close
పంగాల్‌ ఫైనల్‌ పంచ్‌

చరిత్ర సృష్టించిన అమిత్‌
ప్రపంచ బాక్సింగ్‌ ఫైనల్‌ చేరిన తొలి భారతీయుడిగా ఘనత
కాంస్యంతో సరిపెట్టుకున్న మనీష్‌

భారత బాక్సింగ్‌లో సంచలనం. సూపర్‌ ఫామ్‌లో ఉన్న యువ బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ (52 కేజీ) చరిత్ర సృష్టించాడు. పంచ్‌ల వర్షం కురిపిస్తూ ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు కేవలం కాంస్యాలే గెలుచుకున్న భారత్‌కు పసిడి పతకాన్ని అందించేందుకు పంచ్‌ దూరంలో నిలిచాడు అమిత్‌. మరోవైపు మనీష్‌ సెమీఫైనల్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

ఏక్తరిన్‌బర్గ్‌ (రష్యా)

మిత్‌ పంగాల్‌ అదరగొట్టాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఆరంభం నుంచి తిరుగులేని ప్రదర్శన చేస్తోన్న అతడు.. అదే జోరుతో ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లోనూ పదునైన పంచ్‌లతో చెలరేగిపోయాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో 23 ఏళ్ల అమిత్‌ (52 కేజీ) 3-2 తేడాతో సాకెన్‌ బిబోసినోవ్‌ (కజకిస్థాన్‌)పై విజయం సాధించాడు. తనకంటే పొడవైన ప్రత్యర్థి ఆటతీరును అంచనా వేసేందుకు ఆరంభంలో సహనం వహించిన రెండో సీడ్‌ అమిత్‌.. ఒక్కసారి పట్టు చిక్కగానే చెలరేగాడు. సాకెన్‌ పంచ్‌లను తప్పించుకుంటూ అతడిపై ముష్టిఘాతాలు కురిపించాడు. బలమైన, కచ్చితత్వంతో కూడిన పంచ్‌లతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. పసిడి పోరులో శనివారం అమిత్‌.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ షఖోబిదిన్‌ జోరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో తలపడతాడు. ‘‘బౌట్‌ నాకు అనుకూలంగా సాగింది. విజయం కోసం అనుకున్న దాని కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. భారత బాక్సింగ్‌ రంగంలో ఇదో పెద్ద ఘనత. నాకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ ధన్యవాదాలు. ఫైనల్లో పూర్తిస్థాయి ఆటతీరు ప్రదర్శించి స్వర్ణం సాధించడానికి ప్రయత్నిస్తా’’ అని సెమీస్‌ బౌట్‌ అనంతరం అమిత్‌ తెలిపాడు.

ఓడినా.. ఆకట్టుకున్నాడు: బరిలో దిగిన తొలి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లోనే అదిరే ఆటతీరుతో అంచనాలను అమాంతం పెంచేసిన మరో భారత బాక్సర్‌ మనీష్‌ కౌశిక్‌ సెమీస్‌లో ఓడి, కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 63 కేజీల విభాగంలో అతడు 0-5తో టాప్‌ సీడ్‌ ఆండీ గోమెజ్‌ (క్యూబా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ప్రత్యర్థి దాడి నుంచి తప్పించుకోవడంలో మనీష్‌ విఫలమయ్యాడు. 23 ఏళ్ల మనీశ్‌ ఫైనల్‌ చేరలేకపోయినా టోర్నీలో అతడి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ‘‘విజయం కోసం వందశాతం కష్టపడ్డా. కానీ కొన్ని విషయాల్లో వెనకబడినట్లు అనిపించింది. తప్పులను సరిదిద్దుకొని మెరుగవుతా. బాగా శ్రమించి తర్వాతి టోర్నీల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తా’’ అని మనీష్‌ అన్నాడు. ఒక ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు రావడం ఇదే తొలిసారి. విజేందర్‌ సింగ్‌ (2009), వికాస్‌ కృష్ణన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధూరి (2017) వేర్వేరు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యాలు సాధించారు.

ఆ బౌలింగ్‌ పంచ్‌ 

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సాకెన్‌తో అమిత్‌ సెమీస్‌ మ్యాచ్‌.. ఈ బౌట్‌ గెలిస్తే ఫైనల్‌ చేరిన తొలి భారత బాక్సర్‌గా నిలిచే అవకాశం. మరోవైపు ప్రత్యర్థి తనకంటే పొడగరి. బౌట్‌ హోరాహోరీగా సాగుతోంది.. ఆ దశలో అమిత్‌ విసిరిన ఓ పంచ్‌ ప్రత్యర్థి ముఖాన్ని బలంగా తాకింది. అతని ఆధిక్యాన్ని పెంచింది. మ్యాచ్‌ గెలిచేలా చేసింది. బౌట్‌ చూస్తున్న వాళ్లందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే ఓవర్‌హ్యాండ్‌ పంచ్‌. దీన్ని బౌలింగ్‌ పంచ్‌ అని కూడా పిలుస్తారు. దీన్ని విసరడంలో అమిత్‌ ఆరితేరాడు. ఫాస్ట్‌బౌలర్‌ బంతి వేసేటపుడు ఎలా ఉంటుందో.. ఈ పంచ్‌ శైలి కూడా అలాగే ఉంటుంది. చేతిని ప్రత్యర్థి ముఖం కింద నుంచి వెనక్కు లాగుతూ పైకి లేపి.. తిరిగి ప్రత్యర్థి ముఖంపై పడేలా పంచ్‌ విసరడం దీని ప్రత్యేకత. పొడవైన ప్రత్యర్థి ఉన్నపుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎత్తున్న ఆటగాళ్లు కింది నుంచి విసిరే ఈ పంచ్‌ను ఊహించలేరు. ఇదంత సులువు కాదు. కొన్ని నెలల పాటు ఎంతో సాధన చేసి అమిత్‌ ఈ పంచ్‌పై పట్టు సాధించాడు. దీన్ని తన ప్రధాన ఆయుధాల్లో ఒకటిగా మార్చుకున్నాడు. ఆ పంచ్‌ను వాడే విధానంలోనూ అతను వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు. సాధారణంగా ఒక బాక్సర్‌ ఒక రకమైన పంచ్‌ను ముందే అనుకొని ప్రత్యర్థి మీద విసురుతాడు. కానీ అమిత్‌ ఒక పంచ్‌ విసరడంలో ఏమైనా తేడాలు వస్తే.. వెంటనే ప్రత్యర్థి ఊహకు అందని విధంగా మరో రకమైన పంచ్‌తో షాకిస్తున్నాడు. ‘‘అమిత్‌ విసిరిన ఈ పంచ్‌ ఆశ్చర్యం కలిగించింది. దాని నుంచి తప్పుకోవడం ప్రత్యర్థికి సాధ్యం కాదు. అమిత్‌ సరైన సమయంలో దీన్ని ప్రయోగించాడు. చాలా కష్టంతో కూడుకున్న ఈ పంచ్‌ను అమిత్‌ ప్రభావవంతంగా ఉపయోగిస్తున్నాడు’’ అని భారత బాక్సింగ్‌ హైపర్ఫామెన్స్‌ డైరెక్టర్‌ సాంటిగో నీవా అన్నాడు.
- ఈనాడు క్రీడావిభాగం

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.