close
కాంగ్రెస్‌ ముట్టడి పోలీసుల కట్టడి

ఎక్కడికక్కడ నాయకుల నిర్బంధం
సినీ ఫక్కీలో బైక్‌పై ప్రగతిభవన్‌ వద్దకు రేవంత్‌
పోలీసులను నెట్టివేశారంటూ ఆయనపై కేసు

ఈనాడు, హైదరాబాద్‌: అడుగడుగునా పోలీసుల కట్టడి... నాయకుల గృహ నిర్బంధాల నడుమ కాంగ్రెస్‌ పార్టీ ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపు ఇవ్వడంతో ప్రగతిభవన్‌ పరిసరాల్లో సోమవారం ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగింది. నిర్బంధాన్ని ఛేదించుకుని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, పీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌ మాదిగ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు ఇందిరా శోభన్‌, పార్టీ నేత విక్రంగౌడ్‌లు ప్రగతిభవన్‌ వద్దకు చేరుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆటోలో వస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మోనప్ప సర్కిల్‌ వద్ద అడ్డుకుని గోషామహల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. నగరవ్యాప్తంగా 314 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బేగంపేట మెట్రోస్టేషన్‌ను సుమారు గంటసేపు మూసివేసి, అక్కడ రైళ్లను ఆపకుండా పంపారు.

నాటకీయ ఫక్కీలో రేవంత్‌ పరుగులు
సోమవారం ఉదయం 11.50 గంటల ప్రాంతంలో రేవంత్‌ వ్యూహత్మకంగా ఇంటి నుంచి బయటికొచ్చారు. అర కిలోమీటరు దూరం పరుగెత్తి బైక్‌పై ప్రగతిభవన్‌ ఆవలవైపునకు చేరుకున్నారు. అక్కడి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో తిప్పి చివరకు కామాటిపురా పోలీసుస్టేషన్‌ వద్ద విడుదల చేశారు.హైదరాబాద్‌లోని కె.జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య సహా కాంగ్రెస్‌ ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నాక, రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి మార్చుకోకుంటే ప్రజలే ప్రగతిభవన్‌ గడీ బద్దలు కొడతారని హెచ్చరించారు.

రేవంత్‌రెడ్డిపై కేసు: ఎంపీ రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌కు చేరుకునే క్రమంలో పోలీసులను నెట్టివేశారని అభియోగం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.