close
విషాదాంకం

పాపికొండల వినోదయాత్ర పలు కుటుంబాల్లో కన్నీటిని నింపింది... భార్య చనిపోయి భర్త... తమ్ముడు గల్లంతై అన్న... తన వెంట వచ్చిన స్నేహితులు కానరాక పలువురు పడుతున్న వేదన వర్ణనాతీతం..  హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి ఆదివారం సెలవురోజున కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు పాపికొండలకు వెళ్లిన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక సమాచారం మేరకు బోటు ప్రమాదంలో 22 మంది హైదరాబాద్‌ వాసులున్నారు. వీరిలో ఒకరు మృతి చెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 14 మందిలో ఇద్దరు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. వీరంతా బంధువులే కావడంతో కడిపికొండలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 13న ఈ బృందమంతా  కాజీపేట నుంచి రాజమహేంద్రవరం వెళ్లింది.

అన్నదమ్ముల్లో ఒకరి గల్లంతు

గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన ఆనందంలో హయత్‌నగర్‌ డివిజన్‌ పోచమ్మబస్తీకి చెందిన పాడి భరణికుమార్‌(25), జరణికుమార్‌(21), కోదండ అర్జున్‌(22), కోదండ విశాల్‌(25) పాపికొండల విహారానికి వెళ్లారు.  వీరిలో భరణి, జరణి అన్నదమ్ములు. ఆదివారం జరిగిన ప్రమాదం నుంచి జరణి, అర్జున్‌, విశాల్‌ బయటపడగా... భరణికుమార్‌ ఆచూకీ తెలియరాలేదు. గల్లంతైన భరణికుమార్‌ ప్రైవేటు ఉద్యోగి. అతని సోదరుడు జరణికుమార్‌ సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి పాడిరాజు సర్వే ఆఫ్‌ ఇండియా ఉద్యోగి. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక కుమారుడు క్షేమంగానే ఉన్నట్లు సమాచారం అందడంతో మరో కొడుకు ఆచూకీ కోసం ఆ తండ్రి ఆందోళనగా ఆరాతీస్తున్నారు.  కోదండ అర్జున్‌ ఆర్టీసీ ఉద్యోగి. విశాల్‌ ఉప్పల్‌లో ప్రైవేటు ఉద్యోగి. అతని తండ్రి మహబూబ్‌నగర్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌.

ఆ ఇద్దరు ఎక్కడ?

మాదాపూర్‌ హరిజనబస్తీకి చెందిన చిన్నముత్యాల పెద్దకుమారుడు ఈరని సాయికుమార్‌ అలియాస్‌ లడ్డు(24) స్థానిక   జిమ్‌లో శిక్షకుడు. తన తోటి జిమ్‌ శిక్షకులు మోహిందర్‌, తాలిబ్‌పటేల్‌, జిమ్‌ మేనేజర్‌ అక్బల్‌తో కలిసి కారులో రాజమహేంద్రవరం వెళ్లారు. అక్బల్‌ బోటు ప్రయాణానికి వెళ్లలేదని.. మిగతా ముగ్గురు బోటులో వెళ్లారని సాయికుమార్‌ స్నేహితుడు శ్రీను ‘ఈనాడు’కు చెప్పారు. బోటు మునిగిన సమయంలో మోహిందర్‌ బయటకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు తెలిసిందన్నారు. సాయికుమార్‌, తాలిబ్‌పటేల్‌ ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు.తాలిబ్‌ గల్లంతైన విషయం షేక్‌పేటలో ఉన్న అతని తండ్రి అలీముద్దీన్‌తో పాటు తల్లికి ఆదివారం రాత్రి వరకు చెప్పలేదు.

జగద్గిరిగుట్ట వాసి క్షేమం

గద్గిరిగుట్ట సమీపం గుబురుగుట్టకు చెందిన నార్లపురం సురేశ్‌ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రేపాకుల విష్ణుకుమార్‌  బోటులో ఉన్నాడా లేడా అని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇద్దరు యువ ఇంజినీర్లు గల్లంతు

ప్రమాదంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకు చెందిన ఎన్‌.కిరణ్‌కుమార్‌ (29) సురక్షితంగా బయటపడ్డారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఇతను ఔట్‌ సోర్సింగ్‌ ఏఈ. అంబర్‌పేటలో ఉంటున్నారు. తోటి ఉద్యోగులు ఆరుగురితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. కిరణ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అతను కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తన క్షేమ సమాచారాన్ని తెలియజేశాడు.కిరణ్‌కుమార్‌ ప్రస్తుతం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే ప్రమాదంలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఇంజినీర్లు గల్లంతయ్యారు. హాజీపూర్‌ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య (22) ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ సబ్‌ డివిజన్‌లో సబ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అదే మండలం కర్ణమామిడికి చెందిన బొడ్డు లక్ష్మణ్‌ (23) నిర్మల్‌ జిల్లాలోని భైంసా సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో సబ్‌ ఇంజినీర్‌.

పిల్లలకు ఏం తేవాలమ్మా?

రంగల్‌ జిల్లా కాజీపేట మండలం కడిపికొండకు చెందిన గొర్రె రాజేందర్‌ ప్రమాదంలో గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన భార్య రమ దుఃఖసాగరంలో మునిగిపోయారు.‘నీ బిడ్డకు, కొడుక్కు ఏం తీసుకురావాలమ్మా’ అని నాన్న శనివారం రాత్రి ఫోన్‌లో అడిగారని, అదే చివరి కాల్‌ అని రాజేందర్‌ పెద్ద కూతురు సౌజన్య కన్నీరుమున్నీరవుతున్నారు.

గత నెలలో రద్దయి మళ్లీ ఇప్పుడు...

రంగల్‌ కడిపికొండ నుంచి పాపికొండలకు వెళ్లిన బృందం గత నెలలోనే విహార యాత్రకు రిజర్వేషన్‌ చేసుకుంది. ప్రమాదం నుంచి బయట పడ్డ గొర్రె ప్రభాకర్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌ రిజర్వేషన్‌ విభాగంలో పనిచేస్తున్నారు. గత నెలలో సుమారు 30 మంది విహార యాత్రకు వెళ్లేందుకు ప్రభాకర్‌ రిజర్వేషన్‌ చేశారు.వరదలు రావడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. మళ్లీ ఈ నెల 13న తిరిగి 14 మంది విహార యాత్రకు బుక్‌ చేసుకున్నారు. మా నాన్నే అందరికీ రిజర్వేషన్‌ చేశారని ప్రభాకర్‌ కూతురు ఆవేదనతో మాట్లాడుతున్నారు.

అయిదేళ్ల క్రితం భర్త .. ఇప్పుడు కుమారుడు..

ప్రమాదంలో కడిపికొండకు చెందిన బస్కె అవినాశ్‌ చనిపోవడంతో అతని తల్లి కవితారాణి గుండెలవిసేలా రోదిస్తున్నారు. భర్త బస్కె తిరుపతి అయిదేళ్ల క్రితం మృతిచెందారు.  ఈమెకు ఇద్దరు కొడుకులు. అవినాశ్‌ పెద్ద కుమారుడు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం పది గంటలకు తనకు ఫోన్‌ చేశాడని, పాపికొండల్లో సెల్‌ సిగ్నల్‌ ఉండదని చెప్పాడని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ ఆమె విలపించారు.

త్వరలో అమెరికాకు.. అంతలోనే దుర్ఘటన

హైదరాబాద్‌ బోడుప్పల్‌ శ్రీనివాసకాలనీకి చెందిన జానకిరామారావు (65) భార్య జ్యోతి(62) ప్రమాదంలో మృతి చెందారు. రామారావు బావమరిది పవన్‌, అతని భార్య భవానీ, కుమారుడు సుశీల్‌ గల్లంతయ్యారు. జానకిరామారావు స్థానిక శ్రీనివాసకాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. దక్షిణ మధ్యరైల్వేలో పుడ్‌ అండ్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఐదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. జానకిరామారావు కుమార్తె నీలిమ అమెరికాలో ఉంటోంది. మేనల్లుడికి అమెరికా వీసా లభించడం..వారం రోజుల్లో అతను అమెరికా వెళ్లాల్సి ఉండటంతో ముందస్తు విహారానికి ప్రణాళిక వేసుకొని ఊహించని విధంగా మృత్యువాత పడ్డారని స్థానికులు కంట తడి పెడుతున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.