close

ప్రధానాంశాలు

యురేనియం..అనుమతివ్వం

నల్లమల అడవులను నాశనం కానిచ్చేది లేదు
నేడు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం
2014 జూన్‌ 2 తెలంగాణకు అసలైన విమోచన, విముక్తి
సెప్టెంబరు 17న తెలంగాణ భవన్‌పై జాతీయజెండా ఎగరేస్తాం
కేంద్ర ప్రభుత్వ నూతన వాహన చట్టాన్ని అమలు చేయం
ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని నిర్మాణాత్మకంగా ఎదుర్కొంటాం
అభివృద్ధి కోసమే అప్పులు... ఆందోళన వద్దు
కృష్ణా, గోదావరి అనుసంధానంపై జగన్‌తో త్వరలో సమావేశం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు

నల్లమల అడవుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటవీసంపదను పరిరక్షిస్తాం. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం.
- కేసీఆర్‌

ఈనాడు - హైదరాబాద్‌

యురేనియంతో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అన్నంపెట్టే కృష్ణాజలాలు కలుషితమవుతాయని వ్యాఖ్యానించారు. అందువల్ల యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆదివారం కాంగ్రెస్‌, మజ్లిస్‌, తెరాస ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. మూడు గంటలపాటు ప్రసంగించిన సీఎం పలు అంశాలపై వివరణ ఇచ్చారు. కేంద్ర నూతన వాహన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టంచేశారు. ఈ చట్టం అధిక జరిమానాలతో కూడి ఉందన్నారు.

యురేనియం: అవసరమైతే కేంద్రంతో పోరాటం
‘‘యురేనియం అనుమతులు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చినవే. మేం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో తవ్వకాలకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఆలోచనలేదు. యురేనియంతో తెలంగాణకు ప్రమాదం. అన్నంపెట్టే కృష్ణాజలాలు కలుషితమవుతాయి. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలపై ప్రభావం ఉంటుంది. అందువల్ల తవ్వకాలకు అనుమతిచ్చేది లేదు. ఒకవేళ కేంద్రం గట్టిగా ముందుకు వెళితే అందరం కలిసి పోరాటం చేద్దాం.

సెప్టెంబరు 17: పాత గాయాల్ని ప్రేరేపించడం సబబా?
కొత్తగా మతం స్వీకరించినవారికి నామాలు ఎక్కువన్నట్లుగా సెప్టెంబరు 17 విషయంలో భాజపా నేతల తీరుంది.  ఎప్పటిమాదిరే 17న తెలంగాణ భవన్‌పై జాతీయజెండా ఎగరేస్తాం. ఆ రోజున ఎవరేం చేయదల్చుకుంటే అది చేయవచ్చు. అణచివేత చర్యలుండవు.
విమోచన దినోత్సవం హిందూ, ముస్లింల సమస్య కాదు. తెలంగాణ సమాజం వేదనకు గురైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నేను కూడా కోరా. ఇది సంక్లిష్టతలతో కూడిన అంశమని మేధావులు, కవులు చెప్పారు. పాతగాయాల్ని ప్రేరేపించడం సబబుకాదన్నారు. ఏది ఏమైనా తెలంగాణకు నిజమైన విముక్తి జరిగింది 2014 జూన్‌ 2న మాత్రమే.

అప్పులు:  లేకుండా అభివృద్ధి ఎలా?
రూ.3 లక్షల కోట్ల అప్పులన్న ప్రతిపక్షాల విమర్శ వాస్తవం కాదు. కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారెంటీని కూడా కలిపి ఎలా చూస్తారు? భట్టి విక్రమార్క విమర్శలు చేస్తున్నారు. ఆయన్ను కాదని నేను, మంత్రులం కలిసి అప్పుచేసి దావత్‌ చేసుకుంటున్నామా? మేం చేసిన అప్పులు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథకే. ఇది నేరమా? ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్ర ప్రభుత్వం మార్చాలి. అతి ఎక్కువ అప్పులున్న అమెరికా, జపాన్‌లు ప్రపంచాన్ని శాసిస్తలేవా?

కాంగ్రెస్‌: ఆడితప్పడం ఆ పార్టీ నైజం
కాంగ్రెస్‌ పార్టీ ఏ రోటికాడ ఆ పాట పాడుతుంది. ఆడితప్పడం..మభ్యపెట్టడం కాంగ్రెస్‌కు అలవాటు. 2004, 2009ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో వేటినీ అధికారంలో ఉన్నప్పుడు అమలుచేయలేదు. కాంగ్రెస్‌ హయాంలోనే మతకల్లోలాలు, కర్ఫ్యూలు, కలప స్మగ్లింగ్‌, పాలమూరు వలసలు, చేనేతల ఆత్మహత్యలు జరిగాయి. మిషన్‌ భగీరథ, కాకతీయ, కాళేశ్వరంలో.. అవినీతి అంటున్నారు.. ప్రభుత్వం ఏం పని చేయవద్దా? కాళేశ్వరం 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. రెండు పంటలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న అప్పు తీరుతుంది. రైతులు అంచు ధోతీ కట్టుకునే రోజులొస్తయి.

ప్రభుత్వ ఉద్యోగాలు:  అందరికీ సాధ్యం కాదు
3 వేల తండాల్ని గ్రామపంచాయతీలుగా మార్చింది తెరాస ప్రభుత్వమే. కాంగ్రెస్‌ కట్టిన 7 ఇందిరమ్మ ఇళ్లు... మేం కట్టిన ఒక డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణవ్యయంతో సమానం. ఇంటి జాగా ఉన్నవారికి డబ్బులిస్తామన్న హామీపై వెనక్కి వెళ్లం. క్రమపద్ధతిలో, నిధుల లభ్యతను బట్టి ఇళ్లు కడతాం. కొల్లూరులో 16 వేల ఇళ్లనిర్మాణం పూర్తయ్యింది. త్వరలో ప్రారంభిస్తా.
రాష్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షా 17 వేల 714 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఇంకా 30 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగ ప్రకటన వేయగానే ప్రతిపక్ష నాయకులు కేసులు వేయిస్తూ అడ్డుకుంటున్నారు. అవసరాలమేరకు ఖాళీలు భర్తీ చేస్తున్నాం. ఐటీ, ఇతర రంగాల్లో లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం సాధ్యంకాదు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, తెదేపా ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయాయి?

ఆరోగ్యం: మా ప్రాధాన్యం
ఆస్పత్రుల మందుల కొనుగోలుకు రూ.146 కోట్లు కేటాయించాం. కిడ్నీ బాధితులకు 40 డయాలసిస్‌ సెంటర్లు పెట్టాం. ప్రసవ సమయాల్లో మాతాశిశు మరణాలు తగ్గిపోయాయి. బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయి. ఇంకా కొన్ని పెంచుతాం. అమ్మఒడి లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. గర్భిణులు కూలి నష్టపోవద్దని మానవీయ కోణంలో ఆర్థికసాయం చేస్తున్నాం.

సంక్షేమం: కట్టుబడి ఉన్నాం
రైతుబంధును భాజపా మంత్రులే మెచ్చుకుంటున్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ఒడిశా ముఖ్యమంత్రి సీఎం నా సమక్షంలోనే ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నివచ్చినా రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మిషన్‌ భగీరథతో 54 లక్షల ఇళ్లకు శుద్ధి చేసిన తాగునీళ్లు ఇస్తున్నాం. 2050 వరకు తాగునీటికి ఢోకాలేదు. వైఎస్‌ హయాంలో మొదలైన ఆరోగ్యశ్రీ మంచి పథకం. అందుకే అవయవమార్పిడి వంటి మరికొన్ని చికిత్సలను కలిపి కొనసాగిస్తున్నాం. రైతుల అప్పులు తీరి.. సొంత పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి వచ్చేవరకు.. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఎత్తిపోతల కరెంటు బిల్లుల మీద లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణకు ఏం తెలుసు? ఆయనది మన రాష్ట్రం కూడా కాదు.

ఎస్సీ ఎస్టీ ప్రణాళిక: ప్రతి పైసాకు లెక్క
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల్ని మళ్లించామని అబద్ధాలు మాట్లాడుతున్నారు. పెట్టిన ప్రతి పైసాకు లెక్కుంది. రూపాయి కూడా మళ్లించలేదు. దళితులను ఆదుకోవడంలో దేశంలోనే తెలంగాణ ఛాంపియన్‌ కావాలి. వారి జనాభాశాతం కంటే కొంత ఎక్కువే ఖర్చుచేస్తున్నాం. గతంలో ఉన్న చట్టాన్ని పటిష్ఠం చేశాం. సబ్‌ప్లాన్‌కు కాంగ్రెస్‌ హయాంలో రూ.20,650 కోట్లు ఖర్చుచేస్తే తెరాస హయాంలో రూ.54,350 కోట్లు ఖర్చుచేశాం.

రుణాలు: రెన్యువల్‌ చేసుకోండి
ఎన్నికల హామీ ప్రకారం రూ.లక్ష రుణమాఫీని అమలుచేసి తీరుతాం. ఈ ఏడాది రూ.6 వేల కోట్లు కేటాయించాం. అప్పుల్ని రెన్యువల్‌ చేసుకోవాలని రైతుల్ని కోరుతున్నా. రుణమాఫీ కింద ప్రభుత్వం ఎంత ఇస్తుందో నేరుగా రైతులకు ఉత్తరం పంపిస్తాం. మాఫీ సొమ్మును బ్యాంకుకు కాకుండా నేరుగా రైతుకు పంపాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది..

పోడు సమస్య: పరిష్కారానికి అన్ని జిల్లాల్లో పర్యటన
పోడు భూముల సమస్య పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్టు సీఎం తెలిపారు. ‘పోడు భూములను సాగుచేసుకొనే గిరిజనులకూ రైతుబంధు ఇస్తాం. వారి సమస్యలన్నీ తెలుసుకొంటాం. ఆదివాసీలకు, లంబాడీలకు వెలితి ఉంటే దాన్ని తీర్చాల్సిందే. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. కుదరకపోతే  వారంరోజుల పాటు సమావేశాలను నిర్వహించి..చట్టాన్ని చర్చకు పెడతాం. ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకాలకు చర్యలు తీసుకొంటాం. సంగారెడ్డికి వైద్యకళాశాల మంజూరుకు కృషి చేస్తాం. దీనికి కేంద్రం అంగీకారం అవసరం’’ అని అన్నారు.

కాగజ్‌నగర్‌ సంఘటన: బాధాకరం
కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలో అటవీ అధికారులకు, ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కృష్ణారావుకు మధ్య జూన్‌లో జరిగిన సంఘటన చాలా బాధాకరమని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘కృష్ణారావు చాలా మంచి వ్యక్తి. అందుకే ఆయనను పెద్ద మెజార్టీతో జడ్పీటీసీగా గెలిపించారు. గిరిజనుల భూముల మీదకొస్తే ఆయన అడ్డంపోయారు. దాంతో ఆయనపై కేసులు పెట్టార’ని సీఎం అన్నారు.

నదుల అనుసంధానంపై త్వరలో ఏపీ సీఎంతో భేటీ

కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో వెల్లడించారు.‘ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల గురించి జగన్‌కు చెప్పాను. తెలంగాణ వచ్చాక ఇక్కడ నీళ్లను తెచ్చుకొని బాగుపడ్డట్లు.. ఏపీలోనూ చేయాలని సూచించా. అమరావతి నిర్మాణానికి రూ.53 వేల కోట్ల ఖర్చు పెట్టాలనుకున్నారు. రాజధానికి అంత డబ్బు వద్దని..రాయలసీమకు నీళ్లు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సూచించా. ఆయన వినలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది. నదుల అనుసంధానంతో ఆంధ్రాలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ తదితర జిల్లాలు లబ్ధిపొందుతాయి. దుమ్ముగూడెం వద్ద బ్యారేజీని ప్రతిపాదిస్తున్నాం. దీంతో ఖమ్మం జిల్లాకు శాశ్వత ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రంగారెడ్డి, వికారాబాద్‌ తదితర జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. ఉభయ రాష్ట్రాల తర్వాత బంగాళాఖాతం తప్ప మరో రాష్ట్రం  లేనందున ఇక వివాదాలుండవని జగన్‌కు చెప్పాను. ఒక పూట లేటైనా ఆంధ్రాలో పోలవరం పూర్తవుతుంది. వైఎస్‌ రైతు పక్షపాతే కాని ఆంధ్రా పక్షపాతిగా వ్యవహరించారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలు ఖరారయ్యేటప్పుడు ప్రతిపక్షాలవారినీ పిలుస్తాను. ఆ తర్వాతే సంతకాలు చేస్తాం. గోదావరి ఇప్పుడు ధర్మపురి వరకు 100 కిలోమీటర్ల మేర సజీవంగా ఉంది. ఏడాది పొడవునా ఇక ఇలానే ఉంటుంది. రొయ్యలు, చేపలు విరివిగా పెరుగుతాయి. సీతారామ, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులనుంచి  570 టీఎంసీల నీటిని పొందగలిగే స్పష్టమైన అవకాశం వచ్చింది. వచ్చేఏడాది జూన్‌కల్లా పొలాలకు నీళ్లు పారతాయి. రాష్ట్రంలో కరెంటు, మంచినీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. త్వరలో సాగునీటి బాధా తీరిపోతోంది. కాళేశ్వరం  సమగ్ర ప్రాజెక్టు నివేదికను సభ్యులకు అందజేస్తాం. సింగూరు ప్రాజెక్టుకు నీళ్లు రావటం లేదు. ప్రాజెక్టులోకి నీళ్లను తేవాల్సింది గ్రావిటీద్వారానా?లేక లిఫ్టు ద్వారానా? అనేది నిర్ణయిస్తాం అని సీఎం పేర్కొన్నారు.

ఆర్థిక మాంద్యం: మూడేళ్ల పాటు ప్రభావం

ర్థికమాంద్యం ప్రభావం విస్పష్టంగా ఉంది. మూడేళ్లపాటు మాంద్యం ప్రభావం నుంచి తేరుకోలేమని  రతన్‌టాటా, ఆనంద్‌ మహీంద్ర వంటి పారిశ్రామికవేత్తలు, ఆర్థికనిపుణులు, మేధావులు చెబుతున్నారు. జహీరాబాద్‌ దగ్గరలో రూ.1,150 కోట్ల విస్తరణ పనుల్ని మాంద్యం కారణంగానే విరమించుకున్నట్లు మహీంద్ర కంపెనీ తెలిపింది. నిపుణుల విశ్లేషణల్ని బట్టి రాష్ట్ర పూర్తి బడ్జెట్‌ను రూపొందించాం.అనేక అడ్డంకులు వచ్చినా గతేడాది 21 శాతం వృద్ధిరేటు సాధించాం. దేశానికి ఎక్కువ ఆదాయం తెచ్చే ఏడురాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. పన్నులరూపంలో రాష్ట్రంనుంచి ఐదేళ్లలో రూ.2.70 లక్షలకోట్లు కేంద్రానికి వెళ్లాయి. రుణ పరిమితి విషయంలో కేంద్రం కర్రపెత్తనం చేస్తోంది. పరుగెత్తే రాష్ట్రాల కాళ్లల్లో కట్టెలు అడ్డంపెట్టొద్దని నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీకి చెప్పినా అరణ్య రోదనే అయ్యింది.

బాధతోనే పరుషంగా మాట్లాడా

కాళేశ్వరంపై ప్రతిపక్షం అతిదుర్మార్గంగా మాట్లాడుతోంది. శనివారం సభలో భట్టి విక్రమార్క వక్రీకరించి మాట్లాడుతుంటే కోపంతో పరుషంగా మాట్లాడా.తర్వాత నాకే బాధ కలిగింది. అడ్డగోలు విమర్శలు చేయడం ప్రతిపక్షం మానుకోవాలి.  విమర్శ అనేది నిర్మాణాత్మకంగా.. సలహాలతో కూడుకొని ఉండాలి. ఒక్క పని మంచి చేశాం అంటే భట్టి విక్రమార్క ముల్లేం పోయింది? విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో భాజపా వాళ్లు లొల్లి చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా నేడు సభలో లేరు. 2023లో అధికారంలోకి వచ్చేసినట్లేనంటూ ఆ పార్టీ వాళ్లు కలలు కంటున్నారు. 24 గంటల ఉచితవిద్యుత్తు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా?

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.