close
భవనాల అనుమతుల్లో మరింత పారదర్శకత

 టౌన్‌షిప్‌లపై త్వరలో కొత్త విధానం: మంత్రి కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి మరింత పారదర్శకత తీసుకురానున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న అనుమతుల విధానాన్ని పురపాలక ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేస్తోందన్నారు. క్రెడాయ్‌ తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌, ఇతర స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు గురువారం మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పురపాలక విభాగాల్లో అమలవుతున్న ఈ-ఆఫీసు సాఫ్ట్‌వేర్‌ విధానం ద్వారా అనుమతులు ఏ దశలో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుస్తోందన్నారు. భవన నిర్మాణ రీసైక్లింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యర్థాలను చెరువులు, ఖాళీ స్థలాల్లో వేస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. టౌన్‌షిప్‌ విధానాన్ని ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తోందన్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను బిల్డర్లకు అందిస్తామని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. స్థిరాస్తి రంగంలో దేశంలోనే హైదరాబాద్‌లో వృద్ధి కొనసాగుతోందని చెబుతూ వేలాదిమందికి ఉపాధి ఇచ్చే నిర్మాణ రంగానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. హైదరాబాద్‌ నగరం నలుదిశలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పశ్చిమ హైదరాబాద్‌ ఇప్పటికే కంపెనీలతో నిండిపోయిందని ఇతర ప్రాంతాల్లో కంపెనీలు వచ్చేలా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని వారిని కోరారు. సామాజిక బాధ్యతలో భాగంగా స్థిరాస్తి సంస్థలు జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేయాలని కేటీఆర్‌ సూచించారు.

గడువులోగా బిల్ట్‌ను పునరుద్ధరించాలి
 లేదంటే కొత్త యాజమాన్యం ఎంపిక
 మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక

వరంగల్‌ జిల్లా కమలాపూర్‌లోని బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌ (బిల్ట్‌)ను గడువులోగా పునరుద్ధరించకపోతే దాని రాయితీలు రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. కార్మికుల ప్రయోజనాలు, ఉపాధిపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించబోమని.. ఒప్పందం రద్దు చేసి కొత్త యాజమాన్యానికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. బిల్ట్‌ పునరుద్ధరణపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఈ సంస్థ ముఖ్య నిర్వహణాధికారి (సీవోవో) నేహార్‌ అగర్వాల్‌, సీజీఎం హరిహరన్‌, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘బిల్ట్‌ పునఃప్రారంభానికి ప్రభుత్వం దృఢచిత్తంతో ఉంది. యాజమాన్యం వినతులకు అనుగుణంగా ప్రోత్సాహకాలు కల్పించాం. ఇచ్చిన గడువును సంస్థ ఉల్లంఘించింది. కార్మికుల జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలి.పనులు ప్రారంభించాలి. కార్మికులను భాగస్వాములను చేయాలి.’’ అని కేటీఆర్‌ ఆదేశించారు. తాజా గడువులోగా పనులు పూర్తి చేస్తామని కంపెనీ నుంచి హమీ పత్రాన్ని తీసుకోవాలని, పనులను పర్యవేక్షించాలని జయేశ్‌రంజన్‌కు మంత్రి సూచించారు. వచ్చే ఆగస్టు నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా కార్మికులకు రూ.పదివేల చొప్పున అడ్వాన్స్‌ ఇస్తామని చెప్పారు. గడువులోగా పునరుద్ధరణ పూర్తి చేస్తామని బిల్ట్‌ సీవోవో హమీ ఇచ్చారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.