close
దేశ ఖ్యాతి.. విశ్వవ్యాప్తి

భారత విజయాల్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యం
నేటి నుంచి ప్రధాని మోదీ వారం రోజుల అమెరికా పర్యటన
ప్రవాస భారతీయులతో హ్యూస్టన్‌లో ఆత్మీయ భేటీ
ట్రంప్‌తో విస్తృత చర్చలు
ఐరాసలో కీలక ప్రసంగాలు
ఈనాడు - దిల్లీ

పెట్టుబడుల ఆకర్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్‌ సాధించిన విజయాలు, గాంధీ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. శనివారం నుంచి వారం రోజుల పాటు (21 నుంచి 27 వరకు) హ్యూస్టన్‌, న్యూయార్క్‌ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వెళ్లేది రెండు నగరాలకే అయినా తీరికలేని విధంగా సమావేశాలు, సదస్సులు, చర్చల్లో భాగస్వాములు కానున్నారు. గత అర్ధ శతాబ్దంగా ప్రపంచ పరిస్థితులు మారిన నేపథ్యంలో భారత్‌ ప్రాధాన్యం పెరిగిందని చాటిచెప్పడం కూడా అంతర్లీనంగా ఉన్న ఆశయం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించేలా ఐక్య రాజ్యసమితిని సంస్కరించి అందులో భారత్‌కు కీలక స్థానం లభించేలా ఒప్పించడం పర్యటన అజెండాలో ఒక ముఖ్యాంశం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఆరోసారి. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి. ఆదివారం హ్యూస్టన్‌ నగరంలో ప్రవాస భారతీయులతో ‘హౌడీ మోదీ’ పేరుతో జరిగే భారీ సభ ఈ పర్యటనలో కీలకం. అమెరికాలో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది మూడోసారి.

2014లో తొలిసారి న్యూయార్క్‌ నగరంలోని మాడిసన్‌ స్క్వేర్‌లో, రెండోసారి 2015లో కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌ సాప్‌ సెంటర్‌లలో ప్రసంగించారు. అమెరికా సమాజానికి ఆర్థికంగా భారతీయులు అందిస్తున్న తోడ్పాటును చాటిచెప్పేలా సాగే హ్యూస్టన్‌ కార్యక్రమంలో అమెరిఎకా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు, అధికార డెమొక్రాటిక్‌, ప్రతిపక్ష రిపబ్లిక్‌ పార్టీల నాయకులు పాల్గొననున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో అత్యంత ప్రభావంతమైన భారతీయ సమాజాన్ని ఆకర్షించడం కోసం ఆ దేశ నాయకులు దీన్ని ఓ మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చే కాంగ్రెస్‌ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడనున్నారు. తర్వాత న్యూయార్క్‌ బయలుదేరి వెళ్తారు. అక్కడ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, వివిధ దేశాల నాయకులతో భేటీ అవుతారు.

‘హౌడీ’ అంటే..

అమెరికా నైరుతి ప్రాంతాల్లో స్నేహ పూర్వకంగా పిలిచే ‘హౌ డు యూ డు’ (ఎలా ఉన్నారు?)ను సంక్షిప్తంగా ‘హౌడీ’ అని అంటారు. అందుకే ప్రాస కుదిరేలా ఈ కార్యక్రమానికి ‘హౌడీ మోదీ’ అని పేరు పెట్టారు. 

భారత్‌.. అవకాశాల నేల, విశ్వసనీయ భాగస్వామి, విశ్వ నేత అని విశ్వాసం కలిగించేలా నా పర్యటన ఉంటుంది. అమెరికాతో ఉన్న సంబంధాలకు నా పర్యటన కొత్త శక్తిని ఇస్తుందని ఆశిస్తున్నా. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య వారధిలా నిలిచిన భారత సంతతి ప్రజలు, అమెరికాకు వారు అందిస్తున్న సేవలు మనందరికీ గర్వకారణం. కలిసి పనిచేయడం ద్వారా సురక్షిత, సుసంపన్న ప్రపంచాన్ని నిర్మించగలమని విశ్వసిస్తున్నా.

- అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు మోదీ ప్రకటన

ఏ రోజు ఏ కార్యక్రమం

శనివారం (సెప్టెంబరు 21) 
హ్యూస్టన్‌ చేరుకోగానే తొలుత 16 చమురు కంపెనీల సీయీవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. చమురు, సహజవాయువుల రంగంలో భారత్‌ది ప్రధానమైన మార్కెట్‌ అని వారికి చెప్పడం, పెట్టుబడులను ఆకర్షించడం ఈ భేటీ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

ఆదివారం (సెప్టెంబరు 22) 
ఏ దేశానికి వెళ్లినా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించడం ప్రధాని మోదీకి ఓ సంప్రదాయంగా మారింది. అందులో భాగంగానే హ్యూస్టన్‌లో జరిగే ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

సోమవారం (సెప్టెంబరు 23)
న్యూయార్క్‌లో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సులో ప్రసంగిస్తారు.
*సార్వత్రిక వైద్య సేవలపై గుటెరెస్‌ ఆధ్వర్యంలోనే జరగనున్న మరో సదస్సులో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం విశేషాలను వివరిస్తారు.
*గుటెరస్‌తో పాటు జోర్డాన్‌ రాజు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు, న్యూజిలాండ్‌ ప్రధానిల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఉగ్రవాదులకు వ్యూహాత్మక సమాధానాలు’ అనే అంశంపై జరిగే సదస్సులో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో జర్మనీ ఛాన్సెలర్‌, బ్రిటన్‌ ప్రధాని, కెన్యా అధ్యక్షుడు, ఇండోనేసియా అధ్యక్షుడు పాల్గొంటారు. 

మంగళవారం (సెప్టెంబరు 24)
‘బిగ్‌ ఆపిల్‌’ అని ముద్దుగా పిలుచుకునే న్యూయార్క్‌ నగరంలోనే మోదీ-ట్రంప్‌లు మరోసారి సమావేశం అవుతారు. రక్షణ రంగంలో సహకారం, దక్షిణాసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతం, అఫ్గానిస్థాన్‌ అంశాలతో పాటు వాణిజ్యంపై చర్చలు జరగనున్నాయి. 
*మహాత్మా గాంధీ 150వ జయింతి సందర్భంగా ఐరాసలో ‘ప్రస్తుత పరిస్థితులకు గాంధీ ఆవశ్యకత’ అనే అంశంపై జరిగే సదస్సులో ప్రసంగిస్తారు. గుటెరస్‌తో పాటు, దక్షిణ కొరియా అధ్యక్షుడు; సింగపూర్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, జమైకా దేశాల ప్రధానులు పాల్గొంటారు. 
*ఐక్యరాజ్య సమితికి 50 కిలోవాట్‌ల సామర్థ్యం గల ‘గాంధీ సౌర విద్యుత్తు పార్క్‌’ను బహుమతిగా ఇవ్వనున్నారు. ఐరాస ప్రధాన కార్యాలయ భవనం పైభాగాన దీన్ని ఏర్పాటు చేశారు. ఐరాసలో 193 సభ్య దేశాలు ఉండగా, ప్రతి దేశానికి ఒక సోలార్‌ ప్యానెల్‌ను కేటాయించారు. 
*స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రాంగణంలో 150 మొక్కలతో ఏర్పాటు చేసిన ‘గాంధీ శాంతి వనం’ను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభిస్తారు.
*స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టినందుకు బిల్‌-మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ బహూకరించే గ్లోబల్‌ గోల్‌ కీపర్స్‌ గోల్‌ పురస్కారాన్ని స్వీకరిస్తారు. 
*ఇండియా-పసిఫిక్‌ దీవుల నాయకుల సమావేశంలో ప్రసంగిస్తారు.

బుధవారం (సెప్టెంబరు 25)
బ్లూంబర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం సదస్సులో కీలక ఉపన్యాసం చేస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మూడు సార్లు న్యూయార్క్‌ మేయర్‌గా పనిచేసిన మైక్‌ బ్లూంబర్గ్‌తో చర్చలు జరుపుతారు. 
*45 కంపెనీల ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో జరిగే ‘పెట్టుబడుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం’లో పాల్గొంటారు. 
*14 కరేబియన్‌ దేశాలతో జరిగే ‘ఇండియా- కరికోం’ సదస్సుకు సహ అధ్యక్షత వహిస్తారు. ప్రకృతి వైపరీత్యాల నివారణకు ఆ దేశాలకు సహాయం అందించే విషయమై చర్చలు జరుపుతారు. 

గురువారం (సెప్టెంబరు 26)
పలు వర్గాలతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరుపుతారు. (దాదాపు 20 బృందాలతో చర్చలు జరిపే అవకాశం)

శుక్రవారం (సెప్టెంబరు 27)
ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగిస్తారు. ఈ సభలో ప్రసంగించడం ఆయనకు ఇది రెండో సారి. మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఐరాసను సంస్కరించాలని పిలుపునిస్తారు. ఉగ్రవాదాన్ని ప్రస్తావించనున్నా అది ప్రధాన అంశంగా ఉండబోదు. కశ్మీర్‌ సమస్య అంతర్గత విషయం కావడంతో దాని ఊసే ఎత్తరు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.