close
బతుకమ్మ చీరలకు ప్రత్యేక బ్రాండ్‌

రాష్ట్ర మార్కెట్లో విడుదల
ఇక నుంచి విదేశాలకు ఎగుమతి
23 నుంచి 1.02 కోట్ల మంది మహిళలకు ఉచిత చీరల పంపిణీ
చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

తుకమ్మ పర్వదినం సందర్భంగా నిరుపేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే చీరలకు ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు కల్పించి.. వాటిని రాష్ట్ర మార్కెట్లో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వీటిని నిరంతరం ఉత్పత్తి చేస్తూ దేశవిదేశాలకు సైతం ఎగుమతి చేస్తామన్నారు. బతుకమ్మ చీరలకు విశేషాదరణ లభించడంతో పాటు, భారీగా డిమాండు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 1.02 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను ఈ నెల 23వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ నెల 28న బతుకమ్మ పండుగ కాగా.. అంతకు ఒకరోజు ముందే వీటిని మహిళలందరికీ అందజేస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని పురపాలక సంచాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఆత్మగౌరవాన్ని చాటేలా పండుగ కానుక ఇవ్వడంతో పాటు మరమగ్గాల నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మూడేళ్ల క్రితం చీరల తయారీ ప్రారంభించాం. మొదటి సంవత్సరం కొన్నింటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాం. రెండేళ్లుగా పూర్తిగా సిరిసిల్లలోని కార్మికులే తయారు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.313 కోట్లతో చీరలను అందంగా, నాణ్యంగా తయారు చేయించాం. 18 ఏళ్లు నిండి తెల్లకార్డు గలిగిన మహిళందరికీ చీరలను ఉచితంగా ఇస్తాం. పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.’’ అని కేటీఆర్‌ చెప్పారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, కమిషనర్‌ శైలజారామయ్యర్‌, పురపాలక సంచాలకురాలు టీకేశ్రీదేవి పాల్గొన్నారు.

తెలంగాణలో పెట్టుబడులకు సంపూర్ణ భరోసా: కేటీఆర్‌
తెలంగాణలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం సంపూర్ణ భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రితో వివిధ దేశాల రాయబారులు, విదేశీ ప్రతినిధులు విడివిడిగా సమావేశమయ్యారు. భారత్‌లోని దక్షిణాఫ్రికా హైకమిషనర్‌ సిబుసిసో ఎన్డెబెలో నేతృత్వంలో దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందం మాసాబ్‌ ట్యాంక్‌లోని పురపాలకశాఖ భవనంలో భేటీ అయ్యింది. మంత్రి వారికి తమ పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు అనుకూలతల గురించి వివరించారు. 14 ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. భారతదేశంలో లక్సెంబర్గ్‌ రాయబారి జీన్‌ క్లాడ్‌ కుగెనర్‌ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఫిన్‌టెక్‌, వైమానిక, వాహన తయారీ రంగాల్లో పెట్టుబడులకు అనేక సంస్థలు ఆసక్తితో ఉన్నాయని కుగెనర్‌ తెలిపారు. బెంగళూరులోని ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్జరీ వాన్‌ బేలిగమ్‌ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.