close
చర్చల సవ్వడి

సీఎం ఆదేశిస్తే కార్మికులతో చర్చిస్తా: తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే
కేకే మధ్యవర్తిత్వంలో చర్చలకు సిద్దమే: ఆర్టీసీ ఐకాస

రాష్ట్రవ్యాప్తంగా కుటుంబసభ్యులతో కార్మికుల బైఠాయింపు
ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌ ప్రశాంతం

ఆర్టీసీ సమ్మె విషయంలో చర్చల సవ్వడి వినిపించింది. సీఎం ఆదేశిస్తే కార్మికులతో చర్చిస్తానని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రకటించగా, ఆయన మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు తాము సిద్ధమేనని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. సమ్మె ప్రారంభమైన పదిరోజుల్లో అధికార పక్షం నుంచి చర్చల ప్రస్తావన రావడం, కార్మిక నాయకులు సానుకూలంగా స్పందించడం ఇదే తొలిసారి. సమ్మెలో భాగంగా సోమవారం ఆర్టీసీ కార్మికులు కుటుంబసభ్యులతో కలసి అన్ని డిపోల వద్ద బైఠాయించారు. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఇదే రోజు హైదరాబాద్‌ హెచ్‌సీయూ డిపోకు చెందిన కండక్టర్‌ సందీప్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కార్మికులు కలవరానికి గురయ్యారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి బలవన్మరణానికి నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. మరోవైపు ఆర్టీసీని కాపాడేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆర్టీసీ ఐకాస నేతలు సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైని కలిసి వినతి పత్రం ఇచ్చారు.

సీఎం ఆదేశిస్తే కార్మిక నేతలతో చర్చలు
ఆర్టీసీ సమ్మెపై తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే

 సమస్యలపై కేసీఆర్‌తోనూ చర్చిస్తా
సమ్మె విరమించి చర్చలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను వారితో చర్చిస్తానని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘సమ్మె విరమించాలని నేనే కార్మికులకు విజ్ఞప్తి చేశాను. మధ్యవర్తిత్వం వహించాలని వారు కోరినట్లు నాకు తెలియదు. కార్మికుల సమ్మెపైనా ముఖ్యమంత్రితో చర్చిస్తాను’’ అని ఆయన చెప్పారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని కోరుతూ ఆయన మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు.

 

ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం చూపవు: ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం చూపజాలవని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేయడమంటే విధానాన్ని(పాలసీ) మార్చుకోవాలని కోరడమేనని, ఇది ఆర్టీసీ సంఘాలకు సంబంధం లేని విషయమన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఎవరూ శాసించలేరని కేకే పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉందంటూ 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదే అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలే తేల్చిచెప్పారని గుర్తు చేశారు. ఆర్టీసీలో 50శాతం సొంత బస్సులు, 30శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేట్‌ స్టేజీ క్యారేజీలన్న సీఎం ప్రతిపాదనలు ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్నవిగానే చూడాలన్నారు. తాను 2018 శాసనసభ ఎన్నికల తెరాస మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నానని, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదని కేకే పేర్కొన్నారు.

ఆహ్వానిస్తే మేం సిద్ధమే
కేకే మధ్యవర్తిత్వం వహిస్తే అభ్యంతరం లేదు: అశ్వత్థామరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చర్చలకు ఆహ్వానిస్తే అభ్యంతరం లేదు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అంటే మాకు గౌరవం. ఆయన మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమే’ అని ఆర్టీసీ కార్మికుల ఐకాస కన్వీనర్‌ ఇ.అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఐకాస బృందం సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ సమస్యలను గవర్నర్‌ సావధానంగా విని సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేకే ఎంతో కృషి చేశారని, తమ సంఘం కూడా తెలంగాణ ఉద్యమ సమయంలోనే పుట్టిందని గుర్తు చేశారు. ఆర్టీసీ సమస్యలపై అన్ని సంఘాల ప్రతినిధులను సంప్రదించామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐకాస నేత కారెం రవీందర్‌రెడ్డిని కూడా కలిసి సహకారం కోరినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలవటాన్ని తాము తప్పు పట్టటం లేదని చెప్పారు. ఉద్యోగ సంఘాలను త్వరలో మరోదఫా కలవనున్నట్లు అశ్వత్థామరెడ్డి చెప్పారు. మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడటంతోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆర్టీసీ ఐకాస సహాయ కన్వీనర్‌ కె.రాజిరెడ్డి ఆరోపించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.