close
50 నగరాలకు భూకంప ముప్పు!

అధిక ప్రమాదమున్న మండలంలో దిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె, ముంబయి
ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈడీఆర్‌ఐ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా విజయవాడ సహా 50 నగరాలు, ఒక జిల్లా అధిక భూకంప ముప్పు కలిగిన మండలాల్లో ఉన్నట్టు అధ్యయనంలో గుర్తించారు. ఈ తీవ్రతను అధిగమించేందుకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎన్‌డీఎంఏ), భారత ప్రభుత్వం సంయుక్తంగా భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక(ఎర్త్‌క్వేక్‌ డిజాస్టర్‌ రిస్క్‌ ఇండెక్స్‌) నివేదికను ప్రచురించాయి. ప్రభావిత ప్రాంతాల్లోని జనసాంద్రత, గృహనిర్మాణం, నగరాల పరిస్థితి ఆధారంగా ప్రయోగాత్మకంగా అధ్యయనం చేపట్టారు. భూకంప తీవ్రత అధికంగా ఉండే 4, 5 అధిక భూకంప మండలాల్లో ప్రయోగాత్మకంగా అధ్యయనం జరిపారు. దీనిలో భాగంగా ప్రతి నగరంలో 400 గృహనిర్మాణాలను ఎంపిక చేశారు. తక్కువ, మధ్యస్థ, అధిక తీవ్ర భూకంపాలు నమోదయ్యే నగరాలను వేర్వేరుగా విభజించి అధ్యయనం చేపట్టారు. ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లోని ఎర్త్‌క్వేక్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఈఆర్‌సీసీ) విభాగ అధిపతి ప్రొఫెసర్‌ ప్రదీప్‌ రామనచర్ల సారథ్యంలో పరిశోధక విద్యార్థులు మూడేళ్లపాటు శ్రమించి నివేదికను రూపొందించారు. దీనిని ఐఐటీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ యంత్రాంగం సమీక్షించినట్లు ప్రదీప్‌ తెలిపారు.

ప్రధాన సమస్య.. నిర్మాణ లోపాలు
అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందాలు 25 నగరాలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. మిగిలిన ప్రాంతాల సమాచారాన్ని అక్కడి అధికార యంత్రాంగం నుంచి సేకరించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ సంభవించిన ప్రకృతి విపత్తుల్లో 56శాతం ప్రమాదకరమైన భూకంపాల వల్ల నష్టపోయినవే. మణిపూర్‌(2016), నేపాల్‌(2015), కశ్మీర్‌(2005), భుజ్‌(2001), ఛమోలి(1990), జబల్‌పూర్‌(1997), లాతూర్‌(1993)లలో భూకంప తీవ్రతకు అధికశాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇలాంటి భూకంపాల్లో 90శాతం ప్రాణనష్టానికి గృహనిర్మాణాల్లోని ప్రధాన లోపాలు కారణాలుగా అధ్యయనంలో గుర్తించారు.

ముప్పున్న నగరాలు..
అధిక భూకంప మండలాల్లోని 50 నగరాల్లో 13 అధిక, 30 మధ్యస్థ, 07 తక్కువ ప్రమాదకర స్థాయుల్లో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆయా నగరాల్లోని పర్యావరణ పరిరక్షణ, నిర్మాణాలు, జనసాంద్రత తదితర పరిస్థితులకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలంటూ నిపుణులు సూచించారు. అధిక భూకంప మండలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు..దిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె, ముంబై, అహ్మదాబాద్‌, సిలిగురి, డార్జిలింగ్‌, చండీగఢ్‌ తదితర నగరాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.