close
ఇష్టారాజ్యంగా ఇండెంట్లు

ఐఎంఎస్‌ కుంభకోణంలో ఎన్నో చిత్రవిచిత్రాలు
అనిశా దర్యాప్తులో వెలుగుచూస్తున్న వాస్తవాలు
ఈనాడు - హైదరాబాద్‌

రూ.8 లక్షలకు దొరికే వస్తువులను ఎవరైనా రూ.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తారా..? రూ.6 లక్షలకే దొరికే అవకాశమున్నా సరే డబ్బుంది కదా అని రూ.3 కోట్లు ఇచ్చేస్తారా..? బీమా వైద్య సేవల (ఐఎంఎస్‌) విభాగంలో ఇంటిదొంగలు ఇలాగే చేశారు. తర్వాత ఆయా సంస్థల నుంచి ఆ డబ్బును పొంది వాటాలు వేసి మరీ పంచుకున్నారు. ఇలాంటి అక్రమాలెన్నో ఆ విభాగంలో నెలకొన్నట్లు అవినీతి నిరోధక శాఖ (అనిశా) దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ సంస్థ నిర్వహణ నిబంధనల మేరకు ఉంటుంది. కానీ ఐఎంఎస్‌ వ్యవహారాలు మాత్రం అందుకు అతీతంగా సాగాయి.  ఈ కుంభకోణంపై అనిశా లోతైన దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్మయకర కోణాలు బహిర్గతమవుతున్నాయి.

అప్పనంగా రూ.కోట్ల అప్పగింత

ఇండెంట్ల తయారీ అనంతరం ఔషధాల కొనుగోళ్లలోనూ బరితెగించారు. నిబంధనల మేరకు రేట్‌ కాంట్రాక్టు సంస్థల నుంచి తక్కువ ధరకే ఔషధాలు కొనుగోలు చేసే వీలున్నా అత్యవసరం ముసుగులో స్థానిక ఔషధ సంస్థల నుంచి కొనుగోలు చేసి రూ.కోట్లు కొల్లగొట్టారు. ఉదాహరణకు 2017 అక్టోబరు 9 నుంచి 26 లోపు స్థానిక ఔషధ సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్లు 156 కొనుగోలు ఉత్తర్వులు (పర్చేజ్‌ ఆర్డర్లు) రూపొందించారు. ఆ మేరకు రూ.4.03 కోట్లను ఆయా స్థానిక సంస్థల పేర్లతో దోచేశారు. వాస్తవానికి రేట్‌ కాంట్రాక్టు సంస్థల్లో అవే ఔషధాలు కేవలం రూ.8.2 లక్షలకే లభిస్తాయని అనిశా దర్యాప్తులో తేలింది. ఇలాంటి పర్చేజ్‌ ఆర్డర్లు కుప్పలుగా ఉన్నట్లు గుర్తించారు.

తేదీలు లేకుండానే...
సాధారణంగా కార్మికులకు అవసరమైన ఔషధాల కోసం డిస్పెన్సరీలు ఇండెంట్లు రూపొందించి దశలవారీగా సంచాలకురాలి కార్యాలయం వరకు పంపి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఉన్నతస్థాయిలో ఆ ఇండెంట్‌కు ఆమోదం లభిస్తేనే రేట్‌ కాంట్రాక్టు సంస్థలు ఔషధాల్ని సరఫరా చేస్తాయి. కానీ ఇక్కడ ఇబ్బడిముబ్బడిగా బోగస్‌ ఇండెంట్లను సృష్టించారు. వాటిపై సిబ్బంది సహా అధికారులూ సంతకాలు చేసేశారు. ఎప్పుడైనా సొమ్ము స్వాహా చేసేందుకు అనుగుణంగా పలు ఇండెంట్లపై తేదీల్లేకుండానే సంతకాలు చేసేశారు. అనంతరం వీలు చిక్కినప్పుడు వాటిని క్లెయిమ్‌ చేసి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు కొట్టేశారు.

ఇండెంట్ల ఖాళీ స్థలాలనూ వదల్లేదు..
ఇండెంట్లలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకొని అక్రమాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు ఐడీఏ బొల్లారం డిస్పెన్సరీకి మందులు అవసరమున్నట్లు ఇండెంటు తయారు చేయాలని సంయుక్త సంచాలకురాలు డా.పద్మ సిబ్బందిని ఆదేశించారు. ఆ మేరకు 29 ఔషధాలతో కూడిన ఇండెంట్‌ రూపొందించాలని బొల్లారం డిస్పెన్సరీ సిబ్బందికి వారు సూచించారు. అక్కడి సిబ్బంది అలాగే ఇండెంట్‌ తయారు చేసి సంయుక్త సంచాలకురాలి కార్యాలయానికి పంపించారు. అక్కడ ఆ ఇండెంట్‌కు మరో 14 ఔషధాలను జత చేశారు. డిస్పెన్సరీ నుంచి పంపిన ఇండెంట్‌లోని ఖాళీ స్థలాన్ని ఇందుకు వినియోగించారు. ఇలాంటి లీలలెన్నో వెలుగు చూస్తున్నాయి. తర్వాత కొత్తగా చేర్చిన ఔషధాల్ని డిస్పెన్సరీకి పంపించకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. కొన్ని సందర్భాల్లో ఇండెంట్లలోని మొత్తం ఔషధాల్ని పక్కదారి పట్టించేశారు. ఇలా ఔషధాలను దారి మళ్లించడంలో ఒక ఐఎంఎస్‌ ఉద్యోగి, మరో ప్రైవేటు వ్యక్తి కీలకంగా వ్యవహరించారు.

అంతా ఆమె కనుసన్నల్లోనే..
బోగస్‌ ఇండెంట్ల వ్యవహారం అంతా సస్పెండైన సంయుక్త సంచాలకురాలి కనుసన్నల్లోనే జరిగినట్లు అనిశా అధికారులు గుర్తించారు. తన కార్యాలయ సిబ్బందితోపాటు పలువురు ఐఎంఎస్‌ ఉద్యోగులకు తప్పుడు ఆదేశాలివ్వడం ద్వారా ఆమే ఈ తతంగాన్ని నడిపించినట్లు గుర్తించారు.

ఔషధాల కొనుగోలు అక్రమాల్లో ఫార్మసిస్టు అప్పీల్‌ కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: ముషీరాబాద్‌ కవాడీగూడ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో ఫార్మసిస్టు ఆరాధనాదేవికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై క్రమశిక్షణా చర్యల ఉత్తర్వులను నిలిపివేయడాన్ని నిరాకరిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఆమె చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఔషధాలు సమకూర్చడంలో అక్రమాలపై విజిలెన్స్‌ విభాగం తనిఖీలు నిర్వహించింది. నివేదిక ఆధారంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఆరాధనాదేవిపై క్రమశిక్షణ చర్యలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె సింగిల్‌ జడ్జిని ఆశ్రయించగా వ్యాజ్యాన్ని కొట్టేస్తూ గత ఆగస్టు 28న న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. తీర్పుపై ఆమె ధర్మాసనానికి అప్పీల్‌ చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులతో ఏకీభవిస్తూ ధర్మాసనం ఆమె అప్పీల్‌ను కొట్టివేసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.