close
ఫిర్యాదులకు ప్రత్యేక సమయం

తహసీల్దారు కార్యాలయాలకు పోలీసు భద్రత
సిబ్బంది, అధికారులకు చట్టాలపై శిక్షణ
వెంటనే అమలు చేయాలని కలెక్టర్లకు భూ పరిపాలన శాఖ ఆదేశాలు
విజయారెడ్డి హత్య నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును కలవడం సాధ్యం కాదు. ఏదో ఒక ద్వారం నుంచి కార్యాలయానికి వెళ్లి వద్దామన్నా చెల్లదు. ఆవరణలో ఎవరేం చేస్తున్నారు? ఎవరొచ్చి వెళ్తున్నారనేది సీసీ కెమెరాల్లో నిక్షిప్తం చేస్తారు. ప్రజల నుంచి ఫిర్యాదులకు ప్రత్యేక సమయం కేటాయించనున్నారు. కార్యాలయాలకు పోలీసు భద్రతనూ కల్పించనున్నారు. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ ఐకాస (ట్రెసా) ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రం మేరకు పలు సమస్యలపై వెంటనే స్పందించాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ సీసీఎల్‌ఏ కార్యదర్శి హైమావతి బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆదేశాలివే...
* జిల్లాల్లోని రెవెన్యూ కార్యాలయాలన్నింటికీ పోలీసు భద్రత ఏర్పాటు చేయాలి.
* గ్రీవెన్స్‌ డే రోజు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు తీసుకునే సమయంలో కార్యాలయ సిబ్బంది అందరూ హాజరుకావాలి.
* తహసీల్‌ కార్యాలయాల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేయాలి.
* ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సమయం కేటాయించాలి.
* పాత కార్యాలయాలతోపాటు కొత్తగా మండలాలు ఏర్పాటైన చోట కనీస వసతులు కల్పించాలి. అధికారులకు ప్రత్యేక గదుల ఏర్పాటు, వసతులు పెంపొందించాలి.
* మెజిస్ట్రేÆట్‌ అధికారాలు ప్రతిబింబించేలా కోర్టు గది, అధికారుల కార్యాలయంలో ప్రత్యేకమైన నిర్మాణాలు ఉండాలి.
* కార్యాలయ ఆవరణతో పాటు లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
* రెవెన్యూ సిబ్బందికి, అధికారులకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.

విధులకు రెవెన్యూ ఉద్యోగులు
రెవెన్యూ ఉద్యోగులు బుధవారం ఎట్టకేలకు తహసీల్దారు కార్యాలయాల్లో అడుగుపెట్టారు. ఒక్కొక్కరు కాకుండా గుంపులుగా విధులకు హాజరయ్యారు. కొన్ని జిల్లాల్లో పోలీసు బందోబస్తు నడుమ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై మంత్రి కేటీఆర్‌, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌.. రెవెన్యూ ఐకాస (ట్రెసా) నాయకులను పిలిచించి చర్చలు నిర్వహించారు. భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ములుగు, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో తహసీల్‌ కార్యాలయాల వద్ద బందోబస్తు నిర్వహించారు.

తెరుచుకోని అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు కార్యాలయం
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు కార్యాలయం తలుపులు ఇంకా మూసుకునే ఉన్నాయి. తహసీల్దారు విజయారెడ్డి హత్య అనంతరం కార్యాలయం మూతపడింది. అప్పటి నుంచి సిబ్బంది విధులకు దూరంగా ఉన్నారు. అబ్దుల్లాపూర్‌ ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించినా ఆయన రానేలేదు. కార్యాలయాన్ని మరో భవనంలోకి మార్చితే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.


ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ట్రెసా

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు తమ ఆందోళనను విరమించి బుధవారం విధులకు హాజరైనట్లు ట్రెసా-రెవెన్యూ ఐకాస నేతలు రవీందర్‌రెడ్డి, చంద్రమోహన్‌, గౌతంకుమార్‌ బుధవారం ప్రకటించారు. ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయాల్లో భద్రతకి సంబంధించి కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పెన్‌డౌన్‌ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ఇతర రెవెన్యూ సంఘాల ఐకాస నేతలు వెల్లడించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.