close
ఇక నోటు మాటలే

ఓటుకు రూ.1000 పంపిణీ
కీలక ప్రాంతాల్లో రూ.2000
మద్యం బాధ్యతలు స్థానిక నేతలకే
హుజూర్‌నగర్‌.. ఖరీదైన ఉప ఎన్నిక

హుజూర్‌నగర్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: ఉత్కంఠ భరితమైన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో నోట్లు ఓట్ల బాట పట్టాయి. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఇక ‘నోటు’ మాటలు మొదలయ్యాయి. గెలుపే ధ్యేయంగా కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక పోరులో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తుది అస్త్రాలు సంధించాయి. ధనం.. మద్యంతో ఓట్లర్లకు ఎరవేస్తూ పలువురు రంగంలోకి దిగారు. ఎన్నికల సంఘం ముమ్మర నిఘా పెట్టినా.. గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ కానిచ్చేస్తున్నారు. ఓటు చీటీతో పాటు నోటు జత కలిపేశారు. ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి నేపథ్యంలో పార్టీల నేతలు చివరి క్షణం దాకా వేచి చూడకుండా ముందస్తుగా తుది విడత కార్యాచరణను పకడ్బందీగా కానిచ్చేస్తున్నారు. హుజూర్‌నగర్‌ శాసనసభ ఉప ఎన్నిక సోమవారం జరగనుండగా.. శనివారం సాయంత్రం వరకు తెరాస, కాంగ్రెస్‌, భాజపా, తెదేపా సహా వివిధ పార్టీలు ప్రచారంలో పాల్గొన్నాయి. తెరాస.. కాంగ్రెస్‌లు నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.

ధన ప్రభావం అధికం
అధికార తెరాస పార్టీ.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లు ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు ధ్యేయంగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గత ఎన్నికల కంటే ఈసారి హుజూర్‌నగర్‌ ఎన్నికలో డబ్బు ప్రభావం తీవ్రమైంది. ఓటుకు రూ.500- రూ.1000 సాధారణ అంశంగా మారింది. కీలకపోరులో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల ఓట్లను దక్కించుకునేందుకు ఓటుకు 2 వేల రూపాయలను సైతం ఇచ్చేందుకు నేతలు సై అంటుండటం గమనార్హం. మద్యం రవాణా సహా విక్రయాలపై ఎన్నికల సంఘం పూర్తి నిఘా కొనసాగుతుండగా మద్యం వాసనలు లేకుండా ఎన్నికలు జరుగుతున్నట్లు ఉన్నా.. అంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ప్రచారంలో బూత్‌ కమిటీల ద్వారా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన పార్టీలు డబ్బు, మద్యం అంశంలోనూ ప్రణాళికాబద్ధంగా, ముందు చూపుతో వ్యవహరించడం గమనార్హం.

ముందస్తు వ్యూహాల అమలు
ఎన్నికల సాధారణ పరిశీలకులతో పాటు ఎన్నికల వ్యయంపై ప్రత్యేక పరిశీలకుడిగా నియమితులైన రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి బాలకృష్ణన్‌ నేతృత్వంలో ఎన్నికల సంఘం డేగ కళ్లతో పరిశీలిస్తున్నా ఆయా పార్టీలు మాత్రం డబ్బు, మద్యం పంపిణీ వ్యూహాలను సమర్థంగా అమలు చేస్తున్నాయి. నిఘా మరింత పెరుగుతుందనే నేపథ్యంలో ముందస్తుగా డబ్బు, మద్యం చేరాల్సిన చోటుకు చేర్చేశాయి. ఎన్నికల కమిషన్‌, పోలీసులు నిఘా పెరగడంతో మద్యం పంపిణీ బాధ్యతను పార్టీలు స్థానిక నేతలకే అప్పగించాయి.

ఈసీ ప్రత్యేక దృష్టి నేపథ్యంలో మారిన తీరు
ఎన్నికల సంఘం నామినేషన్లు, ప్రచారం నుంచి కూడా ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల వ్యయ పరిమితి రూ.28 లక్షలు కావడంతో దీన్ని దృష్టిలో ఉంచుకుని హంగూ, ఆర్భాటం లేకుండా ఎన్నికల ప్రచారం చేపట్టారు. నేరుగా ఓటర్లను కలుసుకునేందుకే నాయకులు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధాన పార్టీల కీలక నేతలంతా మకాం వేసి రెండు మూడు వారాలుగా తమకు అప్పగించిన గ్రామాల్లో పలుసార్లు ప్రచారం చేపట్టారు.  ప్రచారంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన బూత్‌ కమిటీలు అన్ని అంశాల్లోనూ పార్టీలకు కళ్లు, చెవులుగా ఉంటూ.. ఆయా వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.

భారీగా నగదు.. మద్యం స్వాధీనం
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తొలిసారిగా పోలీసు వాహనాలను జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం చేశారు. ఏడు మండలాల్లో 27 మార్గాల్లో 27 మొబైల్‌ టీం వాహనాలు, 27 స్ట్రైకింగ్‌ ఫోర్సు వాహనాలు, డీఎస్పీలు, స్పెషల్‌ పార్టీ, పోలీసు స్టేషన్‌ల వాహనాలు సహా మొత్తం 102 పోలీసు వాహనాలను జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం చేశారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా అంతటా ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో భారీగా మద్యం, డబ్బు పట్టుకున్నారు. శనివారం వరకూ స్వాధీనం చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి.

నగదు స్వాధీనం: రూ.84,59,500
అక్రమ మద్యం: 16649 లీటర్లు
మద్యం కేసులు: 251
మూసేసిన బెల్ట్‌ షాపులు: 16
డిపాజిట్‌ చేసిన లైసెన్స్డ్‌ఆయుధాలు: 120

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.