close
కార్మికుల నిరాహార దీక్షలు

పౌర్ణమి దీపాలతో నిరసన
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్షా శిబిరాలను నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావటంతో మహిళా కండక్టర్లు డిపోల వద్ద దీపాలను వెలిగించి నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారానికి 38వ రోజుకు చేరుకుంది. ఖమ్మంలో కార్మికులు గంగిరెద్దుల ప్రదర్శన నిర్వహించారు. పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు చెందిన గాలి అనిల్‌కుమార్‌ సుమారు 100 మంది కార్మికులకు బియ్యం, పప్పు తదితర నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేశారు. సమ్మెపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో జరుగుతున్న కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైకోర్టు ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాల ఐకాస ప్రకటించింది. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉండాలని ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ నియామకం చేపడతామని, ప్రభుత్వం తన అభిప్రాయం తెలపాలని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆర్టీసీ ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సమీక్షించారు. తాత్కాలిక సిబ్బందితో మంగళవారం 6,557 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది.

* సీఎం కేసీఆర్‌ అసమర్థ పాలన కారణంగా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై కోర్టు మాటలను వినకుండా న్యాయవ్యవస్థను ముఖ్యమంత్రి అవమానిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగులు, రైతు సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు.

* ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా చూడాలని కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డిని.. తెజస అధ్యక్షుడు కోదండరాం కోరారు. కార్మికులకు న్యాయం జరిగేందుకు తన వంతుగా ఏప్రయత్నమైనా చేస్తానని.. ఎవరినైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఈ విషయంలో కేంద్రమంత్రిగా మీ సహకారం కావాలని విన్నవించినట్లు తెలిసింది.

* ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ నెల 17న సబ్బండ వర్గాల దీక్ష చేపడతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఈమేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, అగవర్ణ పేదల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీ ఐకాస 18న పిలుపునిచ్చిన సడక్‌ బంద్‌లో పాల్గొనాలన్నారు. 20న వేదిక తరఫున గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పారు. 30న 20 లక్షల మందితో నగర దిగ్బంధం చేపడతామన్నారు.

మమ్మల్ని అనాథలు కానీయొద్దు!


‘మా నాన్నకు మూణ్నెల్ల నుంచి జీతం లేదు. సమ్మెపై సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వేదనతో కొందరు చనిపోతున్నారు. మేం అనాథలం అవుతామేమోనని భయంగా ఉంది. ప్రశాంతంగా చదువుకుందామంటే ఆటంకాలు ఎదురవుతున్నాయి.’’ అని ఆర్టీసీ కార్మికుల పిల్లలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు మొర పెట్టుకున్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం ప్రకటించేందుకు లక్ష్మణ్‌ మంగళవారం ఇక్కడకు వచ్చారు. తాము స్కూళ్లలో రుసుములు చెల్లించలేకపోతున్నామని ఆ పిల్లలు వివరిస్తూ ఆయనకు వినతిపత్రం అందించారు. ఇందుకు తన వంతు కృషి చేస్తానని పిల్లలకు లక్ష్మణ్‌ హామీ ఇచ్చారు.

-న్యూస్‌టుడే, గజ్వేల్‌

కొబ్బరి కాయలు అమ్మితేనే కడుపు నిండేది

ఈ చిత్రంలో కొబ్బరికాయలు అమ్ముతున్న వ్యక్తి పేరు తక్కలపల్లి ధర్మేందర్‌. ఈయన స్వగ్రామం ఆరుట్ల. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపోలో కండక్టర్‌. మంగళవారం ప్రారంభమైన రామలింగేశ్వరస్వామి జాతర పరిసరాల్లో కొబ్బరికాయలు విక్రయిస్తూ కనిపించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా కుటుంబ పోషణ భారం కావడంతో ఈ వ్యాపారం చేస్తున్నానని ధర్మేందర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

-న్యూస్‌టుడే, మంచాల

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.