close
చేరిక లేఖల ఉపసంహరణ

కొందరు కార్మికులు మళ్లీ సమ్మెలోకి
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు

ఈనాడు,హైదరాబాద్‌-న్యూస్‌టుడే, యంత్రాంగం: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల నిరసనలు హోరెత్తాయి. సమ్మె గురువారం 34వ రోజుకు చేరుకుంది. ఐకాస పిలుపు మేరకు ప్రజా సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శన హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. సుందరయ్య కళానిలయం నుంచి ఇందిరాపార్కుకు పలు ప్రజా సంఘాల కార్యకర్తలు, నేతలు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నేతలకు, పోలీసుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. దాదాపు వందమందిని అరెస్టు చేశారు. గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. మరోదఫా చర్చలు నిర్వహించాలని న్యాయస్థానం ఇరువర్గాలకు సూచించింది. గడువులోగా విధుల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన కార్మికుల్లో పలువురు మళ్లీ సమ్మెలో చేరారు. వీరిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 16 మంది కార్మికులు ఉన్నారని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. 6,459 బస్సులు గురువారం నడిపినట్లు ఆర్టీసీ ఓప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి టికెట్లు ఇవ్వని తాత్కాలిక కండక్టర్‌ అబ్దుల్‌అల్లాజీని ప్రయాణికులు అధికారులకు పట్టించారు. మహబూబ్‌నగర్‌ డిపో నుంచి మక్తల్‌ మార్గంలో వెళుతున్న బస్సులో కండక్టర్‌ విధులు నిర్వర్తించారు. అతని వద్ద మొత్తం రూ.6,100 నగదు ఉండగా.. అందులో రూ.2520లకు మాత్రమే టికెట్లు జారీ చేసినట్లు సెక్యూరిటీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

మండలి ఛైర్మన్‌ కాన్వాయ్‌ అడ్డగింత
శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాన్వాయ్‌ని కోదాడలో ఆర్టీసీ కార్మికులు, పార్టీల నాయకులు అడ్డుకున్నారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కార్మికులు వినతిపత్రం అందించారు. అనంతరం ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో గుత్తా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారని, కార్మికులు పట్టు వదిలి ప్రభుత్వంతో కలిసి పోవాలని కోరారు.

* మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సంఘీభావం తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

సీఎం క్షమాపణలు చెప్పాలి: భట్టివిక్రమార్క
శాసనసభలో తప్పుడు నివేదికలు ప్రవేశపెట్టినందుకు ప్రజలకు, హైకోర్టుకు, శాసనసభకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క డిమాండ్‌ చేశారు. సీఎంపైన, రవాణాశాఖ మంత్రిపైనా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కలిసి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాలులో భట్టి మాట్లాడారు. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికల్లో తప్పులున్నాయని, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రజలను, సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌ అప్పుడే చెప్పిందన్నారు. ఇప్పుడు ఆర్టీసీపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఈనెల 9న ఆర్టీసీ ఐకాస చేపట్టనున్న ‘చలో ట్యాంక్‌బండ్‌’లో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఆర్టీసీ విషయంలో హైకోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు సీఎంపైన, అధికారులపైన చీటింగ్‌ కేసు నమోదు చేయాలని షబ్బీర్‌అలీ డిమాండ్‌ చేశారు.

9 నిమిషాలు చర్చిస్తే పరిష్కారమయ్యేవి: అశ్వత్థామరెడ్డి
సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. ఆర్టీసీపై అధికారులతో 9 గంటల సమీక్ష చేశారు గానీ... కేవలం 9 నిమిషాలు కార్మిక సంఘాలతో చర్చిస్తే సమస్యలన్నీ పరిష్కారమయ్యేవని చెప్పారు.

సీఎం ఇప్పటికైనా చర్చలకు పిలవాలని అన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి సమ్మెపై నోరు విప్పాలన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా 9న చలో ట్యాంక్‌బండ్‌ నిర్వహిస్తామన్నారు.

కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి
ఒకప్పుడు ఆర్టీసీ బస్సు సేవలు పొంది ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నవారు, ఎన్నారైలు ఆత్మార్పణ చేసుకున్న కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సభలో అఖిలపక్ష నాయకులు కోరారు. ప్రాణత్యాగాలు చేసుకున్న కార్మికుల విగ్రహాలను డిపోల ఎదుట ఏర్పాటు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని డిమాండు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సమ్మె విషయంలో ఐఏఎస్‌ అధికారులు బోనులో నిలబడటం ప్రభుత్వానికే తలవంపుగా మారిందన్నారు. తెదేపా రాష్ట్రాధ్యక్షుడు రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, ఆర్టీసీ ఐకాస కోకన్వీనర్లు రాజిరెడ్డి, థామస్‌రెడ్డిలు మాట్లాడారు. మృతిచెందిన కార్మికుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించేందుకు కృషి చేస్తామని సభాధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ హామీ ఇచ్చారు.

వ్యానులో కుక్కి..తాళం వేసి

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా గురువారం వామపక్షాల అధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వ్యానులోకి ఎక్కించారు. వ్యానులో నుంచి బయటకు వచ్చేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని వెనక్కి నెట్టి తలుపు మూసి తాళం వేశారిలా.

-ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.