close
అక్రమాస్తులు కక్కిస్తారు!

ఐఎంఎస్‌ కుంభకోణంలో కొత్తమలుపు
రంగంలోకి ఈడీ, ఆదాయపన్ను శాఖలు

ఈనాడు, హైదరాబాద్‌ : సంచలనం సృష్టిస్తున్న బీమా వైద్య సేవలు (ఐఎంఎస్‌) కుంభకోణం కొత్తమలుపు తిరగబోతోంది. ఇప్పటివరకూ అవినీతి నిరోధకశాఖ (అనిశా) దర్యాప్తు చేస్తుండగా త్వరలో ఆదాయపన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఈ రెండు సంస్థలు అనిశా నుంచి సంబంధిత పత్రాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఈడీ త్వరలోనే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. నియమనిబంధనలు తుంగలో తొక్కి ఈఎస్‌ఐ అధికారులు రూ.కోట్లు కొల్లగొట్టినట్లు అనిశా దర్యాప్తులో ఇప్పటికే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగేళ్ల కాలంలో సుమారు రూ.వెయ్యికోట్ల నిధులు మంజూరు కాగా వాటిలో నాలుగో వంతు అంటే దాదాపు రూ.250 కోట్లు గోల్‌మాల్‌  అయినట్లు ప్రాథమిక అంచనా.అనిశా అధికారులు నమూనాగా ఒకటి రెండు దస్త్రాలు విశ్లేషించినప్పుడే ఈ స్థాయి అవకతవకలు వెల్లడయ్యాయి. అన్ని దస్త్రాలు పరిశీలిస్తే కుంభకోణం విలువ భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గోల్‌మాల్‌ అయిన రూ. కోట్ల నిధులు ఎటు మళ్లించారో ఈడీ తేల్చనుంది. ఐఎంఎస్‌ కుంభకోణంతో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు అక్రమార్జన ద్వారా సమకూర్చుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేయనుంది. అనిశా దాఖలు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌.ను న్యాయస్థానం ద్వారా సేకరించి దాని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు అక్రమార్జనలతో ఈఎస్‌ఐ అధికారులు అడ్డగోలుగా ఖర్చులు పెట్టినట్లు, ఆస్తులు సమకూర్చుకున్నట్లు, విదేశీ పర్యటనలు చేసినట్లు ఇప్పటికే గుర్తించారు. వీరు వేతనంతో కూడిన ఆదాయానికి మాత్రమే పన్ను చెల్లించి ఉంటారని, మిగతా ఆదాయానికి పన్ను చెల్లించకపోవడంపై ఆదాయపన్నుశాఖ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారని ఓ అధికారి వెల్లడించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.