close
సమ్మె హోరు.. మద్దతు జోరు

ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్ధృతం
 ఆటపాటలతో ఊపునిచ్చిన కళాకారులు
 ఉపాధ్యాయ సంఘాల ద్విచక్ర వాహన ర్యాలీలు
ఈనాడు - హైదరాబాద్‌,న్యూస్‌టుడే యంత్రాంగం

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం (13వరోజు) ధూంధాం, తదితర కార్యక్రమాలతో హోరెత్తించారు. హైదరాబాద్‌లోని అన్ని డిపోలతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇందిరాపార్కు, ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ల వద్ద ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కళాకారులు పాటందుకుంటే.. కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ ఆవరణలో మహిళా కండక్టర్లు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. డ్రైవర్లతో పాటు.. కార్యాలయ సిబ్బంది ఖో-ఖో ఆడారు. ఉపాధ్యాయ ఉమ్మడి సంఘాల జాక్టో, యూఎస్పీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా  ద్విచక్రవాహన ర్యాలీలు చేపట్టారు. ఇందిరాపార్కు వద్ద వామపక్షాలు సామూహిక నిరాహార దీక్షకు దిగాయి. సీపీఐ, సీపీఎంతో పాటు ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు ముఖ్యనేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో బేషరతుగా చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్‌, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య దీక్షలో పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ప్రగతిభవన్‌, ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌ను ముట్టడించేందుకు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు వర్సిటీ దాటి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. హయత్‌నగర్‌ డిపోలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై కార్మికులకు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాలపైనా కేసీఆర్‌కు గౌరవం లేదన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగొస్తారా.. దిగిపోతారా తేల్చుకోవాలని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మహిళా సంఘాల నేతలు, మహిళ కండక్టర్లు, ఉద్యోగినులు సవాలు విసిరారు.

పరిగిలో తాత్కాలిక డ్రైవర్లపై దాడి
వికారాబాద్‌ జిల్లా పరిగిలో ప్రయాణికులతో బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తాత్కాలిక డ్రైవర్లపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీంతో వారంతా బస్టాండు నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు బస్సులు దిగి వెళ్లిపోయారు. కార్మికుల ఆందోళనతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి గోసుకొండ మల్లయ్యకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన బంధువులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో మల్లయ్య రెండుమూడు రోజులుగా దిగాలుగా ఉంటున్నారని తెలిపారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నాలు చేశారు. నిర్మల్‌ బస్‌ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు డిపో గేటు ఎదట బైఠాయించడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. షాద్‌నగర్‌ డిపో ముందు గోపన్న బృందం ధూంధాం నిర్వహించింది. వందలాది మంది కార్మికులు ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.

25న బహిరంగ సభ
ఓయూ విద్యార్థి సంఘాల ఐకాస ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని విద్యార్థులు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. ఈ నెల 25న ఓయూలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు ఓయూ ఐకాస నేతలు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా 19న తెలంగాణ రాష్ట్ర మోటార్‌ ట్రాన్స్‌పోర్టర్స్‌ ఐకాస ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. శనివారం ఆటోల బంద్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆటోడ్రైవర్ల యూనియన్ల ఐకాస ప్రకటించింది. రాష్ట్రబంద్‌కు ఆంధ్ర పరిరక్షణ సమితి ఒక ప్రకటనలో మద్దతు తెలిపింది.ఒకపక్క ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం నుంచి సమ్మె చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర టాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జేఏసీ ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మంత్రి పువ్వాడ సమీక్ష
సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సర్వీసుల నిర్వహణపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో గురువారం సమీక్షించారు. బస్సుల సంఖ్యను పెంచేందుకు తాత్కాలిక డ్రైవర్లు ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు? ఇంకా ఎంత మంది అవసరం? డ్రైవర్ల గుర్తింపు, ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సోమవారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రస్తుతం తిరుగుతున్న విద్యా సంస్థల బస్సులు వెనక్కు పంపితే చేపట్టాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేశారు. జిల్లా స్థాయిలో అవసరమైతే మరో దఫా డ్రైవర్ల నియామకానికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు.

ఐకాస నాయకులు పంతాలకు పోవద్దు: నిరంజన్‌రెడ్డి
ఈనాడు, ఖమ్మం: పంతాలకు, పట్టింపులకు పోకుండా సమస్య పరిష్కారానికి ఆర్టీసీ ఐకాస నేతలు కృషి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు సమస్య పరిష్కారం కావాలని ఉందని, కానీ కార్మిక నాయకులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, ప్రభుత్వ తీరును ప్రశ్నించాలన్న ధోరణిలో ఉన్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మిక నేతలు ప్రతిపక్షాలతో జతకట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.


సామాన్యులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

రవాణా అధికారులకు గవర్నర్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపై గురువారం రాజ్‌భవన్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై వివిధ రాజకీయపార్టీలు, సంఘాలు, సంస్థల నుంచి తనకు వినతిపత్రాలు వస్తున్నాయని తెలిపారు. సునీల్‌శర్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9,000 బస్సులు నడుస్తున్నాయని, ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నిరోధించడానికి టిమ్స్‌ యంత్రాలను (టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషిన్స్‌) ఉపయోగిస్తున్నామని చెప్పారు. ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.

పోలీసన్నా.. ఇదేందన్నా!

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రగతిభవన్‌ ముట్టడికి వెళుతున్న విద్యార్థులను ఓయూ ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించడంతో వారిని అరెస్టు చేసే ప్రయత్నంలో పోలీసు సిబ్బంది ఓ విద్యార్థి మెడపై వేళ్లతో రక్కుతూ తీసుకెళ్లారు.

- ఈనాడు, హైదరాబాద్‌

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.