close
నల్గొండలో కుంభవృష్టి

6 గంటల వ్యవధిలో 20 సెం.మీ. వర్షం
పట్టణంలో 119 ఏళ్లలో ఇదే రికార్డు
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వానలు
రాష్ట్రంలో నేడు, రేపు.. భారీ, అతి భారీ వర్షాలు!
హైదరాబాద్‌లో రాత్రి 10.50 గంటల నుంచి ఏకధార
రహదారులు, లోతట్టు  ప్రాంతాలు జలమయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్గొండలో కుంభవృష్టి, హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ పట్టణంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా 6 గంటల్లో 200.8 మిల్లీమీటర్ల వర్షం కురిసి సరికొత్త రికార్డు నమోదైంది. ఈ పట్టణంలో గత 119 ఏళ్ల వాతావరణ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వర్షం పడటం ఇదే తొలిసారి. ఇక్కడ 2013 అక్టోబరు 26న 24 గంటల వ్యవధిలో 200 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇప్పుడు దానికి మించిపోవడం గమనార్హం.
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటలకే ఈ స్థాయి వర్షం కురిసింది.

రాష్ట్రంలోనూ కొత్త రికార్డు
రాష్ట్రంలో గత పదేళ్లలోనూ సెప్టెంబరు నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షపాతం 2014 సెప్టెంబరు 7న రామగుండంలో 152.6 మి.మీ.గా రికార్డుల్లో ఉంది. ఆ రికార్డు ఇప్పుడు  చెరిగిపోయింది. మంగళవారం నల్గొండలో కురిసిన 200.8 మి.మీ.తో అది కొట్టుకుపోయి సెప్టెంబరు నెలకు కొత్త రికార్డు నమోదైంది. రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ 700 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 26 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.

రాజధానిని వణికించిన కుండపోత!
రాజధానిలో మంగళవారం రాత్రి కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రాత్రి 10.50 గంటల నుంచి వాన మొదలైంది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. కొన్ని ప్రధాన రహదారులపై నడుము లోతున నీరు నిలిచింది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు మెహిదీపట్నం, కోఠి, ఎల్బీనగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ఆరాంఘర్‌ చౌరస్తాలో ప్రైవేటు బస్సుల కోసం పెద్దయెత్తున ఎదురు చూస్తున్న ప్రయాణికులు నిల్చునే చోటు లేక తడిసిముద్దయ్యారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనదారులూ ఇబ్బందులకు గురయ్యారు. మెహిదీపట్నం-ఆరాంఘర్‌చౌరస్తా మార్గంలో అనేకచోట్ల రోడ్డు నీట మునగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి వేళ కావడంతో ట్రాఫిక్‌ సమస్య తప్పినప్పటికీ.. లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీల్లో వరదనీరు ఇళ్లలోకి చేరింది. ఎల్బీనగర్‌, చింతలకుంట ప్రాంతాల్లో పైవంతెనలు, అండర్‌పాస్‌ నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా.. వాటి దగ్గర నీరు భారీగా చేరుకుంది. రోడ్డు మార్గాన్ని అంచనా వేయలేనంతగా వరద నిలిచిపోయింది. రాత్రి 11 గంటల వరకు అందిన వాతావరణశాఖ లెక్కల ప్రకారం గరిష్ఠంగా బేగంపేటలో 2 సెం.మీ. వర్షం కురిసింది.

నీట మునిగిన పంటలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలిలాగే కొనసాగితే నష్టం పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాల కారణంగా పలుచోట్ల చెట్లు విరిగిపడి కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. భద్రాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కరెంటు లేదు.

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
రాష్ట్రంలో బుధవారం భారీ, గురువారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. కోస్తాంధ్ర తీరానికి దగ్గరలోని బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నట్లు రాజారావు చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.