close
నేడు, రేపు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: శీతాకాలంలోనూ కారుమబ్బులు కమ్ముకొచ్చి కుంభవృష్టిలా వర్షాలు కురిపిస్తున్నాయి. వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాలలో 24 గంటల వ్యవధి(శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటలు)లోనే అత్యధికంగా 19 సెంటీమీటర్ల(సెం.మీ.) వర్షం కురిసింది. ఇది ఈ నెలలో రాష్ట్రంలో ఒకరోజు కురిసిన అత్యధిక వర్షపాతం రికార్డు అని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఆది, సోమవారాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. గత పదేళ్ల అక్టోబరు నెలలో ఒకరోజు కురిసిన అత్యధిక వర్షపాతం రికార్డు నల్గొండలో 2013 అక్టోబరు 26న 19.8 సెం.మీ.గా ఉంది. ఇప్పుడు పరకాలలో రెండో అత్యధిక రికార్డు నమోదైంది.

ఎందుకిలా ...
ప్రస్తుతం తూర్పు, ఈశాన్య, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తేమగాలులు వీస్తున్నాయి. ఇవి తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పరస్పరం కలుస్తున్నందున ఈశాన్య రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. వీటి కారణంగా కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కారుమబ్బులు(క్యూములోనింబస్‌ మేఘాలు) ఏర్పడి కొద్ది గంటల వ్యవధిలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు 360 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అంతకుముందు 24 గంటల వ్యవధిలో 672 ప్రాంతాల్లో కురిశాయి. వీటిలో 41 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం గమనార్హం. అత్యధికంగా పరకాలలో 19, నర్సంపేటలో 15, దుగ్గొండిలో 12.8, కొత్తగూడలో 12, నల్లబెల్లిలో 11, మద్నూరులో 10, పైడిపల్లిలో 10.1, గీసుకొండ, గొర్రెకుంటల్లో 9.5, ఖానాపూర్‌లో 9 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.

రైతు కష్టం.. వర్షార్పణం
నర్సంపేట, నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో మార్కెట్లు, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మార్కెట్‌ యార్డులో, మార్కెట్‌ బైపాస్‌ రోడ్డులో పోసిన మక్కల కుప్పలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు బోరున విలపించారు. గడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ కురవని రీతిలో 15 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు నర్సంపేట తహసీల్దార్‌ విజయభాస్కర్‌ శనివారం తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురవడంతో కోత దశలో ఉన్న వరి ఎక్కడికక్కడ నేల వాలింది. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్నలు, సోయాబీన్‌ తడిసిపోయాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.