close
బడి ఉంది.. బస్సు లేదు

విద్యార్థులకు సమ్మె పోటు
వాహనాల కోసం ఇక్కట్లు
వేలాడుతూనే పాఠశాలలకు
8,949 బస్సులు నడిపామన్న ఆర్టీసీ
హైదరాబాద్‌లో రోడ్డెక్కినవి 1087
డిపోల వద్ద ఆందోళనల ఉద్ధృతి
తాత్కాలిక డ్రైౖవర్లతో ప్రమాదాలు
గుండెపోటుతో మరో డ్రైవర్‌ మృతి
కాంగ్రెస్‌ ప్రగతిభవన్‌ ముట్టడి ఉద్రిక్తం
నాటకీయంగా వచ్చిన రేవంత్‌..  అరెస్టు- కేసు నమోదు
గవర్నర్‌ను కలిసిన అశ్వత్థామరెడ్డి
17వ రోజూ కొనసాగిన సమ్మె
ఈనాడు - హైదరాబాద్‌

సరా సెలవుల అనంతరం బడిబాట పట్టిన విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు తప్పలేదు. కళాశాలలు, పాఠశాలలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో ఉదయం నుంచే రోడ్లపై విద్యార్థులు బస్సుల కోసం ఇబ్బందులు పడ్డారు. అదనపు బస్సులు నడపాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అంతగా సఫలమవ్వలేదు. 17వ రోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ఉద్ధృతంగా సాగింది. ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైని కలిశారు. తమ డిమాండ్లను ఆమెకు వివరించారు. కాంగ్రెస్‌ తలపెట్టిన ప్రగతిభవన్‌ ముట్టడి పోలీసు నిర్బంధం నడుమ ఉద్రిక్తంగా సాగింది. ముఖ్య నాయకులందరినీ పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కళాశాల, పాఠశాలల విద్యార్థులపై పడింది. దసరా సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో బస్సులలో వెళ్లి చదువుకునే విద్యార్థులకు సరిపడినన్ని వాహనాలు లేక ఇబ్బందులు తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె 17వరోజు సోమవారం ఉద్ధృతంగా కొనసాగింది.జిల్లాల్లోని డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబీకులు ఆందోళనలు చేపట్టారు. తాత్కాలిక బస్సు డ్రైవర్ల కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో ఒక డ్రైవరు గుండెపోటుతో మరణించగా.. కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రాజధాని విద్యార్థుల పడిగాపులు
హైదరాబాద్‌లో విద్యార్థులకు బస్సుల కోసం పడిగాపులు తప్పలేదు. వారికి ఇబ్బందులు కలుగకుండా 2 వేల సిటీ బస్సు సర్వీసులు నడుపుతామని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఆర్టీసీ అధికారులు చెప్పినా.. సోమవారం కేవలం 1087 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. ఉదయం, సాయంత్రం వేళలో విద్యార్థులు బస్సులకు వేలాడుతూ ప్రయాణించారు. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లతో కొన్ని ఆర్టీసీ వాహనాలు తిప్పగలిగారు. వారంతా తిరిగి తమ విధులకు వెళ్లడంతో బస్సులు నడిపేందుకు అధికారులు సోమవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదర్శ పాఠశాలల విద్యార్థులు 48 శాతం మంది పాఠశాలలకు వెళ్లలేకపోయారు. మెదక్‌ జిల్లా జోగిపేట మండలం అస్కన్‌పల్లి మోడల్‌ పాఠశాలలో 456 మందికి 217 మంది విద్యార్థులే హాజరయ్యారు. భూపాలపల్లి జిల్లా గణపురంలో 600 మందికి 250 మంది హాజరయ్యారు. సమ్మెకు మద్దతుగా భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. హైకోర్టు సూచన ప్రకారం ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) నేతలు డిమాండ్‌ చేశారు.

విపక్షాల సంఘీభావం
హైదరాబాద్‌లోని డిపోలతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో కార్మికులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వీరికి విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపారు. ఎంజీబీఎస్‌ వద్ద నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్లు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. అక్కడే వంటావార్పులోనూ పాలుపంచుకున్నారు. జేబీఎస్‌లో వందలాది కార్మికులు.. కుటుంబాలతో కలిసి నిరసన తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ  కేసీఆర్‌ పాలన హిట్లర్‌ పాలనను గుర్తుకు తెస్తోందన్నారు. మిధాని డిపో వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ కార్మికులతో కేసీఆర్‌ మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఖమ్మంలో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. స్థానిక డిపో నుంచి ర్యాలీగా బస్టాండ్‌ వైపు బయలుదేరిన ఐకాస నాయకులకు తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లు నడుపుతున్న బస్సు కనిపించింది. దీంతో కార్మికులు వారిద్దరిపై చేయి చేసుకున్నారు. ఖమ్మంలో కార్మికులు సహపంక్తి భోజనాలు చేశారు. మణుగూరులో ఆర్టీసీ ఐకాస నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు కార్మికులకు మద్దతుగా నిలిచారు.

కుప్పకూలిన తాత్కాలిక డ్రైవర్‌
హైదరాబాద్‌ డిపో-1లో తాత్కాలిక డ్రైవరుగా పనిచేస్తున్న నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గుడిపల్లికి చెందిన యాదయ్య(45) సోమవారం గుండెపోటుతో మరణించాడు. ఆర్టీసీ బస్సును రాయచూర్‌కు నడిపేందుకు ఎంజీబీఎస్‌కు తీసుకెళుతుండగా చాదర్‌ఘాట్‌ సమీపంలో గుండెపోటుతో స్టీరింగ్‌పై కుప్పకూలి చనిపోయాడు. ఆ సమయంలో బస్సులో కండక్టర్‌ మాత్రమే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం


కరీంనగర్‌లోని ఒకటో డిపోలో డ్రైవర్‌ జంపయ్య సోమవారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒకటో డిపో పక్కనే ఉన్న పార్సిల్‌ సర్వీస్‌లో పనిచేసే ఓ వ్యక్తికి తన గుర్తింపుకార్డు, ఫోన్‌ ఇచ్చి తమ కుటుంబీకులకు ఇవ్వమని చెప్పి ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. వెంటనే తోటి ఉద్యోగులు, పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

బస్సు ప్రమాదాలు..
* వరంగల్‌ డిపోకు చెందిన బస్సు ఏటూరునాగారం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా యాదాద్రి జిల్లా భువనగిరిలో పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
* భువనగిరి బైపాస్‌రోడ్డులో తాత్కాలిక డ్రైవర్‌ నడుపుతున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. 24 మంది గాయపడ్డారు.
* మంచిర్యాల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం అర్ధరాత్రి 15 మంది ప్రయాణికులతో మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వస్తూ ప్రమాదానికి గురైంది. ప్రజ్ఞాపూర్‌ రాగానే బస్సు అదుపుతప్పి చౌరస్తాలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం దిమ్మెను ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. తాత్కాలిక డ్రైవర్‌ టి.శంకర్‌ బస్సు దిగి పరారయ్యాడు.

బస్సులు మరిన్ని పెంచండి: మంత్రి అజయ్‌
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మరిన్ని బస్సులు నడపాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం ఆర్టీసీ, రవాణా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రీజియన్‌ వారీగా ఎన్ని మార్గాల్లో ఎన్ని బస్సులు నడుపుతున్నారు, మంగళవారం ఎన్ని సర్వీసులు పెంచుతున్నారనే అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు ఆర్టీసీ ఇన్‌ఛార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా పాల్గొన్నారు.

8,949 బస్సులు నడిచాయి
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 8,949 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ సోమవారం ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీ బస్సులు 6,846, అద్దె బస్సులు 2,103 తిరిగాయని పేర్కొంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.