close
మధ్య మానేరుకు జలకళ

ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు
రోజుకు 12,600 క్యూసెక్కుల తరలింపు

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: గోదావరి గలగల సవ్వడి ఇక నిరాటంకంగా సాగనుంది. ఎల్లంపల్లి జలాశయం నుంచి మధ్య మానేరుకు నీరు పరవళ్లు తొక్కనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2లో పూర్తిస్థాయి ఎత్తిపోత ప్రారంభమైంది. లింక్‌-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల జలాశయాల నుంచి ఎల్లంపల్లికి అక్కడి నుంచి మధ్య మానేరుకు నీటిని తరలించడానికి వ్యవస్థ సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు చేరువవ్వడం రైతుల్లో సంతోషాన్ని నింపుతోంది. జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతుండగా... ఆ నీటిని ఆయకట్టుకు తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

అందుబాటులోకి లింక్‌-2 పంపులు
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లింక్‌-2లోని పంపులు పూర్తిస్థాయిలో అందుబాటులోకొచ్చాయి. పెద్దపల్లి జిల్లాలోని నందిమేడారం పంప్‌ హౌస్‌, కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌లలో ఏడేసి పంపులు ఉన్నాయి. ఇవన్నీ సిద్ధమవ్వగా మంగళవారం ఒక్కో పంపుహౌస్‌లో నాలుగింటిని తిప్పి రెండు పుంపుహౌస్‌ల ద్వారా 12,600 క్యూసెక్కులు ఎత్తిపోత ప్రారంభించారు. గత నెల 26వ తేదీ నాటికే ఈ రెండు పంపుహౌస్‌ల్లోని 14 పంపులు సిద్ధమయ్యాయి. ఇంతలో మధ్యమానేరు కట్టకు పగుళ్లు ఏర్పడటం, మరమ్మతులు చేపట్టడంతో ఎత్తిపోతను చేపట్ట లేదు. అప్పటికే జలాశయంలో నిల్వ ఉన్న నీటిలో 12 టీఎంసీలను దిగువ మానేరుకు వదిలారు. 2.20 టీఎంసీలనే నిల్వ చేశారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి ఎత్తిపోత ప్రారంభం కాగా మంగళవారం రాత్రికి మధ్యమానేరులో నీటి నిల్వ 3.10 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు దిగువ మానేరు నుంచి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని ఆయకట్టుకు నీరు వదులుతున్నారు.

మేడిగడ్డ నుంచి మధ్యమానేరు వరకు
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లింక్‌-1లో మేడిగడ్డ వద్ద ఉన్న కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి మొదలు లింక్‌-2లోని గాయత్రి పంపుహౌస్‌ వరకు అన్ని పంపులు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయంలో ఉన్న నీటి నిల్వను మధ్యమానేరుకు తరలించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు. నంది, గాయత్రి పంపుహౌస్‌ల నుంచి రోజుకు గరిష్ఠంగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం నాలుగేసి పంపులను నడిపిస్తున్నామని ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మరో పంపును ప్రారంభిస్తామని ఈఈ నూనె శ్రీధర్‌ తెలిపారు.

దిగువ నుంచి ఎగువకు అవకాశం
మధ్య మానేరు జలాశయాన్ని నింపేందుకు ఎల్లంపల్లి, శ్రీరామసాగర్‌ జలాశయాల నుంచి రెండు మార్గాల్లోనూ అవకాశం ఉంది. అయితే శ్రీరామసాగర్‌ ద్వారా వరద కాలువ నుంచి ఎప్పుడైనా నీటిని నింపుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాలువ ద్వారా పదివేల క్యూసెక్కుల వరకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని గరిష్ఠంగా ఉపయోగించుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల జలాశయాల్లోనూ నీరు అందుబాటులో ఉంది. పంపుహౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసుకుని వినియోగించుకుంటే... భవిష్యత్తులో శ్రీరామసాగర్‌ నీళ్లు రిజర్వ్‌ ఉంచుకుని వినియోగించుకోవాలన్న ఆలోచన అధికారుల్లో ఉంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.