close
తెలుగు జాతి మనుగడకే ముప్పు

ఏపీ ప్రభుత్వ నిర్ణయం అశాస్త్రీయం
సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమంపై గళమెత్తిన భాషావేత్తలు
ఈనాడు - అమరావతి

తెలుగుకు నిలువునా సమాధే... అమృతతుల్యమైన భాష చచ్చిపోతుంది... మన జాతి మనుగడకే ముప్పు... ఇది మనకు మనం చేసుకుంటున్న ద్రోహం... ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తీసుకున్న నిర్ణయంపై భాషావేత్తల ఆవేదన ఇది. వచ్చే ఏడాది నుంచి 1-8 తరగతులకు ఆంగ్లమాధ్యమం తేవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో మనవారు చదువుకుంటున్న పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ఉంటే... భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ విపరీత పోకడలు ఏమిటని భాషాభిమానులు, భాషావేత్తలు, విద్యావేత్తలు, రచయితలు నిరసిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో తెలుగు సంతతికి చెందిన పిల్లలకు... అక్కడి ప్రభుత్వాలే పూనుకుని మనభాషను బోధిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం తెలుగు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే, రాష్ట్ర అధికార భాషా సంఘం ఏం చేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇది జాతి ద్రోహం
ఆంగ్లమాధ్యమంపై ప్రభుత్వ నిర్ణయం తెలుగు జాతికి ద్రోహం. తెలుగులో చదువు చెప్పేందుకు, తెలుగులో పరిపాలించేందుకే కదా... ఆంధ్రప్రదేశ్‌ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి... కొన్ని అక్షరాలు, పాటలు, పద్యాలు నేర్పిస్తామంటే భాష బతకదు. మహాత్మాగాంధీకి ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉన్నప్పటికీ... ఆత్మకథను మాతృభాషలోనే రాశారు. 
- డాక్టర్‌ సామల రమేష్‌బాబు, తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షులు
సమాజం నిర్వీర్యమవుతుంది
ప్రభుత్వంతీసుకున్న నిర్ణయం సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఆంగ్లాన్ని ఒక భాషగా మాత్రమే నేర్చుకోవడంలో తప్పులేదు. మొత్తం బోధనే ఆంగ్లమాధ్యమంలో చేస్తామనడం సరికాదు. తెలుగువారికి ఇది అంతులేని అవమానాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనను కలిగించే పరిణామం. ప్రపంచ స్థాయి భాషగా ఉన్న తెలుగును విద్యా మాధ్యమంగా వాడుక నుంచి తొలగించడం అంటే ప్రజాస్వామ్య విధానాల్ని పట్టించుకోనట్టే. 
- ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, భాషాశాస్త్ర శాఖ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
చివరకు ఏ భాషా రాదు 
ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు సమాధి అవుతుంది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నవారు... చివరకు ఏ భాషా రాకుండా తయారవుతారు. ఒక భాష వికసించాలంటే శాస్త్రాలన్నింటినీ అందులోనే రాయాలి. ఆంగ్లం చదవకపోతే ఉద్యోగాలు రావనేది విద్యావ్యాపారాలు చేసేవారి తప్పుడు ప్రచారం. మాతృభాషలో విద్యాబోధన లేకపోతే 40 ఏళ్లలో అది అంతరించడం తథ్యమని అధ్యయనాలు చెబుతున్నాయి. 
- ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి, విశ్రాంత ఆచార్యులు, ద్రవిడ విశ్వవిద్యాలయం
మాతృభాషతోనే మేధోవికాసం
ప్రభుత్వ నిర్ణయం దారుణం. మాతృభాషలో బోధన వల్లే పిల్లల్లో మేధో వికాసం సాధ్యం. సొంత ఆలోచనల్ని ఇతర భాషలో చెప్పగల పరిణతి ఆ వయసులో వారికి ఉండదు. పాఠశాల విద్య తర్వాత ఆంగ్లమాధ్యమంలో బోధించవచ్చు. అదీ నిర్బంధం కాకూడదు. ప్రస్తుత ఉపాధ్యాయులు ఆంగ్లంలో ఏం బోధించగలరు? వారిని మళ్లీ కాన్వెంట్లలో చేర్పించి ఆంగ్లాన్ని నేర్పించాల్సి వస్తుంది. 
- అట్టాడ అప్పల్నాయుడు, ప్రముఖ రచయిత, ఉత్తరాంధ్ర రచయితల వేదిక అధ్యక్షుడు 
12 దేశాల్లో తెలుగు బోధిస్తున్నారు
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువర్గం ద్వారా విన్న భాషలోనే విద్యాభ్యాసం సులువు. అప్పుడే పిల్లలు భావవ్యక్తీకరణలోనూ, రాయడంలోనూ రాణిస్తారు. ఇతర రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో తెలుగు బోధిస్తున్నారు. దిల్లీలో దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ నెలకొల్పిన ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీ ఐదు క్యాంపస్‌ల్లో తెలుగు నేర్పిస్తున్నారు. ఒక క్యాంపస్‌లో పూర్తిగా తెలుగు మాధ్యమంలోనే బోధన సాగుతోంది.  ఇక్కడ తీసేస్తే ఎలా? 
- ప్రొఫెసర్‌ మునిరత్నంనాయుడు, డైరెక్టర్‌, మైసూరు ప్రాచీన భాషా పరిశోధన కేంద్రం
మాతృభాషను చంపడమే
ఆంగ్ల మాధ్యమంలో బోధన అంటే మాతృభాషను చంపడమే. ఇది ప్రాదేశిక సంస్కృతిని నాశనం చేయడమే. మన దగ్గర విదేశాలకు వెళ్లేవారు తక్కువ. తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యమివ్వాలి. 
- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

 


 
 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.