close
నా పెళ్లిళ్ల వల్లే జగన్‌ జైలుకెళ్లారా?

కావాలంటే మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి
టెన్‌ థౌజండ్‌ వాలా అంటించేసుకుంటున్నారు
వెంకయ్యనాయుడు, రామోజీరావు వంటి పెద్దలపైనా కోపతాపాలా?
ఏపీ సీఎంపై పవన్‌కల్యాణ్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘‘నేను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే జగన్‌రెడ్డి రెండేళ్లు జైల్లో కూర్చున్నారా? నేను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే సూట్‌కేసు కంపెనీలు పెట్టి విజయసాయిరెడ్డి, జగన్‌ జైలుకు వెళ్లారా?’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రతిసారీ మూడు పెళ్లిళ్లంటూ మాట్లాడుతున్నారని, సమస్యను పక్కదోవ పట్టించేందుకే ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను సరదాకు పెళ్లిళ్లు చేసుకోలేదన్నారు. ‘కావాలంటే మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆంగ్లమాధ్యమం గురించి ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడినపుడు పవన్‌కు ముగ్గురు భార్యలు, నలుగురో ఐదుగురో పిల్లలున్నారని, వాళ్లంతా ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని అన్నారు. దానిపైనే పవన్‌ మంగళవారం స్పందించారు. జగన్‌తో ఉన్న 150 మంది ఎమ్మెల్యేలు ఆయన్ను చూసుకుని చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, ఒక్కసారి జగన్‌రెడ్డి పరిస్థితి అటూ, ఇటూ అయితే వారి సంగతేంటో గుర్తుంచుకోవాలని పవన్‌ హెచ్చరించారు. ఎడాపెడా మాట్లాడితే భరించడానికి ఇది తెదేపా కాదని, జనసేన పార్టీ అని పేర్కొంటూ.. దారుణంగా స్పందిస్తామని హెచ్చరించారు. జగన్‌రెడ్డి సంగతి చూస్తోంటే టెన్‌ థౌంజడ్‌ వాలా తనకూ, తనతో పాటు ఉన్న 150 మంది ఎమ్మెల్యేల మెడకూ చుట్టేసి అంటించేసుకుంటున్నట్లు కనిపిస్తోందని, మొత్తం కాలిపోతారు జాగ్రత్త అని పవన్‌ హెచ్చరించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో పెద్దలు సూచనలు చేస్తుంటే విమర్శలు చేయడం ఏమిటని ముఖ్యమంత్రిని పవన్‌ ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి లాంటివారు సలహాలిస్తే ఆయనపై అలా మాట్లాడేయడమేనా అని పవన్‌ ప్రశ్నించారు. ‘రామోజీరావు వంటివారిపైనా మాట్లాడేయడమేనా? జర్నలిజంలో ఆయన స్కూలునుంచే ఎందరో తయారయ్యారు’ అని పవన్‌ అన్నారు. హిందీని జాతీయభాషగా చేస్తామని దేశంలోనే ఉన్న ఇద్దరు బలమైన వ్యక్తుల్లో ఒకరు మాట్లాడితే క్షేత్రస్థాయి స్పందన అందుకు వ్యతిరేకంగా వచ్చిందని, జాతీయస్థాయిలో ఎంతో బలమైన నాయకుడే తమ ఉద్దేశం అది కాదంటూ వెనక్కు తగ్గితే, జగన్‌ ఇలా వ్యవహరించడం ఏమిటని పవన్‌ ప్రశ్నించారు. ప్రధాని కూడా తమిళాన్ని గౌరవిస్తున్నామని చెప్పారన్నారు. రేనాడు ప్రాంతంలో తొలి తెలుగు శాసనం లభించిన ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.