close
వాతావరణ మార్పులతో ఆహార భద్రతకు ముప్పు

పలువురు పరిశోధకుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయరంగంపై తీవ్రంగా ఉందని, దీనివల్ల సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పలువురు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. భారత జీవావరణ ఆర్థిక సొసైటీ(ఐఎన్‌ఎస్‌ఈఈ), ఆర్థిక-సామాజిక అధ్యయనాల కేంద్రం(సెస్‌) ఆధ్వర్యంలో ‘వ్యవసాయం, ఆహార భద్రతపై వాతావరణ మార్పుల ప్రభావం’ అంశంపై సెస్‌లో మూడు రోజుల సదస్సును నిర్వహిస్తున్నారు. రెండోరోజైన గురువారం పలువురు పరిశోధకులు తమ పరిశోధక పత్రాలు ప్రవేశపెట్టారు. కరవు, వరదలు, తక్కువ వర్షం, పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు, వర్షానికి వర్షానికి మధ్య తేడా ఎక్కువ రోజులుండటం తదితర కారణాల వల్ల దిగుబడి తగ్గుతుందన్నారు.

కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామాల్లో చేసిన అధ్యయన ఫలితాలను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జి.శ్రీదేవి వెల్లడించారు. వాతావరణ మార్పుల వల్ల సన్న, చిన్నకారు రైతులు ఎక్కువ ఇబ్బందులకు గురైనట్లు తేలిందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు మరింత ఎక్కువ ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. అనేక కుటుంబాలు వలస వెళ్లాయని అన్నారు.

ఒకే అగ్రో క్లైమేట్‌ జోన్‌ ఉన్న జిల్లాలోనూ వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీ తేడాలున్నట్లు గుర్తించామని ముంబై ఐఐటీ పరిశోధకురాలు దీపికాస్వామి వివరించారు. రాష్ట్రానికో, ప్రాంతానికో కాకుండా ప్రతి జిల్లాకు వ్యవసాయ, వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కేరళలో పండించే పొక్కాలి వరి రకం వరదలను తట్టుకొని నిలిచిందని హైదరాబాద్‌లోని కౌన్సిల్‌ పర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొ.సౌమ్యవినయన్‌ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రొ.గోపినాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఉపాధి హామీ పథకం ద్వారా నీటివనరుల అభివృద్ధి, వనరుల కల్పన గురించి ఎన్‌ఐఆర్‌డికి చెందిన నీరజ్‌మిశ్రా, అనురాధ, అనఘమరియా జోష్‌, మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు చెందిన దయాకర్‌ తదితరులు మాట్లాడారు.

భూతాపంతో అభివృద్ధి లక్ష్యాలకు విఘాతం
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: భూతాపంతో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ముప్పు పొంచి ఉందని సదస్సులో ఐపీసీసీ (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌) నిపుణులు అభిప్రాయపడ్డారు. జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ప్రొ.జోయశ్రీరాయ్‌ మాట్లాడుతూ.. పారిశ్రామికీకరణతో భూతాపం 1 డిగ్రీ పెరిగిందన్నారు. రానున్న శతాబ్దంలో 1.5 డిగ్రీలకు పెరిగే అవకాశముందని, దీంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని, వ్యవసాయం, పర్యాటకం, జీవనాధార పరిశ్రమలు, నీటిపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. భూసార పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రొ. జగదీష్‌ కృష్ణస్వామి సూచించారు. భూసార పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. భూతాపంతో సముద్రాల్లో జీవరాశులపై పడే ప్రభావాన్ని ప్రొ.అంజన్‌ప్రభాకర్‌, కృష్ణా అచ్యుతారావు వివరించారు. అంతకుముందు పర్యావరణ ఆర్థికశాస్త్రంలో కృషి చేసినవారికి అందించే బీనాఅగర్వాల్‌ పురస్కారాన్ని బార్సిలోనా ఆర్థికవేత్త ప్రొ.జాన్‌మర్తనీ అలీర్‌కు ప్రదానం చేశారు.   ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్‌ హన్మంతరావుకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.