close
వేగంగా పాలమూరు-రంగారెడ్డి

రోజుకొక టీఎంసీ  వినియోగానికి వీలుగా పనులు
రిజర్వాయర్లలోనూ కొన్ని మార్పులకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మొదట రోజుకు ఒక టీఎంసీ నీటి వినియోగానికి తగ్గట్లుగానే పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి తగ్గట్లుగా కసరత్తు చేపట్టిన నీటిపారుదల శాఖ ఇప్పటివరకు చేసిన ఖర్చు పోనూ మరో రూ.16,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శ్రీశైలం నుంచి రోజూ రెండు టీఎంసీల నీటిని మళ్లించేలా పాలమూరు పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 60 రోజుల్లో 120 టీఎంసీలు మళ్లించి ఇందులో 90 టీఎంసీలు పాలమూరు-రంగారెడ్డి పథకానికి, 30 టీఎంసీలు డిండి ఎత్తిపోతల పథకానికి వినియోగించుకోవాలన్నది ప్రణాళిక. తాజా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 52,600 కోట్లు అయ్యింది. ఇప్పటివరకు భూసేకరణ, పునరావాసానికి చేసిన ఖర్చు రూ. 1,200 కోట్లతో కలిపి సుమారు రూ. 6,000 కోట్లు వ్యయం చేశారు. అన్ని పనులను పూర్తిచేయాలంటే రెండు, మూడేళ్లలో భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి దీనిపై సమీక్షించినపుడు మొదట కనీసం ఒక టీఎంసీ నీటి మళ్లింపు సామర్థ్యంతో అయినా పనులు పూర్తి చేయాలని సూచించినట్లు తెలిసింది. దీనిపై నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, ప్రాజెక్టు ఇంజినీర్లు అధ్యయనం చేసినట్లు తెలిసింది. టెండర్లు ఖరారు చేసిన 4 లిప్టు పనులకు ఒప్పందాలు చేసుకోగా, ఇందులో రెండుచోట్ల తొమ్మిదేసి, ఒకచోట ఎనిమిది, ఒకచోట ఐదు పంపులు ఉన్నాయి. మొదటి పంపుహౌస్‌లో 8 ఉండగా 4, మిగిలిన రెండు పంపు హౌస్‌లలో తొమ్మిదేసి ఉండగా 4 లేదా 5, నాలుగో లిప్టులో 3 పంపుల పనులు పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రెండు ప్యాకేజీల్లో రెండేసి సొరంగమార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాలువ తక్కువ దూరమే ఉంది. రిజర్వాయర్లలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలిసింది.

అంచనా పెరుగుతుంది
నార్లాపూర్‌ రిజర్వాయర్‌ కట్ట పొడవు 11.02 కి.మీ. ఇందులో మధ్యలో ఉన్న కొండలు పోనూ 6.647 కి.మీ. దూరం మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. ఇందులో రెండో రీచ్‌లో కి.మీ. 6.275 నుంచి కి.మీ. 6.950 వరకు అంటే 675 మీటర్ల దూరం 74 మీటర్ల ఎత్తుకు రాక్‌ఫిల్‌డ్యాం నిర్మించాలి. దీనివల్ల ఈ రిజర్వాయర్లో 8.51 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు పర్యటనకు వెళ్లినపుడు రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మించడంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఈ ప్రాంతంలో నీటి ప్రవాహమార్గం (గార్జ్‌) ఉన్నందున ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని సూచించారు. దీనిపై ఇంజినీర్లు కసరత్తు చేస్తున్నారు. 74 మీటర్ల ఎత్తుతో రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మించకపోతే 2 కిలోమీటర్ల పొడవు మట్టికట్టను నిర్మించాల్సి వస్తుందని తేల్చినట్లు తెలిసింది. దీనివల్ల రూ. 120 కోట్లు అదనంగా వ్యయమవుతుందని అంచనా. దీంతోపాటు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీల మేర తగ్గి 5.5 టీఎంసీలు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.