close
రాష్ట్ర బంద్‌ సంపూర్ణం

పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు
జిల్లాల్లో బస్సులపై రాళ్లదాడి
టైర్ల గాలితీసిన ఆందోళనకారులు
అరెస్టుతో సొమ్మసిల్లిన మహిళా కండక్టర్లు
రణరంగమైన ఉస్మానియా యూనివర్సిటీ
లక్ష్మణ్‌, రమణ, కోదండరాం, వామపక్ష నేతల అరెస్టు
బోసిపోయిన ఆర్టీసీ బస్టాండ్లు
పోలీసు బందోబస్తుతో అక్కడక్కడా కదిలిన బస్సులు
ఉద్యమం ఆపేది లేదన్న అశ్వత్థామరెడ్డి
ఈనాడు యంత్రాంగం

ద్రిక్తతలు, అరెస్టులు, చెదురుమదురు సంఘటనల మధ్య శనివారం తెలంగాణ బంద్‌ సంపూర్ణంగా జరిగింది. డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా 15వ రోజు రాష్ట్ర బంద్‌ను నిర్వహించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, భాజపా, తెదేపా, సీపీఎం, సీపీఐ, తెజసతోపాటు విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్‌డిపోల ఎదుట తెల్లవారుజాము నుంచే కార్మికులు, పార్టీల కార్యకర్తలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దాంతో ఆర్టీసీ బస్టాండ్లు బోసిపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతిపక్ష పార్టీల నేతలు ర్యాలీలు, నిరసనలతో హోరెత్తించారు. ఆందోళన నిర్వహిస్తున్న న్యూడెమోక్రసీ నాయకులను, కార్యకర్తలను వాహనంలోకి ఎక్కించే సమయంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు బొటన వేలు వాహనం తలుపుల మధ్యపడి తెగిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. బంద్‌ విజయవంతం చేసిన ప్రజలకు, కార్మికులకు, నాయకులకు ఆర్టీసీ ఐకాస నేత అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నాయకుల వేళ్లు, తలలు నరికినా ఉద్యమం ఆగదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సమ్మె విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు శనివారం రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.  రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పార్టీల నాయకులను కట్టడిచేసేందుకు యత్నించారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. రోడ్లపైకి వచ్చిన నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.   సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగిన తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అబిడ్స్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, చార్మినార్‌ నుంచి ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్‌ శాసనససభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తదితర నేతలను అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌ పాషాలను ఆ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో  వామపక్ష, ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. నేతలు తమ్మినేని వీరభద్రం, విమల, సంధ్య తదితరులను  అరెస్టు చేశారు. బూర్గుల రామకృష్ణారావు భవనం ముందు విరామ సమయంలో ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. సత్యనారాయణ, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు టైర్లను దహనం చేశారు. పలు జిల్లాల్లో ఆందోళనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. తెలంగాణ బంద్‌ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ సహా తెలంగాణ జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులను మధ్యాహ్నం 2 గంటలకు నిలిపివేసింది. దాదాపు 70కి పైగా బస్సులను ఆపినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఆదాం సాహెబ్‌ తెలిపారు. ఆర్టీసీ ఐకాస కీలక నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, బాబు తదితరులు సమ్మె కార్యాచరణపై నిశితంగా దృష్టిసారించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లోని రీజియన్‌, డిపో స్థాయి ఆర్టీసీ కార్మిక నేతలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు ఇచ్చారు. క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్ల యూనియన్లు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ప్రజలు శనివారం మరిన్ని అవస్థలకు గురయ్యారు.

వేలు తెగి విలపించిన పోటు రంగారావు
బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు బైఠాయించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు నేతృత్వంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఓ వాహనంలో బలవంతంగా ఎక్కించారు. వాహనం తలుపులను పోలీసులు బయటి నుంచి మూసేసే క్రమంలో గట్టిగా వేయడంతో పోటు రంగారావు బొటన వేలు తలుపు సందులో ఇరుక్కుని తెగిపోయింది. కార్యకర్తలు, నాయకులు పోలీసులను ప్రతిఘటించారు. అనంతరం పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.

నినదించిన కార్మికులు, విపక్షాలు
రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. నాగోల్‌ బండ్లగూడ బస్‌ డిపో నుంచి బయటకు వస్తున్న బస్సులను అడ్డుకుని రెండు బస్సుల టైర్లలో గాలితీసేశారు. డీజిల్‌ ట్యాంకు పైపులు కోశారు. ఓ తాత్కాలిక డ్రైవర్‌పై భాజపా కార్యకర్తలు దాడికిదిగారు. ఎల్బీనగర్‌ వద్ద కొందరు ఆందోళనకారులు ఓ బస్సు డీజిల్‌ ట్యాంకు ధ్వంసం చేశారు. కాచిగూడ బస్‌స్టేషన్‌ వద్ద కార్మికుల పిల్లలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నిలోఫర్‌ ఆస్పత్రిలో ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన మిధాని డిపో మహిళా కండక్టర్లను అరెస్టుచేసి కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళా కండక్టర్లు స్పృహతప్పి పడిపోయారు. జలసౌధ ఆవరణలో ఇంజినీర్ల సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఉద్యోగుల ఐకాస నేతలు కారెం రవీందర్‌రెడ్డి, రాజేందర్‌ తదితరులు ఉద్యోగులతో కలిసి వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

పలు జిల్లాల్లో విజయవంతం
* సంగారెడ్డి జిల్లాలో దాదాపు 100కు పైగా పరిశ్రమలను తెరవలేదు. సిద్దిపేట డిపో నుంచి ఓ బస్సు బయటకు వస్తుండగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకుని తాత్కాలిక డ్రైవర్‌పై దాడికి యత్నించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉదయం 4 గంటలకే  ఖమ్మం రీజియన్‌ పరిధిలోని డిపోల ఎదుట ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతలు బైఠాయించారు.
* ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌, భాజపా నేతలను శుక్రవారం రాత్రి నుంచే అరెస్టు చేశారు. మంచిర్యాల డిపో పరిధిలో భాజపా నేతలు రెండు బస్సుల్లో గాలి తీశారు.
* వనపర్తి డిపోలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు బస్సు అద్దాలను పగులగొట్టారు. నారాయణపేటలో గద్వాలకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్లలో గుర్తుతెలియని వ్యక్తులు గాలి తీశారు.
* భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు ఒకటో గనిలో మైసమ్మ గుడి వద్ద కేసీˆఆర్‌ మనసు మారాలని పూజలు నిర్వహించారు. నర్మెట్ట మండలం వెల్దండలో కొందరు తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లపై దాడికి పాల్పడ్డారు.
* గోదావరిఖని, మంథని డిపోల నుంచి పలు బస్సులను పోలీసు పహారా మధ్య నడిపించేందుకు ప్రయత్నించినా ఆందోళనకారులు అడ్డుకున్నారు. కరీంనగర్‌లో సీపీఐ, సీపీఎం నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మధ్యాహ్నం తర్వాత కొన్ని బస్సులను బయటికి తీయగా.. ఆందోళనలతో మళ్లీ డిపోల్లోకి పంపించారు.

 

రెవెన్యూ సంఘాల ప్రత్యక్ష ఆందోళన
బంద్‌కు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ సంఘాలు తహసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. భోజన విరామసమయంలో రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు దీరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, అన్ని గ్రామ రెవిన్యూ అధికారులు, సహాయకుల సంఘాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.

సమ్మెపై మంత్రివర్గంలో చీలిక: రేవంత్‌రెడ్డి
జమ్మిగడ్డ, న్యూస్‌టుడే: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ మంత్రివర్గంలో చీలిక ఏర్పడిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యమ నాయకులు ఎవరూ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడటం లేదని, తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని మంత్రులు మాత్రమే బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రివర్గంలో చీలిక వచ్చిందనడానికి ఇది నిదర్శనమన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.  ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ అహంకారపూరిత మాటలే కారణమని విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులను సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే అధికారం కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు.

దిల్లీలో తెలంగాణ భవన్‌ ముట్టడి
ఈనాడు, దిల్లీ: వేలాది మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశత్వం పనికిరాదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ దుయ్యబట్టారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన బంద్‌కు సంఘీభావంగా సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. సీపీఐ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌జీత్‌కౌర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెల్లించాలన్నారు.

సమ్మెకు ఏపీలో సంఘీభావం
సమ్మెకు ఏపీ ఉద్యోగ సంఘాలు సంఘీభావం తెలిపాయి. విజయవాడలోని స్వరాజ్‌మైదాన్‌లో శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. సమ్మెకు మద్ధతుగా 24న విజయవాడలో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఐకాస కన్వీనర్‌ పలిశెట్టి దామోదరరావు ప్రకటించారు. తెలంగాణకు నిలిచిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు: తెలంగాణ బంద్‌ నేపథ్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిన ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి.

బస్సులపై రాళ్లదాడి

నిజామాబాద్‌ వెళ్తున్న బస్సుపై బోధన్‌ సమీపంలో ఆచన్‌పల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్‌ శివారులో వరంగల్‌ వెళ్తున్న బస్సులపైనా రాళ్లు రువ్వారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం వరకు బస్సులు దాదాపు డిపోలకే పరిమితం అయ్యాయి. వాణిజ్య సంస్థలను మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు. కర్ణాటక జిల్లా చించొలి నుంచి వికారాబాద్‌ జిల్లా తాండూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

నారి... సారథిగా మారి..!

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన ఓ బాలింతతోపాటు చిన్నారి అస్వస్థతకు గురయ్యారు. బంద్‌ కారణంగా బస్సులు, ఆటోలు నడవలేదు. అందుబాటులో ఆటో ఉన్నా నడిపేవారు లేరు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు ఆటో నడపటం వచ్చు. ఆమె ధైర్యం చేసి ఆ బాలింతను, పసిపాపను ఖమ్మం నగరానికి ఆటోలో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. సకాలంలో చికిత్స అందేలా చేసిన ఆమెను పలువురు అభినందించారు.
- ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే

పోలీసు ఔదార్యం!

ధర్నాలు నిర్వహించే వారిపై కొందరు పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ  ఒక మహిళా పోలీసు తన విధులను నిర్వర్తిస్తూనే మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ ఎదుట బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు ఆందోళన చేపట్టారు. వారిని అదుపులోకి తీసుకునే సమయంలో జగన్నాథం అనే ఆర్టీసీ డ్రైవర్‌ ఉద్వేగానికి గురై స్పృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఒక మహిళా పోలీసు ఆయనకు కాసేపు సపర్యలు చేశారు. ఆయన కాస్త కోలుకున్నాక పోలీసులు  ఆసుపత్రికి తరలించారు.
- ఈనాడు, మహబూబ్‌నగర్‌

వేళ్లు తీసేసినా... తలలు నరికినా ఉద్యమం ఆగదు: అశ్వత్థామరెడ్డి

రాంనగర్‌, న్యూస్‌టుడే: ‘ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది. కాలయాపన తగదు. హైకోర్టు సూచనల మేరకు చర్చలకు ఆహ్వానించాలి. కోర్టు ఉత్తర్వులు రాలేదంటూ జాప్యం చేయటం సబబు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం బంద్‌ విజయవంతమైంది. ప్రజలకు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలకు ధన్యవాదాలు’ అని ఆర్టీసీ కార్మిక సంఘాల కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడి ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఐకాస నేతలు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమం తరవాత జరిగిన ఉద్యమాల్లో ఇదే పెద్దది. అన్ని వర్గాలు ఏకం అయ్యాయి. ఉద్యమ నాయకుల వేళ్లు, తలలు నరికినా ఉద్యమం ఆగదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టనన్ని కేసులు, ఆర్టీసీ సమ్మెలో కార్మికులపై పోలీసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్ర బంద్‌ ప్రభుత్వానికి గుణపాఠం. అవసరమైతే గవర్నర్‌ను కలుస్తాం. కార్మికులకు సంఘీభావంగా దిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద, అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఆందోళన జరిగాయి. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ఆదివారం ప్రజల్లోకి వెళ్తా’ అని అశ్వత్థామరెడ్డి చెప్పారు.

నేడు రాజకీయ పార్టీలతో సమావేశం
భవిష్యత్తు కార్యాచరణపై రాజకీయపార్టీలతో ఆదివారం సమావేశం కానున్నట్లు ఐకాస కో-కన్వీనర్‌ కె.రాజిరెడ్డి చెప్పారు. ఆ నేతలతో చర్చించి రానున్న రోజుల్లో అనుసరించాల్సి వ్యూహాన్ని సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఆర్టీసీ కార్మికులు ప్లకార్డులతో అన్ని ప్రధాన కూడళ్లలో ప్రజలకు పువ్వులు ఇచ్చి మద్దతు కోరుతామన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.