close
ఆస్తుల రిజిస్ట్రేషన్లలో నిబంధనాల సడలింపు

 వీఎల్‌టీఎన్‌, పీటీఐఎన్‌ తప్పనిసరేం కాదు
 కొత్త మార్గదర్శకాలు విడుదల

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలోని ఖాళీ స్థలాలకు పన్ను గుర్తింపు నంబరు (వీఎల్‌టీఎన్‌), ఇళ్లకు ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు (పీటీఐఎన్‌) ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలనే నిబంధనను రిజిస్ట్రేషన్‌ శాఖ సడలించింది. వీఎల్‌టీఎన్‌, పీటీఐఎన్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలని గత మేలో సబ్‌రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ చర్యతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్లాట్లు, ఇళ్ల మీద పన్ను రాబడి పెరిగింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఇక్కడి వరకు భాగానే ఉన్న కొన్ని సందర్భాల్లో ఈ నిబంధన అర్హులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మున్సిపాలిటీలు మ్యుటేషన్‌ (రికార్డుల్లో పేరు మార్పు)లో చేస్తున్న జాప్యంతోనే సమస్యలొస్తున్నాయి. వాటిని గుర్తించిన రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు నిబంధనలను సడలించారు. ప్రత్యేక పరిస్థితుల్లో వీఎల్‌టీఐ, పీటీఐఎన్‌ లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.

కొత్త మార్గదర్శకాలు..
* ఇంటి పెద్ద చనిపోతే.. వారసుల పేరు మీద రికార్డులు మ్యుటేషన్‌ కాని సందర్భాల్లో వారసులందరూ సబ్‌రిజిస్ట్రార్‌ ముందు హాజరైతే తండ్రి పేరు మీదున్న ఆస్తిని వారిపేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తారు.
* బ్యాంకులో ఆస్తి తాకట్టుపెట్టి తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించకపోవడం, డబ్బులు తీసుకొని ఒప్పందం రాసిచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించకుండా సతాయించడం. ఇలాంటి పరిస్థితుల్లో రికార్డుల్లో ఉన్న వ్యక్తి ప్రమేయం లేకుండానే బ్యాంకులు, బాధితుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తారు.
* ఇల్లు లేదా ప్లాట్‌ కొనుగోలు చేసిన వెంటనే వేరే వాళ్లకి విక్రయించాలన్నా, బ్యాంకు లోన్‌ తీసుకోవాలన్నా రికార్డుల్లో పేరు లేకపోతే రిజిస్ట్రేషన్‌ చేయరు. ఇలా వెంటవెంటనే అమ్ముకునే వారు రెండు నెలల్లో మ్యుటేషన్‌ చేసుకుంటామని హామీఇస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తారు.
* వీలునామా ఆధారంగా మున్సిపాలిటీ రికార్డుల్లో పేర్లు మార్చడం కుదరదు. కానీ వీలునామాను అనుసరించి రిజిస్ట్రేషన్‌ చేస్తారు.
* ప్రాపర్టీ పొజిషన్‌ హోల్డర్‌ల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. 20 ఏళ్లుగా నేను ఈ ఇంట్లోనే ఉంటున్నా.. యాజమాని ఎవరో తెలియదు. నా పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయండంటే ఇకపై చేయరు.
* యాజమానులు/డెవలపర్స్‌ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలి. డెవలపర్స్‌ పేరు రికార్డుల్లో ఉండదు. కానీ యాజమాని/డెవలపర్స్‌ మధ్య ఒప్పందం ఉంటుంది. దానిని అనుసరించి ఇద్దరి పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయాలి.
* వీఎల్‌టీఎన్‌ లేకుండా ఓపెన్‌ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అమ్మకందారు ఇప్పటివరకు వీఎల్‌టీఎన్‌ తీసుకోలేదు. కానీ రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే నేను వీఎల్‌టీఎన్‌ తీసుకుంటానని కొనుగోలుదారు ప్రమాణ పత్రం సమర్పిస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తారు.
* కంటోన్మెంట్‌ పరిధిలో ఆస్తులకు వీఎల్‌టీఎన్‌, పీటీఐఎన్‌ వర్తించదు. సాధారణంగా సరైన ధ్రువపత్రాలతో ఎవరు వచ్చినా, వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.