close
అస్మదీయులు ఎవరూ లేరు!

పోలవరంపై ‘ఈనాడు’ కథనం దురుద్దేశపూరితం
ఏపీ మంత్రి అనిల్‌ యాదవ్‌ ఖండన

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానంపై ‘అస్మదీయులకు అప్పగించేందుకేనా?’ అంటూ ‘ఈనాడు’ పత్రిక ఆదివారం ప్రచురించిన కథనం దురుద్దేశపూరితంగా ఉందని ఏపీ నీటిపారుదల మంత్రి  అనిల్‌ యాదవ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికిగానీ అయినవారు, బంధువులు ఎవరూ లేరు. రివర్స్‌ టెండరింగ్‌ తరువాత ఆ కాంట్రాక్టు ఎవరు దక్కించుకుంటారన్నది ఎవరికీ తెలియదు. అయినా, తన ‘అస్మదీయుల’ కోసమే ఈనాడు ఈ  కథనాన్ని వండి వార్చింది.. ఈనాడులో వచ్చిన వార్త ఆ పత్రిక తెరవెనక ఉద్దేశాలను బయటపెట్టింది’ అని మంత్రి  అనిల్‌ యాదవ్‌ ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కనీసం 10 నుంచి 20 శాతం వరకూ తక్కువకు టెండర్లు వేస్తే  రాష్ట్రానికి వందల కోట్ల రూపాయల మేలు జరిగే అవకాశం ఉంటుందని తెలిసి కూడా ‘ఈనాడు’ పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ను  ఎందుకు వ్యతిరేకిస్తోందో సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయ  ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాల్సి ఉండగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పాడి ఆవుగా మార్చుకుందని ఆరోపించారు.

ఇదేం ‘రివర్స్‌’ వాదన?

పీలో సాగు రంగానికి పెట్టని కోటలా, దేశానికి తలమానికంగా నిలవాల్సిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘రివర్స్‌’ ధోరణి.. మొత్తం ప్రాజెక్టునే అనిశ్చితిలోకి నెట్టే పరిస్థితులు సృష్టిస్తుండటం స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం. ‘రివర్స్‌ టెండర్ల’ విధానంపై సాక్షాత్తూ కేంద్ర జలవనరుల మంత్రి నుంచి పోలవరం అథారిటీ,  ఇంజినీరింగ్‌ నిపుణుల వరకూ అంతా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. పోలవరం విషయంలో రాష్ట్రం అనుసరిస్తున్న  ఒంటెత్తు పోకడను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ మీద లేఖ రాసి వివరణ కోరింది. చిరకాల సంప్రదాయాలను,  కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మార్గదర్శకాలను పక్కనబెట్టి.. ప్రమాణాలను దిగజారుస్తూ, నిబంధనలను కాలదన్నుతూ టెండర్లు  పిలిచిన వైనం అనుమానాలకు తావిచ్చేలా ఉంది. దీనిపై నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను అంశాలవారీగా, సమగ్రంగా ‘ఈనాడు’ ప్రజల ముందుంచింది.

కానీ... ‘ఈనాడు’ కథనాన్ని ఖండిస్తూ రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్‌ యాదవ్‌ విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో ఆయా సాంకేతిక అంశాలను, లోపాలను ఎక్కడా ప్రస్తావించకపోవటం, కేవలం ‘బంధుత్వాల’ పేరు చెప్పి ఈనాడుపైనే బురద చల్లేందుకు ప్రాధాన్యం ఇవ్వటం విచారకరం.

రివర్స్‌ టెండర్లు పిలిచిన విధానం- సీవీసీ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. ముందు గుత్తేదారు ఆర్థిక, సాంకేతిక సత్తాను గుర్తించిన తర్వాతే వారి నుంచి రివర్స్‌ బిడ్‌ ఆహ్వానించాలని సీవీసీ మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి ‘రివర్స్‌’లో టెండర్లు పిలుస్తూ.. ముందు గుత్తేదారును గుర్తించిన తర్వాత  (‘ఎల్‌1’గా) అప్పుడు  వాళ్ల సాంకేతిక ఆర్థిక అర్హతలపై దృష్టిపెట్టనున్నట్టు పేర్కొంది. దేశంలో ఎక్కడా అమల్లోలేని ఈ విధానం సీవీసీ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధమని, దీనివల్ల ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నే ‘ఈనాడు’ ప్రస్తావించింది.

కేంద్రం నుంచి కోర్టుల వరకూ ఎవరు చెప్పినా వినకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో అవకతవక విధానాలకు తెరతీస్తున్న నేపథ్యంలోనే ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించింది. రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేందుకు ‘ఈనాడు’ ఎప్పుడూ  సిద్ధంగానే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రజా ప్రయోజనమే శిరోధార్య సూత్రం కావాలని బలంగా ఆకాంక్షిస్తోంది.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.