close
‘సింగపూర్‌’ వెళ్లిపోయింది

అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సింగపూర్‌, ఏపీ ప్రభుత్వాలు
పరస్పర అంగీకారంతో నిర్ణయం
ఖర్చులు పోనూ ఎవరి డబ్బులు వారు తీసుకోనున్న ఎస్‌ఏఐహెచ్‌, ఏడీసీ
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో అంకురప్రాంత (స్టార్టప్‌ ఏరియా) అభివృద్ధి ప్రాజెక్టు కథ ముగిసింది. పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్టు సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. అమరావతి అభివృద్ధికి ఒక చుక్కానిలా, చోదక శక్తిగా పని చేస్తుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం అంకురప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టింది. రాజధానిలో సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ)గా ఎంపిక చేసిన ప్రాంతంలో 1,691 ఎకరాల్లో అంకురప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియంను స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ప్రధాన అభివృద్ధిదారు (మాస్టర్‌ డెవలపర్‌)గా ఎంపిక చేసింది. 2017 మేలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన ప్రాథమిక కసరత్తు, ఒప్పందాలు, ప్రత్యేక కంపెనీ ఏర్పాటు వంటి ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగింది. ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలంలో కొంత నేలను చదును చేయడం తప్ప, మరే పురోగతి లేదు. చివరకు ప్రాజెక్టే రద్దయింది.

ప్రాజెక్టు ఉద్దేశం, లక్ష్యాలు ఇవీ..
* అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల్ని వేగవంతం చేయడం. అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య, నివాస, వినోద పర్యాటక వసతుల అభివృద్ధి.
* ఐటీ, ఐటీఈఎస్‌, బ్యాకింగ్‌, ఆర్థిక సంస్థలు, హోటళ్లు, మాల్స్‌, వాణిజ్య, గృహనిర్మాణం పెద్దఎత్తున చేపట్టడం.
* 1.25 లక్షల కుటుంబాలు తరలి వచ్చేలా చేయడం.
* 2.50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చేలా చేయడం. ఈ ప్రాంతం నుంచి జీఎస్‌డీపీకి రూ.1.15 లక్షల కోట్లు వచ్చేలా చూడటం.
* ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు సమకూరేలా చేయడం.

ఏడీపీ పేరుతో ప్రత్యేక కంపెనీ
సింగపూర్‌ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలసి సంయుక్తంగా ప్రాజెక్టుని అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన. సింగపూర్‌ కన్సార్షియం.. సింగపూర్‌-అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ (ఎస్‌ఏఐహెచ్‌) పేరుతో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.
* ఎస్‌ఏఐహెచ్‌, ఏడీసీ కలసి అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) పేరుతో ఒక సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి.
* ఏడీపీలో ఏడీసీకి 42 శాతం, ఎస్‌ఏఐహెచ్‌కి 58 శాతం వాటా ఉంటాయి. ఆ సంస్థలు రూ.222 కోట్లు, రూ.306 కోట్లు మూలధన పెట్టుబడిగా పెట్టాలి. ఇప్పటి వరకు ఏడీసీ రూ.52.09 కోట్లు, ఎస్‌ఏఐహెచ్‌ రూ.71.93 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. ఆ డబ్బు ఉమ్మడి ఖాతాలో ఉంది. ఇప్పటి వరకు అయిన ఖర్చుల్లో ఏడీసీ వాటా రూ.7.90 కోట్లుగా నిర్ణయించారు. మూలధనంలో తన వాటా నుంచి ఖర్చులు మినహాయించి మిగతా డబ్బుని ఏడీసీ తీసుకుంటుంది. ఎస్‌ఏఐహెచ్‌కి 58% వాటా ఉంది కాబట్టి, ఆ దామాషాలో వారి మూలధనం నుంచి ఖర్చులుమినహాయించి మిగతాడబ్బు తిరిగి చెల్లిస్తారు.

అభివృద్ధి చేయాలనుకున్నది ఇలా..!
* 1691 ఎకరాల్ని మూడు దశల్లో 15 ఏళ్లలో అభివృద్ధి చేయాలి. ఆ తర్వాత మరో ఐదేళ్లలోగా మార్కెటింగ్‌, విక్రయాలు పూర్తి చేయాలి.
* తొలి దశలో 655.77 ఎకరాలు, రెండో దశలో 513.95 ఎకరాలు, మూడో దశలో 521.45 ఎకరాల్ని అభివృద్ధి చేయాలి.
* భూమి యాజమాన్య హక్కులు సీఆర్‌డీఏ దగ్గరే ఉంటాయి. ఏడీపీకి సీఆర్‌డీఏ జీపీఏ ఇస్తుంది. ప్రాజెక్టును ఏడీపీ అభివృద్ధి చేశాక వేరేవారికి విక్రయించేటప్పుడు... నేరుగా సీఆర్‌డీఏనే అగ్రిమెంట్‌ చేస్తుంది.
* తొలిదశలో అభివృద్ధిచేసిన భూమిలో 70% విక్రయాలు పూర్తయ్యాకే రెండో దశ ప్రారంభించాలి.
* మొత్తం 1691 ఎకరాల్లో 50 ఎకరాల్ని ఉత్ప్రేరకాభివృద్ధి (కెటలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌) కోసం ఏడీపీకి నేరుగా విక్రయించాలి. ఈ 50 ఎకరాలకు ఏడీపీ రూ.17.6 కోట్లు సీఆర్‌డీఏకి చెల్లిస్తుంది. దానిలో 8.07 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన భవనాన్ని నిర్మిస్తుంది.
* మరో 200 ఎకరాల్ని ‘అడిషినల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌’తో ఏడీపీకి ఇవ్వాలి. దానికి గాను ప్రాజెక్టు అభివృద్ధి చేసి విక్రయించేటప్పుడు నిర్ణయించిన బేస్‌ ప్రైస్‌లో కొంత మొత్తాన్ని సీఆర్‌డీఏకి ఏడీపీ చెల్లిస్తుంది. అది ఎకరానికి రూ.4 కోట్లకు తగ్గకుండా ఉంటుంది.
* మిగతా భూమికి.... తొలి దశ ప్రాజెక్టులో వచ్చిన మొత్తం ఆదాయం(గ్రాస్‌ రెవెన్యూ)లో 5శాతం, రెండో దశ ప్రాజెక్టులో 7.5 శాతం, మూడో దశ ప్రాజెక్టులో 12 శాతం చొప్పున సీఆర్‌డీఏకి ఏడీపీ చెల్లిస్తుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.