close
యుద్ధం.. ఏదైనా సిద్ధం

భారత కొత్త సైనిక వ్యూహ పత్రానికి తుది మెరుగులు

దిల్లీ: భవిష్యత్‌లో జరిగే యుద్ధాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఈదిశగా జాతీయ భద్రతా వ్యూహపత్రం (ఎన్‌ఎస్‌ఎస్‌) తయారవుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ నేతృత్వంలోని రక్షణ ప్రణాళిక కమిటీ (డీపీసీ) రూపొందిస్తున్న పత్రం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ ముసాయిదా వచ్చే నెలలో కేంద్రానికి అందుతుంది. భారత సైనిక విధానాన్ని నిర్వచించే ప్రాథమిక పత్రానికి భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలపగానే సదరు వ్యూహ పత్రంలో గోప్యంగా ఉంచాల్సిన విషయాలు మినహా మిగతా భాగాన్ని బహిరంగపరుస్తారు. గత ఏడాది ఏప్రిల్‌లో డీపీసీ ఏర్పాటైంది. అయితే త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్‌) పదవిపై ప్రకటన చేసేవరకూ నివేదికను పెండింగ్‌లో ఉంచారు. గత నెలలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ సీడీఎస్‌ పదవిని సృష్టిస్తున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఈ పదవికి ఎంపికయ్యే అవకాశం ఉంది.
* అణ్వస్త్ర ప్రయోగానికి మొదట దిగరాదన్న దేశ వైఖరిని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ముసాయిదా వ్యూహపత్రంలో పునర్‌నిర్వచించే అవకాశం ఉంది. ఎలాంటి సందర్భాల్లో ఈ ఆయుధాలను ప్రయోగించాలన్న అంశంపైనా స్పష్టత రావొచ్చు.
* ఎన్ని వైపుల నుంచి భారత్‌కు సైనిక ముప్పు పొంచి ఉందన్నది కూడా ఈ నివేదిక నిర్వచించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ వైపుల నుంచి ఏకకాలంలో ముప్పు తలెత్తవచ్చునన్న అంచనా ఉంది. దేశ ఆయుధాగారంలో నిల్వ చేయాల్సిన మందుగుండు సామగ్రి పరిమాణాన్ని నిర్దేశించేది ఈ అంచనాయే. ప్రస్తుతం భారత్‌ 10 రోజుల తీవ్రస్థాయి యుద్ధం కోసం తన ఆయుధాగారాన్ని సిద్ధం చేసింది.
* రానున్న కాలంలో భారత నౌకాదళ తీరుతెన్నులనూ ఈ వ్యూహ పత్రం నిర్దేశించనుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లి యుద్ధం చేయగలిగే ‘ఎక్స్‌పిడీషనరీ దళం’ అవసరమా అన్నది  పరిశీలించనుంది. వందల కోట్ల డాలర్లు ఖరీదు చేసే విమానవాహక నౌకలు మరిన్ని అవసరమా లేక భారత పరిధిలోని 611 దీవుల్లో వైమానిక స్థావరాలు అభివృద్ధి చేస్తే సరిపోతుందా అన్నది కూడా విశ్లేషించనుంది.
* రోదసిలోని ఉపగ్రహాలను విధ్వంసం చేసే ఆయుధాలపై కూడా భారత్‌ తన వైఖరిని వెల్లడించనుంది. ఆరు నెలల కిందట ‘మిషన్‌ శక్తి’ పేరుతో ఈ సామర్థ్యాన్ని మన దేశం  ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తద్వారా అంతరిక్షంలో పోరాడే సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ కూడా చేరింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.