close
బంద్‌కు మద్దతుగా ర్యాలీల హోరు

విపక్షాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సంఘీభావం
కలసి వస్తున్న ప్రజా సంఘాలు
బందోబస్తు పటిష్ఠం చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు అన్ని వర్గాల వారిని విజ్ఞప్తి చేశారు. బంద్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలను నిర్వహించారు. ప్రభుత్వంలో విలీనంతోపాటు మరో 25 సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 14వ రోజుకు చేరుకుంది.

పెరుగుతున్న మద్దతు
ఆర్టీసీ కార్మికులకు వివిధ వర్గాలనుంచి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. రాజకీయపక్షాలు, కార్మిక సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదులు, ఆటో, ప్రైవేటు డ్రైవర్ల సంఘాలు సంఘీభావాన్ని తెలుపుతున్నాయి. కర్ణాటక, ఏపీ రాష్ట్రాల ఆర్టీసీ కార్మికసంఘాల ప్రతినిధులు ఇక్కడి ఐకాస ప్రతినిధులతో సమావేశమై మద్దతు తెలుపుతున్నారు. విధులకు హాజరుకాని కార్మికులు ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగినట్లే(సెల్‌్్ఫ డిస్మిస్‌) అని సీఎం ప్రకటించటాన్ని హైదరాబాద్‌ వచ్చిన సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పద్మనాభన్‌ తప్పుపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు
బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ర్యాలీలు జరిగాయి. ఆర్టీసీ కార్మికులు, సీపీఐ, సీపీఎం, భాజపా, కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఈ ర్యాలీల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన భారీ ద్విచక్రవాహన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి కూకట్‌పల్లి ఆర్టీసీ డిపో వరకూ కార్మికులు నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తమ శ్రేణులతో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపారు. నాంపల్లి క్రిమినల్‌ కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్సులోని బస్‌భవన్‌కు న్యాయవాదులు బైకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు, రంగారెడ్డి కోర్టుల్లోనూ న్యాయవాదులు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. సుందరయ్య కళా నిలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్‌ రాజిరెడ్డితో పాటు పలువుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ నెల 23న నిర్వహించ తలపెట్టిన ధూంధాం గోడపత్రికను విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అచ్చంపేట మండలానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ హైటెన్షన్‌ విద్యుత్తు స్తంభమెక్కారు. పోలీసులు నచ్చజెప్పి అతన్ని కిందకు దింపారు. ఖమ్మం జిల్లా మధిర డిపో వద్ద  జరిగిన ఆందోళనలో సీఎల్పీనేత భట్టి మాట్లాడుతూ.. మొండివైఖరితో వ్యవహరిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. ఖమ్మం డిపో ఎదుట నిర్వహించిన నిరసనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని  మాట్లాడుతూ.. ఆర్టీసీకి సంబంధించిన రూ.80 వేల కోట్ల ఆస్తులను దక్కించుకొనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లిలో ర్యాలీ ముగింపు సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు తెలంగాణ ఉద్యమ తరహాలో మరో భారీఉద్యమానికి భాజపా నాంది పలకబోతోందని తెలిపారు. రాష్ట్ర బంద్‌కు భాజపా శ్రేణుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వ మొండివైఖరి కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదముందనీ, అదే జరిగితే అందుకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెజస అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. బంద్‌ విజయవంతానికి తెలంగాణ ప్రజలంతా కదలి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు.

చర్చలకు పిలిస్తే వెళతాం
రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. చర్చలకు పిలవాలా? వద్దా? అన్నది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. చర్చలకు పిలిచినా సమ్మె యథావిధిగానే సాగుతుంది. బందును విజయవంతం చేస్తాం. న్యాయస్థానం సూచనలను ప్రభుత్వం పాటిస్తుందని భావిస్తున్నాం. సమ్మె ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. మా ఉద్యమం ఒకరిద్దరిది కాదు. ఆర్టీసీని పరిరక్షించుకోవాలన్నదే మా లక్ష్యం. సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరి నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించిన చందంగా ఉంది. సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

ఇ.అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌

భారీగా పోలీసు బందోబస్తు
బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె నేపథ్యంలో ఇప్పటికే బందోబస్తును పటిష్ఠం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. బస్సులు నడపాలా? నిలిపివేయాలా? అన్న అంశంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. సమ్మెకు వ్యతిరేకంగా తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే.

ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర బంద్‌కు ఉద్యోగ సంఘాలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. శనివారం ప్రత్యక్ష ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. రాజకీయ పార్టీల ప్రధాన నాయకులు హైదరాబాద్‌లో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. జిల్లాల్లో ఆర్టీసీ డిపోలు, పట్టణ కూడళ్లలో మానవ హారాలు, నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయా పార్టీల నాయకులు సూచించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు చేపట్టాలని పార్టీలు కోరాయి. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి తరఫున బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు.

భోజన విరామ సమయంలో కలెక్టరేట్ల ఎదుట ప్రదర్శనలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మమత ఉద్యోగులకు సూచించారు. ఉపాధ్యాయులు, పింఛనుదారులు, గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయాల్లో నిరసన తెలపాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్‌ కోరారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి సూచించారు.

బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని సీపీఐ మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ పిలుపునిచ్చారు. ఆయన వరంగల్‌ ‘ఈనాడు’ కార్యాలయానికి శుక్రవారం ఓలేఖను పంపారు.

6,616 బస్సులు నడిపాం: ఆర్టీసీ
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం 6,616 బస్సులు నడిపినట్లు తెలిపింది. అందులో 4,623 బస్సులు ఆర్టీసీవి కాగా, అద్దె బస్సులు 1,983 ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగులు 11,229 మంది విధులకు హాజరయ్యారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, రానున్న రోజులు బస్సుల సంఖ్య మరింత పెంచుతామని పేర్కొంది.

రైట్‌.. రైట్‌ అంటున్న రెవెన్యూ ఉద్యోగులు
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కొత్త విధుల్లో

ఈనాడు, హైదరాబాద్‌: భూ దస్త్రాల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ విధులకు బదులుగా రైట్‌.. రైట్‌.. అంటూ రెవెన్యూ ఉద్యోగులు బస్సులకు దారి చూపుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వం వివిధ శాఖల అధికారులకు బస్సులను నడిపించే బాధ్యత అప్పగించింది. కీలకమైన సిబ్బంది విధుల కేటాయింపు, తాత్కాలిక సిబ్బంది ఎంపికలు, డిపోల నిర్వహణను రెవెన్యూ ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్రంలోని 97 డిపోల్లో సహాయ నోడల్‌ అధికారులుగా తహసీల్దార్లను నియమించింది. ఇతర సహాయ సిబ్బంది విధులను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ సిబ్బంది నిర్వర్తిస్తున్నారు. రాత్రింబవళ్లు రెండు షిఫ్టులుగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటికే మాతృశాఖలో పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న తమకు బస్సుల నిర్వహణ అప్పగించడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.