close
ఎల్‌ఆర్‌ఎస్‌ పరిష్కారానికి మరో అవకాశం

పెండింగ్‌ పత్రాలు, డబ్బులు చెల్లించాల్సిన వారికే
డిసెంబరు 31 వరకు గడువు
పురపాలక శాఖ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కారానికి ఈ ఏడాది ఆఖరు వరకు గడువు పొడిగిస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 2016 డిసెంబరు 31లోపు నిబంధనలు అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం ఈ అవకాశం వర్తిస్తుందని పేర్కొంది. దరఖాస్తుతో పాటు పెండింగ్‌ పత్రాలను అందించాల్సిన వారికి, మిగిలిన సొమ్మును చెల్లించాల్సిన వారికి, రెవెన్యూ, నీటి పారుదలశాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు అందజేయాల్సిన వారికి మాత్రం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, కుడా వైస్‌ ఛైర్‌పర్సన్‌, డీటీసీపీ, రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల కమిషనర్లను పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలని గతేడాది అక్టోబర్‌ 31వ తేదీ వరకు గడువు ఇచ్చినా పలు దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని.. ప్రధానంగా హెచ్‌ఎండీఏలో అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులతో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారు పెండింగ్‌ పత్రాలను అందించేందుకు, గతంలో చెల్లించగా మిగిలిన సొమ్మును చెల్లించేందుకు, రెవెన్యూ, నీటిపారుదలశాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు అందజేసేందుకు అవకాశం కల్పించినట్లు అయింది.

ఒకే నంబరుతో మూడు జీవోలు
ఇంతకీ ఎల్‌ఆర్‌ఎస్‌ ఎన్ని పురపాలక సంఘాల పరిధిలో..?

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలక శాఖ ఒకే అంశంపై ఒకే నంబరుతో ఒకే తేదీతో మూడు జీవోలు జారీ చేయడం అధికారుల్లో గందరగోళానికి దారి తీసింది. ఇటీవల పురపాలక శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన 73 పురపాలక సంఘాల్లో అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు అవకాశం కల్పిస్తూ అక్టోబరు 14న జీవో నంబరు 251ని జారీ చేసింది. అదే తేదీతో కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాల్లో 44లో మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ అంటూ అదే నంబరుతో మరో జీవో జారీ చేసింది. అనంతరం జీవో నెంబరు 251తోనే మరో జీవోను జారీ చేయగా ఇందులో 43 కొత్త పురపాలక సంఘాల్లో మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఒకే అంశంపై మూడు వేర్వేరు జీవోలు వెలువడడంతో కొందరు అన్ని కొత్త పురపాలక సంఘాలకు ఇది వర్తిస్తుందని ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతించాలంటూ పురపాలక సంఘాల కమిషనర్లను కోరుతున్నారు. 43 పురపాలక సంఘాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులతో సంబంధం లేదని కమిషనర్లు స్పష్టం చేస్తున్నారు. 73 పురపాలక సంఘాలకు సంబంధించిన జీవో ప్రతులను తీసుకువచ్చి చూపిస్తుండటంతో వారికి నచ్చజెప్పడానికి పురపాలక శాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మొదటి జీవోలో మార్పులు ఉంటే కొత్త నంబరుతో మరో జీవో జారీ చేస్తారు తప్ప ఇలా అదే సంఖ్యతో ఒకే అంశంపై మూడు జీవోలు ఇవ్వడం ఇబ్బందికరమే అని పురపాలకశాఖ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.