close
సుడిగండంలో చిక్కుకుని

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - సీతానగరం

గోదావరిలో సుడిగుండమే బోటు పాలిట యమగండంగా మారింది. ఆ సుడిగుండంలో చిక్కుకునే బోటు కొంత వెనక్కి ప్రయాణించి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లాంచీ యజమాని ఇదే విషయం చెబుతున్నారు. జలవనరులశాఖ అధికారులు కూడా సుడిగుండాలు పెరిగాయని విశ్లేషిస్తున్నారు. కచ్చులూరు వద్ద సుడిగుండాలు తరచూ సంభవిస్తుంటాయి. పాపికొండల ప్రయాణం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకు జలమార్గంలోనే ప్రయాణిస్తున్న వారు ఎందరో. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉండటంతో పర్యాటకం విస్తృతమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోశమ్మ గండి నుంచి పాపికొండల వరకు 62 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రమాద పరిస్థితులను తెలియజేస్తూ హెచ్చరిక సూచికలు లేవు. దీంతో కొన్ని విహార యాత్రలు విషాద యాత్రలుగా మిగిలిపోతున్నాయి.

ప్రవాహానికి ఎదురీత
రాజమహేంద్రవరం, పట్టిసీమ, సింగనపల్లి, పోశమ్మగండి నుంచి పాపికొండలకు ప్రయాణించే సమయంలో ప్రవాహానికి ఎదురీదాల్సి ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ కొండల నడుమ గోదావరి సన్నగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్నో మలుపులు ఉంటాయి. ఇటీవల ఉద్ధృతంగా వరద వచ్చింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరూ పరిశీలించిందీ లేదు. ఆ 62 కిలోమీటర్ల ప్రయాణంలో ఎక్కడా జనసంచారం ఉండదు. పడవలు, లాంచీలే తప్ప పరిసర ప్రాంతాల్లో ఎవరూ కనిపించరు. ప్రధానంగా కచ్చులూరు వద్ద నదీ ప్రవాహానికి కొండ అడ్డుగా ఉండటంతో సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి. సుడిగుండంలో చిక్కుకున్న వెంటనే లాంచీలు పెద్దపెద్ద బండరాళ్లను ఢీకొని, బోల్తా పడడం లేదా రంధ్రం ఏర్పడి లోపలికి నీరు ప్రవేశించడం వంటి వాటికి ఆస్కారం ఏర్పడుతోందని చెబుతున్నారు. ఆదివారం కూడా కచ్చులూరు వద్ద గోదావరి ప్రవాహ వడి, సుడి కలిసి ప్రమాదానికి దారి తీశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నీటి సుడుల్లో బోటు, లాంచీ చిక్కుకుంటే బయటపడడం అసాధ్యమని జలవనరులశాఖ నిపుణులు చెబుతున్నారు.

వరద వేళ అనుమతి లేదు
ఆదివారం గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఇటీవల గోదావరికి వరద ఉద్ధృతంగా వచ్చింది. దేవీపట్నం మండలంలో అనేక అటవీ ప్రాంత గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. దాదాపు 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వచ్చిన రోజులూ ఉన్నాయి. వరద సమయంలో మొదటి హెచ్చరిక సమయంలో ఎలాంటి లాంచీలకు గోదావరిలో అనుమతి లేదు. జలవనరులశాఖ అధికారులు ఈ నెల 14న జిల్లాలోని అధికారులందరికీ వరదపై వర్తమానం అందించారు. మరో నాలుగు రోజుల పాటు ప్రవాహాలు ఎక్కువగానే ఉంటాయని సమాచారం ఇచ్చారు. ఈ లాంచీకి తాము రూటు అనుమతి ఇవ్వలేదని జలవనరులశాఖ పేర్కొంటోంది. మరి ఎవరు అనుమతించారన్న విషయానికి సమాధానం లభించడం లేదు.


సహాయక చర్యలు సులువు కాదు

ఈనాడు-అమరావతి: బోటు ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతంలో సహాయక చర్యలు అంత సులువు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. మునిగిపోయిన బోటు 150 నుంచి 200 అడుగుల లోతులో ఉంది. కచ్చులూరు వెళ్లడానికే సరైన రహదారి లేదు. నదీ మార్గాన వెళ్లాలన్నా.. దేవీపట్నం నుంచి గంటన్నర ప్రయాణించాలి. మొన్నటిదాకా ఈ ప్రాంతమంతా వరద బారిన పడి, బురదతో నిండిపోయింది. దీనికి తోడు ఇప్పుడీ ప్రమాదం ముంచుకు రావడంతో సహాయక చర్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వాడపల్లి వద్ద లాంచీ ప్రమాదం జరిగినప్పుడు రెండు వైపుల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తేనే.. చాలా సమయం పట్టింది. ఇప్పుడు గోదావరిలో లోతైన ప్రదేశంలో సహాయక చర్యలు అంత సులభం కాదని నిపుణులు వివరిస్తున్నారు. ‘ఇది అత్యంత ప్రమాదకర ప్రాంతం. ఇక్కడ సుడిగుండాలుంటాయి’ అని బోటు ఆ ప్రాంతానికి చేరుకున్న సమయంలో టూరిస్ట్‌ గైడ్‌ ఒకరు మైకులో పర్యాటకులకు వివరించారు. అదే సమయంలో బోటు ప్రమాదం జరిగిందని కొందరు తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.