close
ఫాస్టాగ్‌ లేకుంటే టోల్‌ తీస్తారు!

ఒకటో తేదీ నుంచి రెట్టింపు!
ఫాస్టాగ్‌ ఉంటే పాత ఛార్జీలే
డిసెంబరు ఒకటి నుంచి జాతీయ రహదారుల్లో ఎలక్ట్రానిక్‌ వసూళ్లు
బ్యాంకులు, ఆన్‌లైన్‌లోనూ ఫాస్టాగ్‌ విక్రయాలు
అన్ని టోల్‌గేట్ల వద్ద నాలుగేసి విక్రయ కేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ రహదారుల్లో ఫాస్టాగ్‌ లేకుండా రాకపోకలు సాగించే వాహనదారుల జేబులకు చిల్లే. చెల్లించాల్సిన మొత్తం కన్నా రెట్టింపు కట్టాల్సిందే. క్యూలో అధిక సమయం వేచి ఉండాలి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌(ఈటీసీ)విధానంలో టోల్‌ఛార్జీలు వసూలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆ విధానం ఉన్నా ఐచ్ఛికంగా ఉంది. టోల్‌ప్లాజాల వద్ద సమయం వృథాకాకుండా ఉండేందుకు ఇక నుంచి తప్పని సరి చేసింది. అన్ని టోల్‌ప్లాజాల్లో ఎలక్ట్రానిక్‌ చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. తెలంగాణ నుంచి వెళుతున్న అన్ని జాతీయ రహదారులకు చెందిన మార్గాల్లో ఈ విధానం అమలులోకి రానుంది. రాష్ట్రంలో 17 మార్గాల్లో టోల్‌ప్లాజాలున్నాయి.

ఫాస్టాగ్‌ ఏమిటి?  టోల్‌ఫ్లాజాలకు చెల్లించాల్సిన సొమ్ము ముందస్తుగా భద్రం చేసుకునేందుకు ఫాస్టాగ్‌ పేరుతో  ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ స్టిక్కరును రూపొందించింది.
* ఫాస్టాగ్‌ను జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు విక్రయిస్తున్నాయి. ఆన్‌లైన్‌ సంస్థలైన అమెజాన్‌, పేటీఎంలలో కూడా ట్యాగులను విక్రయించేందుకు వీలుగా జాతీయ రహదారుల సంస్థ ఒప్పందం చేసుకుంది. ఫాస్టాగ్‌ ధర వాహనాన్ని బట్టి ఉంటుంది. రూ.100 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని టోల్‌గేట్ల వద్ద కూడా నాలుగు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* ఫాస్టాగ్‌ తీసుకోవాలంటే పైన పేర్కొన్న బ్యాంకుల్లో వాహన ఆర్సీ, గుర్తింపు కార్డు(ఆధార్‌, పాన్‌, ఓటరు) జిరాక్సు కాపీలు రెండు సెట్లు... ఒక పాస్‌పోర్ట్‌సైజు ఫొటో.. తగిన రుసుం చెల్లించాలి.
* టోల్‌ప్లాజాల్లో ఉండే నిబంధనలన్నీ ఫాస్టాగ్‌తోనూ వర్తిస్తాయి. ఏదైనా వాహనం 24 గంటలలోపు తిరుగు ప్రయాణంలో ఒకే టోల్‌ప్లాజాకు వస్తే, పూర్తి రుసుం కాకుండా రాకపోకలకు కలిపి అయ్యే మొత్తాన్నే తీసుకుంటుంది.

పరిమిత వరుసల్లోనే నగదు వసూలు
డిసెంబరు ఒకటో తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఛార్జీలను నగదు రూపంలో చెల్లింపునకు పరిమిత సంఖ్యలోనే కౌంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదాహరణకు కొన్ని కేంద్రాల్లో ఒక్కో వైపు ఆరు టోల్‌గేట్లు ఉంటే కేవలం రెండింటిని మాత్రమే నగదు చెల్లింపులకు కేటాయించాలని నిర్ణయించింది. ఒక వరుసలో నాలుగు గేట్లు ఉంటే ఒక్క మార్గంలోనే నగదు రూపంలో ఛార్జీలు వసూలు చేస్తారు.


రాయితీ వర్తిస్తుంది

వచ్చే నెల ఒకటో తేదీ అన్ని టోల్‌ప్లాజాల్లో ఈటీసీ విధానం ద్వారా టోల్‌ఛార్జీలను వసూలు చేయనున్నాం. ఫాస్టాగ్‌ లేని పక్షంలో టోల్‌ఛార్జీ రెండింతలు కానుంది. ప్రస్తుతం రాకపోకలకు ఒకేదఫా సొమ్ము చెల్లించిన పక్షంలో వాహనదారులకు కొంత రాయితీ లభిస్తుంది. ఈటీసీ విధానంలో కూడా ఆ రాయితీ అమలు అవుతుంది. 24 గంటల్లో ఆ వాహనదారుడు వెనక్కు వచ్చిన పక్షంలో ఆ రాయితీ యథావిధిగా ఫాస్టాగ్‌ ఖాతాలో జమ అవుతుంది. 24 గంటలుదాటిన పక్షంలో ఎలాంటి రాయితీ రాదు. తెలంగాణలో 13 మార్గాల్లో ఈటీసీ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. మిగిలిన నాలుగు మార్గాల్లో ఈటీసీ యంత్రాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెలాఖరుకు అందుబాటులోకి తీసుకువస్తాం. కొన్ని మార్గాల్లో ఇప్పటికే 40 శాతం వరకు ఫాస్టాగ్‌ తీసుకున్నారు.

- ఆరేపల్లి కృష్ణప్రసాద్‌, ప్రాంతీయ అధికారి, ఎన్‌హెచ్‌ఐఏ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.