close
డిపోల వద్ద బైఠాయింపులు

ఉద్ధృత రూపం దాల్చుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌ ప్రశాంతం

ఈనాడు, హైదరాబాద్‌, ఖమ్మం: ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలతో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత తీవ్రతరమైంది. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ అంత్యక్రియలు సోమవారం జరిగ్గా.. తాజాగా సోమవారం నగరంలోని హెచ్‌సీయూ డిపో ఎదుట యూసఫ్‌గూడ ఎల్‌.ఎన్‌.నగర్‌లో నివాసముంటున్న బి.సందీప్‌(40) అనే కండక్టర్‌ బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. తోటి కార్మికులు, పోలీసులు ఆయనను అడ్డుకుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతంతో కార్మికులు కలవరానికి గురయ్యారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌ ప్రశాంతంగా జరిగింది. బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలు హైదరాబాద్‌లోని మంత్రుల గృహ సముదాయాన్ని ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌ ముట్టడించేందుకు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సమ్మె నేపథ్యం, ఆర్టీసీ పరిస్థితిపై ఐకాస ప్రతినిధులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు.  ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ పెద్ద సంఖ్యలోనే బస్సులను నడిపింది. అయినా పూర్తి స్థాయిలో బస్సులు లేకపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడుపుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్‌ కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీ కొట్టింది. ఆగ్రహించిన ప్రయాణికులు ఢీ కొట్టిన బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు.

కుటుంబ సభ్యులతో నిరసనలు
ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం వారంతా కుటుంబ సమేతంగా కార్మికులు డిపోల వద్ద బైఠాయించడంతో పాటు రహదారులపై ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డిలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రాజేష్‌ అనే కండక్టర్‌ చెయ్యి విరిగింది. సూర్యాపేటలో నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్రహించిన కార్మికులు పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వాన్ని దింపేవరకు పోరాటం: రేవంత్‌
కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తానని చెప్పి, ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించటం సరికాదని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప్పల్‌ ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాప్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు

ఖమ్మం బంద్‌ సంపూర్ణం..
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల బంద్‌ సంపూర్ణంగా, ప్రశాంతంగా ముగిసింది. పూర్వ ఖమ్మం జిల్లాలో వర్తక, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం 5 గంటలకే ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఖమ్మం రీజియన్‌లోని ఆరు బస్‌డిపోల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు.

 

5,375 బస్సులు నడిచాయి
కార్మికుల సమ్మెతో 5,375 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీ బస్సులు 3,557, అద్దె బస్సులు 1,818 బస్సులు నడిచాయి. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లుగా పని చేసేందుకు 7,114 మంది నమోదు చేసుకున్నారని పేర్కొంది.

రూ.50 లక్షల పరిహారమివ్వాలి: లక్ష్మణ్‌
రాణిగంజ్‌ డిపో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ భౌతికకాయానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. కార్వాన్‌ బాంజావాడిలోని ఆయన నివాస ప్రాంతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సురేందర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.50 లక్షల  పరిహారం, సొంత ఇంటితో పాటు.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని భాజపా రాష్ట్రఅధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. అమర వీరులైన ఆర్టీసీ కార్మికులకు నష్ట పరిహారం చెల్లించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే 50,000 మంది కార్మికుల కుటుంబాలతో 21వ తేదీన ప్రగతిభవన్‌ ముట్టడించడానికి సిద్ధమని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి వీసీఎస్‌.రెడ్డి ప్రకటించారు. ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌ సంతాప సభ సోమవారం ఎంజీబీఎస్‌లో నిర్వహించారు.

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్ద ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. నగరం నుంచి నార్కట్‌పల్లి డిపో బస్సు 35 మంది ప్రయాణికులతో తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్‌లతో సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు బయలుదేరింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్దకు రాగానే ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో లారీని ఢీకొట్టింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, 18 మంది గాయపడ్డారు.

ఓయూ విద్యార్థుల సంఘీభావం
హైదరాబాద్‌లో విపక్షాలు, విద్యార్థి లోకం ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలవారు దీక్ష నిర్వహించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, న్యాయవాది రచనారెడ్డి, ఆర్టీసీ కార్మిక నాయకులు ఎం.థామస్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డికి నివాళి అర్పించిన అనంతరం ర్యాలీగా మంత్రుల కార్యాలయాల ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.