close
ప్రాణాలతో జలగాటం

లైఫ్‌జాకెట్లు, లైఫ్‌ సేవింగ్‌ ట్యూబ్‌లు కరవే

ఈనాడు, అమరావతి, ముమ్మిడివరం, న్యూస్‌టుడే: లక్షల రూపాయలు వెచ్చించి బోటు కొనుగోలు చేస్తుంటారు.. నదీ విహారం కోసం వచ్చే పర్యాటకులు ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి మొదలుకుని ప్యాకేజీని బట్టి రూ.3 వేల వరకూ టికెట్ల రూపంలో వసూలు చేస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే బోటులో ఉన్న వారిని రక్షించేందుకు ఉపయోగపడే లైఫ్‌జాకెట్లు, లైఫ్‌ సేవింగ్‌ ట్యూబ్‌లను సమకూర్చుకునే విషయంలో మాత్రం ప్రైవేటు బోట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాటి ఫలితమే ఎక్కడైనా బోటు మునిగితే చాలు.. పదుల సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2017 నవంబరులో విజయవాడ శివారులోని పవిత్రసంగమం వద్ద, 2018 మే నెలలో తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వద్ద జరిగిన బోటు ప్రమాదాల్లో ప్రాణనష్టం అధికంగా ఉండటానికి లైఫ్‌జాకెట్లు, లైఫ్‌ సేవింగ్‌ ట్యూబ్‌లు అందుబాటులో లేకపోవటం, ఉన్నవీ ధరించకపోవటం ప్రధాన కారణమైంది. తాజాగా కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంలోనూ.. బోటులో ఉన్నవారికి సరిపడా లైఫ్‌జాకెట్లు లేవు. వాటిని ధరించిన వారిలో కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతావారు మాత్రం గల్లంతయ్యారు.

అందుబాటు ధరల్లోనే లభ్యమవుతున్నా...
లైఫ్‌ జాకెట్లలో ప్రధానంగా అయిదురకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో లైఫ్‌ జాకెట్టు రూ.1000 నుంచి, లైఫ్‌ సేవింగ్‌ ట్యూబ్‌లు రూ.3000 వేల నుంచి విపణిలో దొరుకుతున్నాయి. ఒక్కో బోటులో దాని సామర్థ్యాన్ని బట్టి కనీసం 100 నుంచి 150 వరకూ లైఫ్‌జాకెట్లు, మరో 50 లైఫ్‌ సేవింగ్‌ ట్యూబ్‌లు అందుబాటులో ఉంచినా గరిష్ఠంగా రూ.3 లక్షల్లోపే ఖర్చవుతుంది. లాభార్జనే ధ్యేయంగా బోట్లు నడుపుతున్న నిర్వాహకులు వాటిని సమకూర్చుకోవడాన్నీ భారంగా భావిస్తున్నారు.

నిర్లక్ష్యాన్ని గుర్తించినా...
2017లో విజయవాడ శివారులోని పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాదం జరిగినప్పుడు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో పాపికొండల యాత్రకు వెళ్లిన బోట్లను అధికారులు తనిఖీ చేశారు. చాలా బోట్లలో లైఫ్‌జాకెట్లు లేవని గుర్తించారు. తనిఖీలు నిర్వహిస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న బోటు యజమానులు కొందరు అప్పటికప్పుడు లైఫ్‌జాకెట్లు తెప్పించుకుని హడావుడిగా వాటిని వేయించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయటం తప్ప నిత్యం పర్యవేక్షించే పరిస్థితి లేదు.

అవగాహన కల్పించరేం?
విమానంలో ప్రయాణం చేసేటప్పుడు.. ఏదైనా ప్రమాదం జరిగితే భద్రతాపరంగా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో గాలిలోకి ఎగిరే ముందే ప్రయాణికులకు వివరిస్తుంటారు. బోట్లలో ప్రయాణించేవారికి అలా ముందు జాగ్రత్త చర్యలు చెబుతున్న పరిస్థితి లేదు. ప్రమాదం జరిగితే ఎలా ప్రాణాలను కాపాడుకోవాలి? ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌ సేవింగ్‌ ట్యూబ్‌లు ఎక్కడ ఉంటాయి? వాటిని ఎలా ధరించాలి? అనే అంశాలపై అవగాహన కల్పించే పరిస్థితి లేదు.

లైఫ్‌ జాకెట్లు.. ఉపయోగాలు

టైప్‌-1

అల్లకల్లోలంగా ఉన్న జలాల్లో, సముద్రంలో ప్రయాణించేటప్పుడు వీటిని వినియోగిస్తారు. నీట మునిగిన వారిని కాపాడేందుకు ఎక్కువ సమయం పట్టే పరిస్థితి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు వీటిని వినియోగించటం అత్యుత్తమం. నీట మునిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఈ జాకెట్లు కాపాడగలవు.

టైప్‌-2

స్థిరజలాలు, జలాశయాల్లో ప్రయాణించే సందర్భంలో వీటిని వినియోగించటం అత్యుత్తమం.

టైప్‌-3

తక్షణమే సాయం అందించే పరిస్థితి ఉన్న సందర్భాల్లో వీటిని వినియోగిస్తారు.

టైప్‌-4

వీటిని లైఫ్‌ సేవింగ్‌ ట్యూబ్స్‌ అని పిలుస్తారు. ఎవరైనా నీటిలో మునిగిపోతే.. వెంటనే ఈ ట్యూబ్స్‌ను లోపలికి విసిరి కాపాడేందుకు అవకాశం ఉంటుంది

టైప్‌-5

బోటింగ్‌, కయాకింగ్‌ వంటి వాటిల్లో పాల్గొనేటప్పుడు వీటిని ధరిస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.