను నేరుగా నిర్వహించుకునేలా ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో వైద్య ఆరోగ్య సర్వీసుల ఎంపికల బోర్డును ఏర్పాటు చేసిందని ఈటల గుర్తు చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.