close
‘పెద్దాసుపత్రికి వెళ్లండి’ అనలేరిక

 స్థానికంగా సాధ్యం కాకపోతేనే పైస్థాయి ఆసుపత్రులకు
 అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల సర్దుబాటు
 వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో నిబంధనలు కఠినతరం
ఈనాడు - హైదరాబాద్‌

ఏ ఆసుపత్రి అయినా స్థాయికి తగ్గట్లుగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆయా ఆసుపత్రుల్లో వైద్యులను నియమించినా సేవలందించకుండా పైస్థాయి ఆసుపత్రికి పంపించే ఉదాసీన వైఖరికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఒకవేళ రోగికి ఆయా ఆసుపత్రుల్లో లభిస్తున్న వాటి కంటే మెరుగైన సేవలు అవసరమని భావిస్తే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ పైస్థాయి ఆసుపత్రికి యథాలాపంగా రోగులను పంపించే ప్రస్తుత విధానానికి అడ్డుకట్ట వేయనుంది. తద్వారా రోగులకు స్థానికంగా మెరుగైన సేవలందడంతో పాటు బోధనాసుపత్రులపైనా అనవసర భారం తగ్గుతుందని భావిస్తోంది. ప్రధానంగా వైద్య విధాన పరిషత్‌(వీవీపీ) పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీలు), ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యసేవల అమలు నిబంధనలను కఠినతరం చేయాలనీ, అవసరాలకు తగ్గట్లుగా ఆసుపత్రుల్లో మానవ వనరులను సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేయడంతో వీవీపీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ రమేశ్‌రెడ్డి కీలక మార్పులపై దృష్టిసారించారు. ప్రభుత్వం సుమారు 1200 కొత్త వైద్యపోస్టులను వీవీపీ ఆసుపత్రులకు మంజూరుచేసి, సుమారు 600 పోస్టులను భర్తీచేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉంది. గతంలో కంటే వైద్యుల సంఖ్య పెరిగినా మాధ్యమిక ఆసుపత్రుల్లో వైద్యసేవలు ఆశించిన రీతిలో లభించడంలేదు. ఎందుకంటే మొత్తంగా వైద్యుల సంఖ్య పెరిగిందే కానీ.. వారిలో అత్యధికులు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పనిచేయడానికే మొగ్గుచూపుతుండడంతో జిల్లా ఆసుపత్రులను యథావిధిగా వైద్యుల కొరత వెంటాడుతోంది. నియమితులైన వైద్యులు సైతం మాధ్యమిక ఆసుపత్రుల కంటే తమ ప్రైవేటు క్లినిక్‌లు, ఆసుపత్రుల్లో సేవలందించటానికే ప్రాధాన్యమిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ వైద్యులు విధులపై అలసత్వం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి.

సత్వరం హేతుబద్ధీకరణ: ఆసుపత్రి స్థాయిని బట్టి తగినంతమంది వైద్యులున్నారా లేదా.. అనే అంశంపై వైద్యఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ఎక్కడ ఎక్కువమంది వైద్యులున్నారో.. అవసరాలకు తగ్గట్లుగా వారిని హేతుబద్ధీకరించనున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో గైనకాలజిస్టులే ముగ్గురు నలుగురు ఉండగా.. ఒక్క అనస్థిటిస్టూ లేరు. ఇలాంటి చోట్ల శస్త్రచికిత్సలు సాధ్యమయ్యే పరిస్థితి ప్రశ్నార్థకమే.. ఆసుపత్రుల్లో ఈ తరహా లోటుపాట్లను ప్రభుత్వం గుర్తించింది. వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని ఇదే తీరున సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రి స్థాయిని బట్టి వారు అక్కడే తప్పక వైద్యసేవలందించేలా ఆదేశాలు జారీచేయనుంది.

మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాలలో 20 పోస్టుల భర్తీకి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్యకళాశాలలో 20 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి మంగళవారం నియామక ప్రకటన వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలనీ.. అదే రోజు ముఖాముఖి, 30 ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని కళాశాల సంచాలకుడు పుట్టా శ్రీనివాస్‌ తెలిపారు. మొత్తంగా ఐదు ఆచార్య, 10 సహ ఆచార్య, 5 సహాయ ఆచార్య పోస్టులున్నాయి. ఆచార్యులకు నెలకు రూ.1.90 లక్షలు, సహఆచార్యులకు రూ.1.50 లక్షలు, సహాయ ఆచార్యులకు రూ.1.25 లక్షల చొప్పున వేతనంగా చెల్లిస్తారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.