close
తొలుత గైడ్‌.. అనంతరం భర్త

డుఫ్లో పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన అభిజిత్‌
ఉమ్మడిగా పలు అంశాలపై విస్తృత పరిశోధనలు

స్టాక్‌హోం, కోల్‌కతా, న్యూయార్క్‌: భార్య అంటే భర్తలో సగభాగం. తాజా నోబెల్‌ (ఆర్థిక శాస్త్రం) విజేతలు అభిజిత్‌, డుఫ్లోల జంటను చూస్తే ఇది నిజమే అని అనిపిస్తుంది. పుస్తక రచనతో పాటు, పురస్కారం పొందడంలోనూ ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంది. విశేషమేమిటంటే ఇద్దరి మధ్య గురు-శిష్య బంధం కూడా ఉంది. ఎం.ఐ.టి.లో పీహెచ్‌డీ చేసిన డుఫ్లోకు అభిజిత్‌ గైడ్‌గా వ్యవహరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎంతగా విద్యావంతులైతే అంతగా వేతనాలు పెరుగుతాయని మలేసియాను ఉదాహరణగా తీసుకొని ఆమె పరిశోధన చేశారు. దీనికి అభిజిత్‌ మార్గదర్శకం వహించారు. 2015లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి డజన్ల కొద్ది పరిశోధన పత్రాలు వెలువరించారు. అభిజిత్‌ అంతకుముందు ఎం.ఐ.టి.లో సాహిత్య విభాగం లెక్చరర్‌ అరుంధతి తులి బెనర్జీని వివాహమాడారు. అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చారు.

అభిజిత్‌ విద్యాభ్యాసం..

* 1961లో ముంబయిలో జననం
* పాఠశాల విద్య- కోల్‌కతాలోని సౌత్‌ పాయింట్‌ స్కూల్‌
* 12వ తరగతి తరువాత ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీస్టాట్‌ చేయాలని అనుకున్నా ఆ సంస్థ ఇంటికి దూరంగా ఉందన్న ఉద్దేశంతో ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు.
* తొలుత భౌతిక శాస్త్రంలో చేరాలని అనుకున్నా ఆర్థిక శాస్త్రంలో చేరారు.
* 1981లో ఆర్థిక శాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ పొందారు.
* 1983లో దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.
* నాలుగేళ్ల పాటు ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం, ఏడాది పాటు హార్వర్డ్‌లో బోధన
* 1988లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ
* 1993 నుంచి ఎం.ఐ.టి.లో ఆచార్యునిగా కొనసాగుతున్నారు.
* 2015 అనంతర అభివృద్ధి అజెండాపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఏర్పాటు చేసిన ప్రముఖుల సంఘంలో సభ్యునిగా ఎంపిక
* భార్య డుల్ఫోతో కలిసి పుస్తకాల రచన. విశేష ఆదరణ పొందిన ‘పూర్‌ ఎకనామిక్స్‌’ 2011లో ప్రచురణ. త్వరలో విడుదల కానున్న మరో పుస్తకం ‘గుడ్‌ ఎకనామిక్స్‌ ఫర్‌ హార్డ్‌ టైమ్స్‌’

డుఫ్లో... ఒబామా సలహాదారు

డుఫ్లో పారిస్‌లో జన్మించారు. అక్కడి ఎకోలే నోర్మలే సూపరెన్యూర్‌ సంస్థలో ఆర్థిక శాస్త్రం, చరిత్రలో డిగ్రీ చదువుకున్నారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు సలహాదారుగా పనిచేశారు.
* 1999లో ఎం.ఐ.టి.లో పీహెచ్‌డీ
* 2009లో మెక్‌ ఆర్థర్‌ జీనియస్‌ గ్రాంట్‌ ఫెలోషిప్‌
* 2010లో జాన్‌ బేట్స్‌ క్లార్క్‌ మెడల్‌
* 2011లో డేవిడ్‌ కెర్షా అవార్డు
* 2014లో ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌
* 2015లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ ఆస్ట్రియాస్‌ అవార్డు
* 2015లో ఎ.ఎస్‌కే సోషల్‌ సైన్స్‌ అవార్డు
అమెరికన్‌ ఎకనామిక్‌ రివ్యూకు సంపాదకత్వం

తల్లిదండ్రులిద్దరూ ఆర్థిక శాస్త్ర ఆచార్యులే

అభిజిత్‌ తల్లిదండ్రులిద్దరూ ఆర్థిక శాస్త్ర ఆచార్యులే. తల్లి నిర్మలా బెనర్జీ సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఆచార్యులుగా పనిచేశారు. తండ్రి ప్రొఫెసర్‌ దీపక్‌ బెనర్జీ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఆర్థిక విభాగం అధిపతిగా వ్యవహరించారు.

నైపుణ్యరంగ నిపుణుడు మైఖెల్‌ రాబర్ట్‌ కెమెర్‌

కెమెర్‌ విద్యాభ్యాసం అంతా హార్వర్డ్‌, ఎం.ఐ.టీ విశ్వవిద్యాలయాల్లోనే కొనసాగింది. ఎం.ఐ.టి.లో పరిశోధన చేసిన అనంతరం అక్కడ కొంతకాలం పాటు అధ్యాపక వృత్తిలో ఉన్నారు. అనంతరం హార్వర్డ్‌కు మారారు. నైపుణ్యాభివృద్ధి, మానవ వనరులపై కూడా ఆయన పరిశోధనలు చేశారు. నైపుణ్యాభివృద్ధిపై ఆయన రూపొందించిన ‘క్రెమర్స్‌- ఓ రింగ్‌ థియరీ’కి ప్రాధాన్యం లభించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ల వినియోగం పెంపుపై విలువైన సూచనలు చేశారు. సెలవుల్లో డిగ్రీ విద్యార్థులు పాఠశాలల్లో ఉచితంగా పాఠాలు బోధించడాన్ని ప్రోత్సహించడం కోసం హార్వర్డ్‌లో ‘వరల్డ్‌ టెక్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.