close
పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం

ఈ విషయంలో తనయుడికన్నా వైఎస్‌ వెయ్యి రెట్లు నయం
మీడియాపై ఆంక్షల తప్పును ఆయన సరిదిద్దుకున్నారు
ఏపీ ప్రభుత్వ అరాచకాలపై న్యాయ పోరాటానికి సిద్ధం
తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి, గుంటూరు: ఏపీలో అన్ని రంగాల్లో విఫలమైన వైకాపా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించి బ్లాక్‌మెయిల్‌ చేయడం దారుణమని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. మీడియాపై ఆంక్షలు విధించి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ చేసిన తప్పును సరిదిద్దుకున్నారని, ప్రస్తుతం జగన్‌ అహంభావంతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. తనయుడు జగన్‌కంటే అప్పట్లో విజ్ఞత ప్రదర్శించిన రాజశేఖర్‌రెడ్డి వెయ్యి రెట్లు నయమని వ్యాఖ్యానించారు. జీవోను ఉపసంహరించుకున్నప్పుడు తండ్రి అన్న మాటలను జగన్‌ పరిగణనలోకి తీసుకోకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ముఖ్య నాయకులతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు. ఆయా సమావేశాల్లో మాట్లాడుతూ.. ‘మీడియాపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు 938పై కేబినెట్‌ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాజకీయ పక్షాలను ఏకంచేసి జాతీయ స్థాయిలో పోరాడతాం. అందరినీ నియంత్రించాలనుకునే నిర్ణయమే మీ రాజకీయానికి మరణశాసనం అవుతుంది’ అని చంద్రబాబు హెచ్చరించారు.

పత్రికా ప్రతినిధులపై దాడులా?
‘తునిలో ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణను హత్య చేశారు. చీరాలలో జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖలో పత్రికా ప్రతినిధుల సమావేశంలోనే జర్నలిస్టులను హెచ్చరించారు. మీడియా ఆంక్షలపై మంత్రి పేర్ని నాని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? ఇలాంటి రాక్షసులు వస్తారనే రెగ్యులేటరీ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఏబీఎన్‌, టీవీ5లను నిషేధిస్తారా? రెగ్యులేటరీ కమిటీ, ట్రాయ్‌ వచ్చి పరిస్థితిని చక్కదిద్దాలా? రాష్ట్రం మీ సామ్రాజ్యమా? పోలీసు రాజ్యమా? రాక్షస రాజ్యమా? టీవీలు పెట్టుకునే హక్కు లేదా?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘సీఎం డౌన్‌డౌన్‌ అంటే కేసులు పెడతారా? నడిరోడ్డుపై నన్ను ఉరి తీయమన్నప్పుడు, కాల్చి చంపమని అన్నప్పుడు మాట్లాడరా? జగన్‌ తన కేసులో నిందితులను దిల్లీ మొత్తం తిప్పడం విచారణను ప్రభావితం చేయడం కాదా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెదేపా శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ అరాచకాలపై న్యాయపోరాటానికి సిద్ధమైనట్టు తెలిపారు. డీజీ కార్యాలయంలోనే పోలీసు అధికారుల సంఘం నేతలు మీసాలు తిప్పుతారా? అది డీజీపీ కార్యాలయమా? వైకాపా కార్యాలయమా? నాకు నోటీసులు పంపిస్తానని డీజీపీ అంటారా? పంపండి చూస్తా’నని సవాలు చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.