close
నిరసన హారం

16వ రోజూ కొనసాగిన సమ్మె
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, మానవ హారాలు, వంటావార్పు
గుండె పోటుతో డ్రైవర్‌ మృతి
బస్సులు ఢీకొని ఇద్దరి దుర్మరణం
నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, యంత్రాంగం: ఆర్టీసీ కార్మికులు పట్టు సడలించకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ ఐకాస శనివారం రాష్ట్ర బంద్‌ నిర్వహించగా, ఆదివారం 16వ రోజుకు చేరుకున్న సమ్మెలో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. డిపోల ఎదుట ధర్నాలు, కొన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలు నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో ఆందోళనతో ఒక డ్రైవరు గుండెపోటుతో మరణించారు. మరో ఇద్దరు ఆర్టీసీ బస్సులు ఢీకొని విగతజీవులయ్యారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ఆర్టీసీ ఐకాస హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమై చర్చించింది. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌, ఎంజీబీఎస్‌లలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ఆర్టీసీ కార్మికులతో కలిసి నగరంలోని పలు చౌరస్తాల్లో, డిపోల ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. హయత్‌నగర్‌ డిపోలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. జేబీఎస్‌లో వందలాది మంది మానవహారం పాటించారు. ఎంజీబీఎస్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆర్టీసీ కార్మికులు.. వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యానగర్‌ కూడలిలో ఆర్టీసీ ఐకాస కోకన్వీనర్‌ కె.రాజిరెడ్డి బస్సులు వెళ్లేవారికి పూలు ఇచ్చి మద్దతు కోరారు. సోమవారం నుంచి విద్యాసంస్థలు పనిచేయనున్న నేపథ్యంలో 2000 బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

* సమ్మెతో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం పరిస్థితి మెరుగైనప్పటికీ ఇబ్బందులు మాత్రం తప్పలేదు.
* తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని దిల్లీతెలంగాణ ప్రజావేదిక డిమాండు చేసింది. ఆదివారం దిల్లీలో ప్రజావేదిక ప్రతినిధులు బోయిన రాంకుమార్‌, గజవెల్లి నర్సింహరాములు మాట్లాడుతూ తన బిడ్డ ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత తండ్రి అయిన సీఎం కేసీఆర్‌పై ఉందన్నారు.

జిల్లాల్లో ఆందోళనలు
* వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట దగ్గర ఆరు బస్సులకు ఆందోళనకారులు గాలి తీసేశారు.
* కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో కార్మికులు భిక్షాటన చేశారు. కాంగ్రెస్‌, ఉపాధ్యాయ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపాయి. వామపక్ష పార్టీలు వివిధ జిల్లాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశాయి.

నిప్పుతో కేసీఆర్‌ చెలగాటం: లక్ష్మణ్‌
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భాజపా హన్మకొండలో ర్యాలీ నిర్వహించింది. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పాల్గొని ప్రసంగించారు. ‘ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడినట్లే. ఈ మాట నేను చెప్పడంలేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ అన్న మాటలివి. అలాంటి కార్మికులతో ప్రస్తుతం ఆయనే చెలగాటమాడుతున్నారు.’ అని అన్నారు.

ముట్టడి విజయవంతానికి కాంగ్రెస్‌ పిలుపు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ప్రగతిభవన్‌ ముట్టడించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం షబ్బీర్‌ తన నివాసంలో మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిలతో సమావేశమై ప్రగతిభవన్‌ ముట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

మందగించిన వ్యాపారాలు
సమ్మె కారణంగా రాష్ట్రంలో వ్యాపారాలు మందగించాయని సుల్తాన్‌ బజార్‌ వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి శిశిభూషణ్‌ అన్నారు. ప్రస్తుతం ఒక్కో రోజు దుకాణాల్లో బోణీ కూడా కావడం లేదని వాపోయారు. తమ రోజువారీ వ్యాపారంలో దాదాపు 70 శాతం దందా పడిపోయిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్ర వ్యాపారి మహ్మద్‌ యాసిన్‌ తెలిపారు.


వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి మృతి

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఒక ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మరణించగా.. మరో రెండుచోట్ల బస్సులు ఢీకొని ఇద్దరు మరణించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్‌ ఖాజామియా(56) కృష్ణా జిల్లా జగ్గయ్యపేట డాంగేనగర్‌లో నివాసముంటున్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో మనస్తాపానికి గురై ఆదివారం గుండెపోటుతో మరణించారు. రెవెన్యూ, ఆర్టీసీ ప్రతినిధులు బాధిత కుటుంబానికి రూ.20 వేలు నగదు అందజేశారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస.. సత్తుపల్లి డిపోలో సంస్మరణ సభ నిర్వహించింది. ఐకాస కన్వీనర్‌, కోకన్వీనర్‌ వై.నాగరాజు, సీహెచ్‌ కృష్ణారెడ్డి జగ్గయ్యపేటలో భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇది ప్రభుత్వ హత్యేనని వారు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొండి వైఖరి వీడాలని జగ్గయ్యపేటలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న మంద కృష్ణమాదిగ అన్నారు.
* నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మానిక్‌బండార్‌ వద్ద 63వ జాతీయ రహదారిపై కోరుట్ల డిపో బస్సు ఆదివారం ఢీకొనడంతో సిందే ధన్‌రాజ్‌(35) మరణించాడు. మృతుడు నిజామాబాద్‌ జిల్లా ధర్మారంలో ఉంటున్న అన్నయ్య సుభాష్‌తో కలిసి రుణం కోసం ముబారక్‌నగర్‌కు బయలుదేరాడు. సుఖ్‌జిత్‌ పరిశ్రమ ప్రాంతంలో రహదారి దాటుతుండగా కోరుట్ల నుంచి నిజామాబాద్‌ వైపు అతివేగంగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. తాత్కాలిక డ్రైవర్‌ నుజామొద్దీన్‌ ఖాజా బస్సును నడుపుతున్నాడు.
* బీరెల్లి-రంగాపూర్‌ నుంచి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పస్రా గ్రామంలోకి రాగానే అదే మార్గంలో వెళుతున్న గుంజ జ్యోతి(35)ని వెనుకనుంచి ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.  డ్రైవర్‌ అరాలయ్య ఏడేళ్లుగా అద్దె బస్సు డ్రైవర్‌గా పనిచేస్తురన్నాడని.. ఇతని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.


కష్టాలకు తలవంచం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జయశంకర్‌ భూపాలపల్లిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నిలువెత్తు గొయ్యిని తవ్వించి అందులో పీకల్లోతు వరకు మట్టిలోకి దిగారు. ఆయన మాట్లాడుతూ సమ్మెపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అరగంట సేపు గోతిలో అలాగే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

-న్యూస్‌టుడే, భూపాలపల్లి

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.