close
లిఖిత వాదనల్లోనూ అదే వైఖరి

అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో వివిధ పక్షాల అఫిడవిట్లు

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాద కేసులోని కక్షిదారులు సుప్రీం కోర్టు ఎదుట తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. అందులో ఎవరికి వారు తమ వైఖరిని పునరుద్ఘాటించారు. రాజకీయంగా సున్నితమైన ఈ కేసుపై 40 రోజుల పాటు వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 16న విచారణను ముగించి, తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిర్దిష్టంగా ఏ అంశాలను కోర్టు పరిష్కరించాలనుకుంటున్నారో వాటిని మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమర్పించాలంటూ కక్షిదారులకు ధర్మాసనం నాడు సూచించింది. ఆ మేరకు వారు తమ అభిప్రాయాలను సమర్పించారు. వాటిలోని ముఖ్యాంశాలివీ..

నిర్మోహి అఖాడా
* హిందూ పక్షాలకు అనుకూలంగా తీర్పు వస్తే వివాదాస్పద ప్రాంతంలో నిర్మించే ఆలయంలో కైంకర్యాలు చేసే హక్కు మాకే ఇవ్వాలి.
* ఆలయ ప్రాంగణ నిర్వహణ హక్కులూ మాకే దక్కాలి.
* వివాదాస్పద ప్రాంతానికి వెలుపల మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ భూమిని ముస్లిం పక్షాలకు ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించాలి.
* ఒకవేళ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తే వివాదాస్పద ప్రాంతాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌ లల్లాలకు సమానంగా పంచాల్సి ఉంటుంది. అలాంటి పక్షంలో తమకు దక్కిన వాటా స్థలంలో మసీదును కట్టరాదని ముస్లిం పక్షాలు నిర్ణయిస్తే ఆ భూమిని కూడా దీర్ఘకాల లీజు ప్రాతిపదికన మహా ఆలయాన్ని నిర్మించడం కోసం హిందూ పక్షాలకు ఇచ్చేలా కోర్టు సూచనలు ఇవ్వాలి.

సున్నీ వక్ఫ్‌ బోర్డు
* విచారణలో వినిపించిన మౌఖిక వాదనలకే కట్టుబడి ఉన్నాం. వివాదాస్పద ప్రాంతంలో 1992 డిసెంబర్‌ 6న ధ్వంసం కావడానికి ముందున్న రీతిలో బాబ్రీ మసీదును పునర్‌నిర్మించాలి.

హిందూ మహాసభ
* వివాదాస్పద ప్రాంతంలో నిర్మించే రామాలయం నిర్వహణ బాధ్యతలను చూసుకోవడానికి సుప్రీం కోర్టు ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలి.
* ఈ ట్రస్టు బాధ్యతలను పర్యవేక్షించడానికి ఒక అధికారిని కూడా కోర్టే నియమించాలి.

రామ జన్మభూమి పునరుద్ధరణ సమితి
* వివాదాస్పద ప్రాంతంలో రామాలయాన్ని నిర్మించేందుకు మాత్రమే అనుమతినివ్వాలి.
* ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకోవడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలి.

గోపాల్‌ సింగ్‌ విశారద్‌
* వివాదాస్పద ప్రాంతంలోని ఒకప్పుడున్న ఆలయంలో ఎంతో కాలంగా మా పూర్వీకులే పూజాదికాలు నిర్వహించేవారు. రామ జన్మభూమిలో పూజలు చేసే రాజ్యాంగ హక్కు నాకే ఉంది.
* ఈ కేసులో ఎలాంటి రాజీ ప్రయత్నాలు వద్దు.

రామ్‌ లల్లా విరాజ్‌మాన్‌
* వివాదాస్పద ప్రాంతం మొత్తాన్నీ రామ్‌ లల్లాకే ఇవ్వాలి.
* అందులో నిర్మోహి అఖాడాకు కాని ముస్లిం పక్షాలకు కానీ వాటా ఇవ్వకూడదు.

షియా వక్ఫ్‌ బోర్డు
* వివాదాస్పద ప్రాంతంపై హక్కులు కోరడాన్ని ముస్లిం పక్షాలు మానుకోవాలి. ఆ స్థలాన్ని రామ మందిర నిర్మాణం కోసం హిందువులకు ఇచ్చేయాలి.
* సదరు స్థలానికి నిజమైన యజమానులం మేమే. సున్నీ వక్ఫ్‌ బోర్డు కాదు.
* సున్నీ వక్ఫ్‌బోర్డుకు హైకోర్టు ఇచ్చిన స్థలాన్ని హిందూ పక్షాలకే ఇచ్చేయాలి.

సామరస్యానికి పెద్ద పీట: ముస్లిం కక్షిదారులు
ఒకవేళ అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే మసీదు నిర్మాణాన్ని ఆలస్యం చేయాలని కొందరు ముస్లిం కక్షిదారులు విలేకరుల వద్ద అభిప్రాయపడ్డారు. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా సామరస్యం నెలకొనేలా చూడటమే ముఖ్యమని హాజీ మహబూబ్‌ అనే కక్షిదారు తెలిపారు. తీర్పు ముస్లింలకు అనుకూలంగా వస్తే సదరు స్థలంలో ఇప్పటికప్పుడు మసీదు నిర్మించకుండా, ప్రహరి గోడ కట్టి వదిలేయాలన్నారు. ఈ ప్రతిపాదనపై ఇతర కక్షిదారులతోనూ మాట్లాడతానని చెప్పారు.

- దిల్లీ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.