close
పల్లెల నుంచి పారిశ్రామికవేత్తలు రావాలి

రాయితీల కోసం కాదు... సత్తాను చాటాలి
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
గిరిజనులకు వరంగా సీఎం పథకం: మంత్రి సత్యవతి రాఠోడ్‌
100మంది ఔత్సాహిక ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణపత్రాల పంపిణీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని పల్లెలు, గిరిజన గూడేలు, తండాల నుంచి పారిశ్రామికవేత్తలు తయారు కావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు అన్నారు. రాయితీల కోసం కాకుండా సత్తా చాటేందుకు ముందుకు రావాలన్నారు. విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తూ కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి పరిశ్రమలు, ఆవిష్కరణల పథకం కింద శిక్షణ పొందిన 100 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు గురువారం ఇండియన్‌ బిజినెస్‌ స్కూలులో సబ్సిడీ, రుణ మంజూరు పత్రాలను కేటీఆర్‌; గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌లు పంపిణీ చేశారు. ‘‘ఇంతమంది యువ పారిశ్రామికవేత్తలను ఒకే చోట చూడడం ఆనందంగా ఉంది. నిబద్ధత, సంకల్పం, కార్యాచరణతో ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని కేసీఆర్‌ తెలంగాణ సాధన ద్వారా నిరూపించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత పురోగమించాలి. చదువు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. తర్వాత మనం ఏం చేయాలో నిర్ణయం తీసుకోకపోతే విజయం సాధించలేం. ప్రపంచంలో ఎక్కడ చూసినా చిన్న పారిశ్రామికవేత్తలే 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. పారిశ్రామిక పార్కులలో గ్రామీణ యువతకు, మహిళలకు, దళితులకు, గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

పారిశ్రామిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం
మహిళల కోసం కొత్తగా చేపట్టిన మూడు పార్కుల్లో యువ గిరిజన పారిశ్రామికవేత్తలకు స్థలం కేటాయిస్తాం. పరిశ్రమల నిర్వహణ కొత్త వారికి కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు నష్టాలు వస్తాయి. అలాంటి వారికోసం పారిశ్రామిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఒకటి, రెండు కిస్తీలను బ్యాంకులకు చెల్లించలేకపోతే ప్రభుత్వం ఆదుకుంటుంది. ఐఎస్‌బీలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో చేపట్టే ప్రతీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వస్తాను. ప్రముఖులను తీసుకొచ్చి ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తా’’ అని కేటీఆర్‌ వెల్లడించారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి మాట్లాడుతూ, ‘‘పరిశ్రమల స్థాపన గిరిజనుల స్వప్నం. సీఎం పథకం వల్లనే ఇప్పుడు అది నిజమైంది. సాధారణ గిరిజన తండాలో పుట్టిన నాకు మంత్రి పదవి ఇచ్చారు. గిరిజన యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. గిరిజన బిడ్డలు ఐఎస్‌బీలో ఈ రోజు సగర్వంగా నిలుచొని మాట్లాడుతున్నారు. ఇప్పటికే 100 మందికి శిక్షణ ఇచ్చాం. మరో 100 మందిని ఎంపిక చేశాం. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయిస్తున్న కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని పారిశ్రామికవేత్తలు రాణించాలి’’ అని ఉద్బోధించారు. సమావేశంలో గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌ దత్‌ ఎక్కా, కమిషనర్‌ డాక్టర్‌ క్రిస్టినా చోంగ్తు, ఎస్‌బిఐ డీజీఎం దేబాశిష్‌ మిశ్రా, ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.