close
పగ్గాలు కేంద్రం చేతికి

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు
సుప్తచేతనావస్థలో శాసనసభ
ఎన్సీపీకిచ్చిన గడువు వరకు వేచి చూడకుండానే కేంద్రానికి గవర్నర్‌ నివేదిక
వెంటనే కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర... రాష్ట్రపతి పచ్చజెండా
గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ చర్యను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన శివసేన

మహారాష్ట్ర రాజకీయాలు మహా మలుపు తిరిగాయి. కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం లేదని పేర్కొంటూ గవర్నర్‌ పంపిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేగంగా చోటుచేసుకున్న పరిణామాలు టి-20 మ్యాచ్‌ తరహాలో ఉత్కంఠ రేకెత్తించాయి.

ఈనాడు, దిల్లీ, ముంబయి: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన మొదలైంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం లేదని పేర్కొంటూ గవర్నర్‌ పంపిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం అక్కడి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచింది. ప్రభుత్వ ఏర్పాటుకోసం రాత్రి 8.30 వరకు ఎన్‌సీపీకి సమయం ఇచ్చిన గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ.. మధ్యాహ్నం 12 గంటలకే కేంద్ర ప్రభుత్వానికి 18 పేజీల నివేదిక పంపించారు. కేంద్ర కేబినెట్‌ సమావేశమై ఆయన నివేదిక ఆధారంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సూచిస్తూ దస్త్రాన్ని రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దానికి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి పాలన ఆరు నెలలపాటు సాగేందుకు రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉంది. శివసేనకు మద్దతిచ్చే అంశంపై నిర్ణయం వెలువరించకుండా సోమవారం తాత్సారం చేసిన కాంగ్రెస్‌పార్టీ.. మంగళవారం మధ్యాహ్నం వరకూ అదే పంథా కొనసాగించింది. ఎన్సీపీకి గవర్నర్‌ ఇచ్చిన సమయం ముగిసిపోయే తరుణంలో సీనియర్‌ నేతలు అహ్మద్‌పటేల్‌, మల్లికార్జున్‌ ఖర్గే, కె.సి.వేణుగోపాల్‌లను దిల్లీ నుంచి పంపింది. వారు ముంబయి చేరుకొనేలోపే రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శివసేన ప్రతిపాదనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్‌, ఎన్సీపీ తెలిపాయి. దీనిపై మరింత చర్చించాల్సి ఉందన్నాయి. దిల్లీ నుంచి వచ్చిన నేతలతో కలిసి శరద్‌పవార్‌ విలేకరులతో మాట్లాడుతూ- ఒకవేళ శివసేనకు మద్దతు ఇవ్వాల్సి వస్తే దాని విధివిధానాలపై కాంగ్రెస్‌-ఎన్సీపీ చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తాయని చెప్పారు.

గత్యంతరంలేకే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు: హోంశాఖ
‘‘ప్రభుత్వ ఏర్పాటుకు 15 రోజులుగా అన్ని ప్రయత్నాలు జరిగాయి. గవర్నర్‌ ముందు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడంతో రాష్ట్రపతి పాలన కోసం నివేదిక పంపించారు. కేంద్ర మంత్రివర్గం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించారు’’ అని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ను కలిసి సాయంత్రానికల్లా మద్దతు లేఖలు ఇవ్వడం కష్టమవుతుందని నిస్సహాయత వ్యక్తం చేయడంవల్లే గవర్నర్‌ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే పక్షం రోజులు గడిచిపోయినందువల్ల ఇంకో మూడు రోజుల సమయాన్ని ఇచ్చే పరిస్థితిలో తాను లేనని గవర్నర్‌ కేంద్రానికి నివేదించారు.

పావులు కదపడంలో భాజపా తెలివి
మొత్తం వ్యవహారంలో భాజపా తెలివిగా పావులు కదిపింది. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి తొలినుంచీ విముఖత చూపిన భాజపా.. ఫలితాలు వెలువడిన అక్టోబరు 24 నుంచి అసెంబ్లీ గడువు ముగిసే వరకు మౌనం వహిస్తూ వచ్చింది. చివరకు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. భాజపాతో విడిపోయి బయటికొస్తే కాంగ్రెస్‌, ఎన్సీపీలు బేషరతుగా మద్దతిస్తాయని శివసేన భావించింది. శివసేనకున్న ఇబ్బందులను అనుకూలంగా మలుచుకోవాలని భావించిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వకుండా జాప్యం చేసింది. ఎన్సీపీతో మాట్లాడాకే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పడంతో గవర్నర్‌ ఇచ్చిన గడువు జారిపోయింది.

అందుకేనా నాన్చివేత..?
తమకు దక్కని అధికారాన్ని ఎవ్వరికీ దక్కకుండా చేయడానికి భాజపా తొలినుంచీ పావులు కదిపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి, అసెంబ్లీ గడువు ముగిసిపోయి 48 గంటలైనా రాష్ట్రపతి పాలన విధించకపోతే శూన్యత ఏర్పడుతుందని, ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే విధిలేని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొనేందుకు ఒక వేదికను భాజపా సిద్ధం చేసిందని విశ్లేషిస్తున్నారు.

ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన ఎత్తేసే అవకాశం
అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టినందున సానుకూల వాతావరణం ఏర్పడితే ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన ఎత్తేసి, తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వొచ్చని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. భాజపా-శివసేనలు తిరిగి జట్టుగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత చూపొచ్చని, లేదంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఉమ్మడిగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు లేఖలు ఇచ్చినా అవకాశం ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

కేంద్ర మంత్రి సావంత్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అరవింద్‌ గణపత్‌ సావంత్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు ఆ శాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు. మహారాష్ట్రలో భాజపా-శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో సావంత్‌ రాజీనామా చేశారు.
గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన శివసేన 
సమయం ఇవ్వడానికి గవర్నర్‌ నిరాకరించడాన్ని సవాల్‌చేస్తూ శివసేన మంగళవారం సాయంత్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసింది. ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా తమకు సమయం ఇవ్వాల్సి ఉన్నా.. రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా గవర్నర్‌ తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. మెజార్టీ ఉందా? లేదా? అన్నది రాజ్యాంగబద్ధమైన సభావేదిక మీద తేలాలని, గవర్నర్‌ సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది. పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. సేన తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదించనున్నారు. రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాల్‌చేస్తూ రెండో పిటిషన్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనిని ఎప్పుడు దాఖలు చేయాలనేది బుధవారం నిర్ణయిస్తారు.

అడకత్తెరలో ఠాక్రే
కాంగ్రెస్‌, ఎన్సీపీలను నమ్ముకొని భాజపాతో మూడు దశాబ్దాల బంధాన్ని తెంచుకొని బయటికొచ్చిన శివసేనకు ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. అంతగా రాజకీయ అనుభవంలేని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే.. పావులు కదపడంలో జాప్యం చేయడం ఆయన్ని అడకత్తెరలో పోకచెక్కలా మార్చేసింది. ఆయనకు తాము తప్ప మరో గత్యంతరం లేదని భావిస్తున్న కాంగ్రెస్‌, ఎన్సీపీలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒకదశలో సుముఖత వ్యక్తం చేసినా, శరద్‌పవార్‌ డిమాండ్లతో ఆ ప్రయత్నం సాఫల్యం కాలేదని సమాచారం. తమకు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, కీలకమైన మంత్రిత్వ శాఖల్ని అప్పగించాలని ఎన్సీపీ డిమాండ్‌ చేసినట్లు మహారాష్ట్ర రాజకీయ వర్గాల కథనం.

 

కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో సూత్రప్రాయ ప్రాతిపదిక: ఠాక్రే
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలసి తమ పార్టీ ఒక సూత్రప్రాయ ప్రాతిపదికను రూపొందించేందుకు కృషి చేస్తుందని ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు. తమ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఆయన ముంబయిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌-ఎన్‌సీపీల సహకారంతో ప్రభుత్వం ఏర్పడితే వాటి మాదిరిగానే శివసేనకూ కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)పై స్పష్టత కావాలని అభిప్రాయపడ్డారు. ‘‘భాజపాకు ఇచ్చిన గడువు ముగియక ముందే మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలపమని కోరుతూ గవర్నర్‌ ఆహ్వానం పంపారు. 48 గంటల సమయం అడిగితే ఇవ్వలేదు. ఇప్పుడు ఆరు నెలల సమయం ఇచ్చినట్లైంది’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హిందుత్వ నినాదానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

త్వరలోనే సుస్థిర ప్రభుత్వం
ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం..రాష్ట్రపతి పాలన విధించడం దురదృష్టకరం. త్వరలోనే మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. 
- ఫడణవీస్‌, మాజీ సీఎం
కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలిసి కృషి
48 గంటల సమయం అడిగితే గవర్నర్‌ ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలసి ఒక సూత్రప్రాయ ప్రాతిపదిక కోసం కృషి చేస్తున్నాం.
- ఉద్దవ్‌ ఠాక్రే, శివసేన

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.