close
భారీ ఆయకట్టే లక్ష్యం

భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 9.93 లక్షల ఎకరాలు
చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల కింద 60 వేల ఎకరాలు
ఈ ఏడాది అదనంగా సాగులోకి వచ్చింది 1.77 లక్షల ఎకరాలు
అసెంబ్లీలో నివేదికలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్‌

ప్రస్తుత నీటి సంవత్సరంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 9.93 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవసరమైన మౌలిక వసతులు పూర్తి చేయడం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆయకట్టు రావడానికి 14 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వీటిలో తొమ్మిది భారీ, ఐదు మధ్యతరహా ప్రాజెక్టులున్నాయి. చిన్న తరహా నీటిపారుదల కింద 33 వేల ఎకరాలు, చిన్న ఎత్తిపోతల పథకాల కింద 27 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని, మొత్తం 10.53 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెస్తామని పేర్కొంది. 2018-19 నీటి సంవత్సరంలో అదనంగా 1.77 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చినట్లు వెల్లడించింది. గత బడ్జెట్‌ వల్ల వచ్చిన ఫలితం, కొత్త బడ్జెట్‌ లక్ష్యాలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. నీటిపారుదల శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుతో ఈ వీటిని ప్రవేశపెట్టారు. నీటిని గరిష్ఠంగా వినియోగించుకోవడానికి రూ.2,26,957 కోట్లతో 70.10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 10.01 లక్షల ఎకరాల స్ధిరీకరణకు 36 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపింది. వీటిలో 12 ప్రాజెక్టులు సంపూర్ణంగా, మరో 11   పాక్షికంగా పూర్తయ్యాయని, ఇప్పటివరకు 17.25 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చిందని నివేదించింది.

2021 నాటికి కాళేశ్వరం పూర్తి
* కాళేశ్వరం ఎత్తిపోతలపథకంలో ఇప్పటివరకు 65 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం పథకం 2021 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో కొన్ని ప్యాకేజీల పనులు అన్ని రకాల పూర్తయ్యి నీటిని విడుదల చేశాం. ముఖ్యమైన పనులన్నీ పూర్తి కావచ్చాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
* రోజుకొక టీఎంసీ నీటిని మళ్లించే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి అన్ని రకాల పనులు పూర్తవుతాయి. ఈ పథకం ద్వారా 60 టీఎంసీల నీరు శ్రీరామసాగర్‌కు మళ్లిస్తాం.
* దేవాదుల మొదటి దశ అన్ని రకాల పూర్తయ్యింది. 2009 నుంచి ధర్మసాగర్‌ వరకు నీటిని మళ్లిస్తున్నారు. రెండో దశ పనులు కూడా పూర్తయ్యాయి. మొదటి, రెండుదశల కింద 2018-19లో 14.223 టీఎంసీల నీటిని మళ్లించాం. డిస్ట్రిబ్యూటరీ పనులు 76 శాతం పూర్తయ్యాయి. 2018-19లో దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 269 చెరువులు నింపారు.మూడవ దశ పనులు జరుగుతున్నాయి.
* కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలిసి 6.44 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు 8 ప్యాకేజీలుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలన్నది లక్ష్యం.
* పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వేగం పెంచేందుకు చర్యలు. ఇటీవలే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.పదివేల కోట్ల రుణం తీసుకున్నాం.
* ఎల్లంపల్లి, వరదకాలువసహా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి చర్యలు.
* శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.  ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులు 67.83 శాతం పూర్తయ్యాయి. 2021 మార్చి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం.
* కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 447 చెరువులు నింపారు. భీమా కింద 2018-19లో 12.194 టీఎంసీలతో 1.23 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు. 2020 జులై నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. నెట్టెంపాడు ఎత్తిపోతలను 2020 జులైకి పూర్తిచేయాలన్నది లక్ష్యం.

1200 కొత్త చెక్‌ డ్యాంలు
భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరీ వాహక ప్రాంతాల్లోని వాగుల్లో ప్రవహించే నీటిని ఒడిసిపట్టుకునేందుకు 1200 చెక్‌డ్యాంలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిషన్‌త కాకతీయ పథకం స్థానంలో చెక్‌డ్యాంల నిర్మాణాలను తీసుకొస్తోంది. దీనికోసం రూ.3,825 కోట్లు ప్రతిపాదించింది.

మిషన్‌ కాకతీయకు రూ.264.64 కోట్లు

* మిషన్‌ కాకతీయ పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.264.64 కోట్లు కేటాయించింది. చెరువులన్నింటినీ పూర్తి చేసేందుకు ఇంకా దాదాపు రూ.మూడు వేల కోట్ల వరకు అవసరం ఉంది.
* ఈ పథకం కింద గతేడాది వరకు నాలుగు విడతల్లో  27,584 చెరువుల మరమ్మతులను చేపట్టారు. వాటిలో 21,275 చెరువుల పనులు మాత్రమే భౌతికంగా పూర్తయ్యాయి. రూ.8,735.32 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా రూ.5,145.46 కోట్లు మాత్రమే వ్యయం చేశారు.
* నాలుగు దశల్లో  చెరువుల కింద 14.15 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది.
* మిషన్‌ కాకతీయకు 2018-19 బడ్జెట్‌లో వివిధ పద్ధతుల కింద రూ.1,592 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది మాత్రం కేటాయింపులు పూర్తిగా తగ్గిపోయాయి.
* రాష్ట్రంలో 46,531 చెరువులు ఉండగా వాటి కింద 25.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత రెండేళ్లలో మరో 58 చెరువులను కొత్తగా తవ్వారు. వరదలతో దెబ్బతినే చెరువుల పునరుద్ధరణకు ఈ బడ్జెట్‌లో రూ.2.74 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించినా రూ.2.73 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. నీటి పారుదల అభివృద్ధి సంస్థతో (టీఎస్‌ ఐడీసీ) కలుపుకొని ఈ ఏడాది చిన్న నీటిపారుదల శాఖకు ప్రభుత్వం రూ.642.02 కోట్లు కేటాయించింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.