close
‘ఈడబ్ల్యూఎస్‌’కు పోటీ రెట్టింపు

 జేఈఈ మెయిన్‌ 2020 జనవరి పరీక్షకు ఈ కోటాలో  81,143 దరఖాస్తులు
 2019తో పోలిస్తే 88% అధికం

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ 2020 జనవరి పరీక్షకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో 81,143 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి 2019 జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు 43,035 మంది మాత్రమే దరఖాస్తు చేయగా.. వచ్చే ఏడాది పరీక్షకు ఈ సంఖ్య 88 శాతం పెరగడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించడం.. అవగాహన లోపం కారణంగా చాలా మంది అర్హులు ఆ కోటాలో దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఉన్న సీట్లకు అదనంగా 10 శాతం (సుమారు 1100-1200 సీట్లు) పెంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అర్హులైన వారికి కేటాయిస్తున్న విషయం తెలిసిందే. గత పరీక్షలో జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్‌ స్కోర్‌ 89.75 ఉండగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోటా కటాఫ్‌ 78.21గా ఉంది. దీంతో పలువురు ఆ కోటా అర్హులు ఫలితాల వెల్లడి తర్వాత ఆవేదన చెందారు. కొంచెం అప్రమత్తంగా ఉండి రిజర్వేషన్‌ కోటాలో దరఖాస్తు చేసి ఉంటే ఐఐటీలు లేక ఎన్‌ఐటీల్లో సీటు వచ్చేదని వాపోయారు. ఈ నేపథ్యంలో పెరిగిన అవగాహనతో వచ్చే ఏడాదికి ఈడబ్ల్యూఎస్‌ కోటా దరఖాస్తులు భారీగా పెరిగాయి.

15 వేలు పెరిగిన బాలికల దరఖాస్తులు
సూపర్‌ న్యూమరీ కింద విద్యార్థినులకు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తుండటంతో ఈసారి బాలికల దరఖాస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది రెండు విడతల్లో పరీక్షలకు 12.37 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో బాలికలు 2.75 లక్షల మంది ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య మరో 15 వేలకుపైగా పెరిగింది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బాలికల సంఖ్యను 17 శాతానికి పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 14 శాతానికి చేరింది.
* బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్‌ పేపర్‌-2కు 1.38 లక్షల మంది దరఖాస్తు చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.