close
వీసీల పదవీ కాలం ఐదేళ్లుండాలి

విదేశాల్లోనూ వర్సిటీల ప్రాంగణాలు
సిఫార్సు చేయనున్న ఆచార్య సిద్ధికీ కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ఐదేళ్లు ఉండాలి’.. ఆచార్య సులేమాన్‌ సిద్ధికీ త్వరలో ప్రభుత్వానికి త్వరలో సమర్పించనున్న నివేదికలో మరో కీలక సిఫార్సు ఇదీ. విశ్వవిద్యాలయాల చట్టాల పునఃసమీక్ష కోసం ఓయూ మాజీ ఉపకులపతి ఆచార్య సులేమాన్‌ సిద్ధికీ ఛైర్మన్‌గా ఏడాది క్రితం ఈ కమిటీ ఏర్పాటుచేశారు. ఓయూ న్యాయవిభాగం ఆచార్యుడు జీవీ రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి, ఆచార్య రాంప్రసాద్‌, నిరంజన్‌చారి సభ్యులుగా ఉన్నారు. పలుమార్లు భేటీ అయిన కమిటీ ఈనెల 14 తర్వాత చివరిసారిగా సమావేశం కానుంది. మరో వారం రోజుల్లోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. విద్యాశాఖ పరిధిలోని 11 వర్సిటీలకు నాలుగురకాల చట్టాలను వర్తింపజేయడంతోపాటు పలు కీలక సిఫార్సులను ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలకు 1991 నాటి చట్టాలున్నాయి. నాటి నుంచి సమాజంలో ఎంతో మార్పు వచ్చిన నేపథ్యంలో వచ్చే కొద్ది దశాబ్దాల్లో వర్సిటీల పాత్రను అంచనా వేసి చట్టాల్లో మార్పులు చేస్తున్నారు.

ఇవీ కీలక సిఫార్సులు..
* ప్రస్తుతం ఉపకులపతుల పదవీకాలం మూడేళ్లు. అదే వర్సిటీకి చెందిన వారు కాకుండా మరో విశ్వవిద్యాలయం ఆచార్యులు వీసీగా నియమితులైతే ఆ విద్యాసంస్థ గురించి పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకునేందుకు ఏడాది పడుతుంది. చివరి ఆరునెలలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అంటే ఉపకులపతులు ప్రధానంగా ఏడాదిన్నరపాటే పరిపాలనపై దృష్టిపెట్టేది. మూడేళ్ల వల్ల ఆచార్యుల ఖాళీల భర్తీని పూర్తి చేయలేకపోతున్నారు. ఈక్రమంలో పదవీకాలాన్ని ఐదేళ్లకు పెంచాలి. ప్రస్తుతం కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు తదితర వాటికి సంచాలకుల పదవీకాలం ఐదేళ్లు ఉంది. రాష్ట్ర వర్సిటీలకూ అదేవిధంగా చేస్తే బాగుంటుంది. ఉపకులపతులు వారనుకున్న విధంగా వర్సిటీని గాడిలో పెట్టేందుకు వీలవుతుంది.

* ఉన్నతవిద్య కోసం వేలాది మంది రాష్ట్ర విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. గల్ఫ్‌దేశాల్లో ఎంతోమంది రాష్ట్రవాసులు, భారతీయులు ఉన్నారు. వారి పిల్లతోపాటు ఆ దేశీయులకూ ఉన్నతవిద్య అందించేందుకు మన వర్సిటీల ఆఫ్‌షోర్‌ ప్రాంగణాలను అక్కడ ఏర్పాటుచేయాలి. 75ఏళ్లు దాటిన వర్సిటీలకు ఆ అవకాశమివ్వాలి. అందుకు విశ్వవిద్యాలయాల పరిధికి సంబంధించిన అంశంలో మార్పు చేయాలి. గల్ఫ్‌దేశాల్లో ఓయూకు ఉన్న పేరు వల్ల కోర్సులకు డిమాండ్‌ ఉంటుంది.

* ప్రస్తుతం ఆన్‌లైన్‌ కోర్సులకు డిమాండ్‌ ఉన్న నేపథ్యలో ఆన్‌లైన్‌ కోర్సులు, పరీక్షలు ప్రవేశపెట్టాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.